దూతకు.. ప్రేక్షకుల స్పందన అద్భుతం

దూతకు.. ప్రేక్షకుల స్పందన అద్భుతంనాగ చైతన్య ‘దూత’ వెబ్‌ సిరీస్‌తో ఓటీటీలోకి గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ వెబ్‌ సిరీస్‌కి విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వం వహించారు. ప్రియా భవానీ శంకర్‌, పార్వతి తిరువోతు, ప్రాచీ దేశారు ఇతర కీలక పాత్రలు పోషించారు. నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బ్యానర్‌ పై శరత్‌ మరార్‌ నిర్మించారు. ఈనెల 1 నుంచి ప్రైమ్‌ వీడియోలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో ప్రసారమైన ‘దూత’ వెబ్‌ సిరీస్‌ యునానిమస్‌ బ్లాక్‌ బస్టర్‌ రెస్పాన్స్‌తో బిగ్గెస్ట్‌ ఓటీటీ హిట్‌గా ప్రేక్షకులని అలరిస్తోంది. ఈ నేపథ్యంలో నిర్మాత శరత్‌ మరార్‌ మీడియాతో మాట్లాడుతూ, ”దూత’తో ఓటీటీలో మాసీవ్‌ బ్లాక్‌బస్టర్‌ సాధించడం, ప్రేక్షకుల నుంచి గొప్ప స్పందన రావడం సంతోషాన్ని ఇచ్చింది. నాగచైతన్య, విక్రమ్‌.. టీం అంతా రిజల్ట్‌ పై చాలా హ్యాపీగా ఉన్నారు. లాంగ్‌ ఫార్మట్‌ స్టొరీ టెల్లింగ్‌ అనేది ఇండియాలో కొత్త ఫార్మాట్‌. కొన్ని సిరీస్‌లు వచ్చినప్పటికీ ఇంకా కొత్త ప్రపంచంలోకి అడుగుపెడుతున్నట్లే. ఈ క్రమంలో చేసిన ప్రాజెక్ట్‌కు ఇంత మంచి స్పందన రావడం వండర్‌ఫుల్‌ ఎక్స్‌పీరియన్స్‌. దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ ఈ కథ చెప్పినప్పుడు ‘దూత’ ఆలోచన, కాన్సప్ట్‌ చాలా నచ్చింది. ఆయన అద్భుతమైన కథకుడు. కాన్సెప్ట్‌ కూడా చాలా యూనిక్‌గా ఉంటుందని ముందే తెలుసు. అయితే ఈ ఆలోచనని ఎనిమిది ఎపిసోడ్స్‌గా ఎలా మలుస్తారనే క్యురియాసిటీ ఉండేది. కొన్ని నెలలు తర్వాత ఎపిసోడ్స్‌ వారీగా కథ చెప్పారు. అద్భుతంగా అనిపించింది. తర్వాత అమెజాన్‌ వాళ్ళు పార్ట్‌నర్స్‌గా వచ్చారు. గొప్పగా సపోర్ట్‌ చేశారు. క్రియేటివ్‌గా చాలా ఫ్రీడమ్‌ ఇచ్చారు. బ్రహ్మనందం తనయుడు గౌతమ్‌ పాత్రని అందరూ సర్‌ప్రైజ్‌గా ఫీలవుతున్నారు. పవన్‌కళ్యాణ్‌తో మూడు సినిమాలు చేశాను. మంచి కథ కుదిరితే ఆయనతో తప్పకుండా సినిమా చేస్తాను. అలాగే మా అబ్బాయిని దర్శకుడిగా ఎప్పుడు పరిచయం చేస్తారని అందరూ అడుగుతున్నారు. తను పర్మిషన్‌ ఇచ్చిన వెంటనే దర్శకుడిగా లాంచ్‌ చేస్తా’ అని అన్నారు.

Spread the love