– స్కూల్లో మొదలైన గొడవకు లవ్ జిహాద్ రంగులద్దుతున్న బీజేపీ
నవతెలంగాణ-హైదరాబాద్ : ఛత్తీస్‌గఢ్ లోని బెమతర జిల్లాలో ఉన్న చిన్న గ్రామం బిరాన్‌పూర్. సుమారు 1500 కుటుంబాలు. ఇందులో 1200 దాకా హిందువులవి కాగా 300 ముస్లిం కుటుంబాలు. దేశంలోని లక్షలాది గ్రామాల మాదిరిగానే ఇక్కడా హిందూ – ముస్లిం కుటుంబాలు తరతరాలుగా కలిసిమెలిసి జీవనం కొనసాగిస్తున్నాయి. కానీ గ్రామ ప్రజలు ఇంత శాంతియుతంగా కలిసుండటం చూసి కన్నుగొట్టిన కొన్ని శక్తులు.. ఊళ్లో అశాంతిని రేపాయి. స్కూల్లో మొదలైన ఓ చిన్న గొడవను రాష్ట్రవ్యాప్త సమస్యగా మార్చి ఆ మంటలో చలిగాచుకుంటున్నాయి. ఇప్పటికే ముగ్గురి ప్రాణాలు కోల్పోయి, వందలాది కుటుంబాల మధ్య సఖ్యత పోయి అభద్రతా భావం నడుమ బతుకుతున్న బిరాన్‌పూర్ స్టోరీ ఇది..
నవతెలంగాణ-హైదరాబాద్ : ఛత్తీస్‌గఢ్ లోని బెమతర జిల్లాలో ఉన్న చిన్న గ్రామం బిరాన్‌పూర్. సుమారు 1500 కుటుంబాలు. ఇందులో 1200 దాకా హిందువులవి కాగా 300 ముస్లిం కుటుంబాలు. దేశంలోని లక్షలాది గ్రామాల మాదిరిగానే ఇక్కడా హిందూ – ముస్లిం కుటుంబాలు తరతరాలుగా కలిసిమెలిసి జీవనం కొనసాగిస్తున్నాయి. కానీ గ్రామ ప్రజలు ఇంత శాంతియుతంగా కలిసుండటం చూసి కన్నుగొట్టిన కొన్ని శక్తులు.. ఊళ్లో అశాంతిని రేపాయి. స్కూల్లో మొదలైన ఓ చిన్న గొడవను రాష్ట్రవ్యాప్త సమస్యగా మార్చి ఆ మంటలో చలిగాచుకుంటున్నాయి. ఇప్పటికే ముగ్గురి ప్రాణాలు కోల్పోయి, వందలాది కుటుంబాల మధ్య సఖ్యత పోయి అభద్రతా భావం నడుమ బతుకుతున్న బిరాన్‌పూర్ స్టోరీ ఇది..
ఏం జరిగింది..?
కొన్నాళ్ల క్రితం బిరాన్పూర్కు చెందిన తారా అనే యువతి అదే గ్రామానికి చెందిన ముస్లిం యువకుడు సాజిత్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. దీనిపై గ్రామం భగ్గుమంది. అయితే ఆ యువతి మాత్రం.. ‘నేను నా ఇష్టానుసారం పెళ్లి చేసుకున్నా.. నా మీద బలవంతం ఏమీ లేదు. నేను ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నా..’అని పోలీస్ స్టేషన్ లో అందరి సమక్షంలోనే చెప్పింది. తారా వాదన ఇలా ఉంటే గ్రామస్థులు, కుల పెద్దలతో పాటు ఇటువంటి సమస్యలు తలెత్తిన చోట తనకు ఏమైనా ఎంగిలి మెతుకులు దొరక్కపోతాయా అని గోతి కాడి నక్కలా చూస్తున్న మత మూకల వాదన మరోలా ఉంది. వాళ్లు తారా లవ్‌ను ‘లవ్ జిహాద్’గా మార్చారు.
తారా వివాహం అనంతరం గ్రామంలో సర్పంచ్ తో పాటు పెద్దమనుషులు, గ్రామస్థులు ఊళ్లో ఉన్న మర్రి చెట్టు కింద పంచాయితీ పెట్టారు. ముస్లిం యువకులు హిందూ అమ్మాయిలను ప్రేమ మత్తులో దింపి వారిని మతమార్పిడికి గురి చేస్తున్నారని ఆరోపిస్తూ.. ఇకనుంచి గ్రామంలో ముస్లిములెవరూ హిందూ స్త్రీల జోలికి రాకూడదని.. అలా చేస్తే రూ. 3 లక్షల జరిమానాతో పాటు ‘కఠిన శిక్షలు’ ఎదుర్కోవాల్సి వస్తుందని ఫత్వా జారీ చేశారు. దీనికి గ్రామస్థులు కూడా అంగీకారం తెలిపారు.
పిల్లల మనసులు చెడగొట్టి..
