బాలసాహిత్యంలో తెలంగాణ భాషా సౌందర్యం ‘జోర్దార్‌ కతలు’

తెలంగాణ ఉద్యమం తర్వాత సాహితీవేత్తలు తెలంగాణ భాషలో రచనలు చేయడం ప్రారంభించారు. అయితే తెలంగాణ ఏర్పడక ముందు కూడా తెలంగాణ భాషలో అనేక రచనలు వచ్చాయి. కానీ, వాటికి రావలసనంత గుర్తింపు రాలేదు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రముఖ బాలసాహితీవేత్త పైడిమర్రి రామకృష్ణ తాజా బాలల కథల సంపుటి ‘జోర్దార్‌ కతలు’ .
ఈ కథలన్నీ కూడా తెలంగాణ భాషలో రాశారు. అన్ని ప్రాంతాల బాలలకు అర్థమయ్యేలా సరళ మాండలికంలో రాశారు. కొన్ని తెలంగాణ భాషా పదాలకు అనుబంధంగా అక్కడక్కడ ప్రధాన భాషను చేర్చారు.
ఇలా రాయటం వల్ల పైన ఇచ్చిన మాండలిక పదానికి మరో వాక్యంలో సులభంగా అర్థం తెలుసుకోగలుగుతారు. ఈ ‘జోర్దార్‌ కతలు’ సంపుటిలో మొత్తం 12 కథలున్నాయి. ఈ కథలు గతంలో పత్రికల్లో ప్రచురించబడి పాఠకుల మన్ననలు పొందినవే కావటం విశేషం. తెలంగాణ భాష, యాస, మాండలికాలపై పట్టుకున్న రచయిత పైడిమర్రి రామకృష్ణ.
ఈ కథలన్నీ కూడా బాలల్లో వ్యక్తిత్వ వికాసాన్ని, ఆనందాన్ని కలిగిస్తూ మనసును రంజింప చేసే కథలే!. ఈ కథల సంపుటిలో మొదటి కథ ‘ఉల్టా – పల్టా’. చివరి కథ ‘మారిన కోతి’. ఈ సంపుటిలోని కథల్ని పరిశీలిస్తే ఇందులో తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రాణహిత, కిన్నెరసాని, భద్రాచలం, పాకాల వంటివి బాలలకు పరిచయం చేస్తారు. జంతువులు, పక్షులే ప్రధాన పాత్రలుగా రాసిన కథలు. తాంబేలు, గుడ్డెలుగు, శిల్క, లొట్టిపిట్ట వంటి తెలంగాణ భాషా పదాలు, ఇగురం, జప్పున, సాల్పుల, యవ్వారం, మాలెస్క ఇలాంటి తెలంగాణ సొగసైన పదాలు సంపుటి నిండా ఉంటాయి. కేంద్రసాహి త్య అకాడమీ పురస్కార గ్రహీత చొక్కాపు వెంకటరమణ ముందుమాటలో పేర్కొన్నట్టు.. కొలతలకందని ఆప్యాయతల కలబోత. మొలకెత్తిన స్వచ్ఛమైన అనుభూతుల జిలుగు నేత. తెలంగాణ భాషామాత. ఆ భాష సొగసు, గొప్పదనం తెలుసు కోవాలంటే ఈ ‘జోర్దార్‌ కతలు’ చదవాల్సిందే! ఈ సంపుటికి అందమైన ముఖచిత్రంతో పాటు, లోపలి కథలకు తెలంగాణకు చెందిన ప్రముఖ చిత్రకారులు వడ్డేపల్లి వెంకటేశ్‌ అందించారు.
– మహంకాళి స్వాతి, 8919773272

Spread the love