దశాబ్ది సంబురానికి వేదికలైన చెరువు గట్లు..

నవతెలంగాణ – గోవిందరావుపేట
ఊరూరా చెరువుల పండుగతో మురిసిన పల్లెలు వేడుకలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య, ఎస్పీ గౌస్ అలం. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు చెరువు గట్లు వేదికలయ్యాయి. జలకళతో తొణికిసలాడుతున్న చెరువుల వద్దకు గురువారం ఊరూరా ప్రజలు తరలివచ్చి ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. బోనాలు, బతుకమ్మలు, వలల ప్రదర్శనలతో ఎటు చూసినా వెల్లివిరిసిన ఉత్సాహంతో పండుగ వాతావరణం కనిపించింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గోవిందరావు మండలం గ్రామం బుస్సాపూర్ లక్నవరం చెరువు కట్ట పై ఊరూరా చెరువుల పండుగ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య, ఎస్పి గౌస్ ఆలం తో కలిసి పాల్గొన్నారు. గ్రామస్తులతో పాటు పరిసర గ్రామాల ప్రజలు స్వచ్చందంగా తరలివచ్చి ఈ వేడుకలో భాగస్వాములయ్యారు. రంగురంగుల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలను పేర్చి, ఆడపడుచులు గౌరమ్మను కొలుస్తూ బతుకమ్మ గేయాలు పడుతూ మహిళలు ఉత్సహంగా పాల్గొన్నారు.తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను ఆవిష్కరిస్తూ, చెరువుల పండుగ అట్టహాసంగా సాగింది. చెరువుల ఔన్నత్యాన్ని చాటుతూ, గోరెటి వెంకన్న ఆలపించిన  గేయాల రికార్డింగులు ఆలోచింపజేస్తూ అందరిలోనూ  జోష్ నింపాయి. చెరువు గట్టున కట్ట మైసమ్మకు  పూజలు చేసి కలెక్టర్, ఎస్పీ సహపంక్తి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మిషన్ కాకతీయ కార్యక్రమంతో చెరువులన్నీ పూర్వ వైభవాన్ని సంతరించుకున్నాయని అన్నారు. పూడికతీత పనులతో చెరువుల్లో నీటి నిల్వ సామర్ధ్యం పెరగడంతో పాటు భూగర్భ జలాలు గణనీయంగా వృద్ధి చెందాయన్నారు. నీటి సౌలభ్యం అందుబాటులోకి రావడంలో పంటల సాగు భారీగా పెరిగిందన్నారు. రాష్ట్ర అవతరణ జరిగి తొమ్మిది సంవత్సరాలు ముగిసినందున 21 రోజులపాటు ప్రత్యేక రాష్ట్రంలో సాధించిన ఘనతలు, విజయాలను చాటి చెప్పేందుకు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని, ఈరోజు ఊరూరా చెరువుల పండగ వేడుక జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి తుమ్మల హరిబాబు, ఎంపీపీ సూడి శ్రీనివాస్ రెడ్డి. డిఆర్డిఓ నాగ పద్మజ, తాసిల్దార్ రాజ్ కుమార్ , ఎంపీడీవో ప్రవీణ్, సర్పంచ్ సింగం శ్రీలత చంద్రయ్య సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love