తారా – సాజిత్ ల లవ్‌ను ‘లవ్ జిహాద్’గా చిత్రీకరించడంతో పాటు ఆ గ్రామంలో ఉన్న హిందూ కుటుంబాల్లో విధ్వేషం నింపడంలో అతివాద హిందూత్వ శక్తులు సఫలమయ్యాయి. ఫలితంగా ఊళ్లో అరుగు మీద కూర్చుని ముచ్చట్లు పెట్టుకునే గ్రామస్థులతో పాటు స్కూల్‌కు వెళ్లే పసి మనసుల్లో కూడా ఈ విషం నిండింది. స్కూల్ లో పిల్లలు కూడా ఇదే చర్చ. ఇదే క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్ 8న బిరాన్‌పూర్ గ్రామంలోని పాఠశాలలో.. రోజూ మాదిరిగానే ఆరోజూ స్కూల్ కు వెళ్లిన ముస్లిం పిల్లలను లక్ష్యంగా చేసుకుని పలువురు విద్యార్థులు.. వారితో ‘జై శ్రీరామ్’ అనాలని వాగ్వాదానికి దిగారు. అక్కడే ఉన్న మరో విద్యార్థి నీళ్లు తాగుతుంటే అతడి చేతిని లాగి గ్లాస్ తో గాయపరిచేందుకు యత్నించారు. ఈ గొడవ పెరిగి పెద్దదై ఇరు వర్గాల పిల్లలు కొట్టుకునేదాకా వెళ్లింది.
ఈ విషయం ఆనోటా ఈనోటా పాకి గ్రామానికి చేరింది. అప్పటికే అశాంతితో ఉన్న బిరాన్‌పూర్.. ఈ వార్తతో ఉడికిపోయింది. ఇరు వర్గాలూ వాగ్వాదాల స్థాయికి దాటిపోయి రాళ్లు రువ్వుకోవడం, ఇండ్లు తగలబెట్టడం దాకా చేరింది. ఈ క్రమంలో భువనేశ్వర్ సాహు (22) అనే ఓ యువకుడితో పాటు రహీమ్ మహ్మద్ (55), అతడి కుమారుడు ఇదుల్ (35) ప్రాణాలు కోల్పోయేదాకా వచ్చింది. ఫలితంగా బిరాన్‌పూర్ తో పాటు ఆ చుట్టుపక్క గ్రామాల్లో కూడా పోలీసులు 144 సెక్షన్ ను విధించారు. గడిచిన నెల రోజులుగా అక్కడ శాంతి భద్రతలను కాపాడటం పోలీసులకు కత్తిమీద సాములా మారింది.
బీజేపీ, భజరంగ్ దళ్ ఎంట్రీ..
తారా – సాజిత్ వివాహం తర్వాత దీనిని బిరాన్‌పూర్ వరకే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్త సమస్యగా మార్చింది బీజేపీ. సాహు సమాజ్ సమితిని తీసుకొచ్చి బిరాన్‌పూర్ లో హిందూవులతో ప్రతిజ్ఞ చేయించడంతో పాటు సోషల్ మీడియాలో దీని గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ‘ఛత్తీస్‌గఢ్ ను జిహాద్గఢ్గా మార్చుతుంద’ని ఆరోపించింది. రాష్ట్రానికి చెందిన విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ), భజరంగ్ దళ్ వంటి హిందూత్వ సంస్థలతో పాటు బీజేపీ నాయకులు కూడా దీనిపై సామాజిక మాధ్యమాల్లో నెలరోజులుగా గగ్గోలు పెడుతూనే ఉన్నారు. ఈ మేరకు పది మంది దాకా బీజేపీ అగ్రనాయకులపై పోలీసులు కేసులు కూడా (విద్వేష వ్యాఖ్యలు చేసినందుకు) కేసు కూడా నమోదు చేశారు.
బీజేపీకి ఏం లాభం..?
వాస్తవానికి భువనేశ్వర్ సాహు మరణం, తారా-సాజిత్ ల వివాహం కంటే దీని ద్వారా మరో రకంగా లబ్ది పొందాలని చూస్తున్నది. ఈ ఏడాది ఛత్తీస్‌గఢ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. రాష్ట్రంలో సాహు కమ్యూనిటీ గెలుపోటములను డిసైడ్ చేసే స్థాయిలో ఉంది. ఆ రాష్ట్ర ఓటర్లలో 17-20 శాతం ఓట్లు సాహు వర్గానికి చెందినవే కావడం గమనార్హం. గతేడాది సాహు ఆధిపత్యం చెలాయించే ఏరియాలలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు పావులు కదుపుతున్న బీజేపీకి బిరాన్‌పూర్ ఒక అస్త్రం అయింది.
కాంగ్రెస్ రాజకీయాలు..
ఈ వ్యవహారంలో కాంగ్రెస్ కూడా పక్షపాతం చూపుతున్నది. బిరాన్‌పూర్ అల్లర్లలో భువనేశ్వర్ సాహుతో పాటు రహీమ్, ఇదుల్ మరణిస్తే.. ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్ మాత్రం సాహు కుటుంబానికి రూ. 10 లక్షల నష్టపరిహారాన్ని అందజేశారు. నెల రోజులు గడుస్తున్నా రహీమ్, ఇదుల్ కుటుంబాలకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం ఇస్తున్నట్టుగా ఎటువంటి ప్రకటనా రాలేదు.