– మండిపడ్డ మంత్రి అనుచరులు
నవతెలంగాణ-మరిపెడ
డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ బీఆర్‌ఎస్ పార్టీని విడదీసి పాలిస్తున్నారని, ఇప్పటికైనా వారి వైఖరిలో మార్పు రావాలని మంత్రి సత్యవతి రాథోడ్ అనుచరులు, బీఆర్‌ఎస్ జిల్లా నాయకులు కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీటీసీ గంధసిరి అంబరీష, మరిపెడ మేజర్ గ్రామ మాజీ సర్పంచ్ పానుగోతు రామ్ లాల్, మెంచు అశోక్, అబ్జల్ పాషాలతో కలిసి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. ఎమ్మెల్యే రెడ్యానాయక్ పర్యటించిన ప్రాంతంలో ఎక్కడ గొడవ జరిగినా మంత్రి సత్యవతి అనుచరులే గొడవలు చేస్తున్నారని ఆమెపై బహిరంగ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మంత్రి 2018 ఎమ్మెల్యే ఎన్నికల్లో తనకు సపోర్ట్ చేయలేదని ఎమ్మెల్యే ఆరోపించడం సరైంది కాదన్నారు. ఆమె లేకపోతే మీరు గెలిచే వారా.. అని ప్రశ్నించారు. వాళ్లు పాత తెలుగుదేశం పార్టీ వాళ్లు, తాము పాత కాంగ్రెస్ పార్టీవాళ్లమంటూ రెండు గ్రూపుల మధ్య గెట్టుపెట్టి బీఆర్‌ఎస్ పార్టీని విభజించి పాలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఆయన కింద కమిటీ వేసుకొని ఆ కమిటీ చెప్పిన వాళ్ళకే సంక్షేమ పథకాలు ఇస్తున్నారని, మంత్రి అనుచర గ్రామాలకు ఇవ్వడం లేదని విమర్శించారు. మా గ్రామాల ప్రజలు అర్హులు కాదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి ఏమొచ్చినా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, గ్రంథాలయ చైర్మెన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్న గ్రామాలకే పెడతారన్నారు. వారు చేసే తప్పిదాలపై ప్రభుత్వం దగ్గర నివేదిక ఉందని, ఇప్పటికైనా పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తనూ కలుపుకొని పని చేయాలని కోరారు.