నల్ల మొకం పిల్లి సచ్చిన ఎలుకను పట్టిందట

నల్ల మొకం పిల్లి
సచ్చిన ఎలుకను పట్టిందటఇండ్లడ్ల పిల్లిని సాదుకునేది ఎందుకంటే ఎలుకలను పట్టితందుకు. కుక్కలను సాదుకునేది ఎందుకంటే ఎవలన్న కొత్తోల్లు వస్తే మొరిగెతందుకు. సాదుకం జంతువులు మనుషుల్ల కల్సిమెల్సి ఉంటయి. కాళ్లల్ల తిరుగుతయి, మాటలు ఇంటయి. కొన్ని పిల్లులు ఎలుకను సూస్తే పట్టయి, ఒక్కోసారి వాటి పరిస్థితిని బట్టి అవి మెదులతయి. అట్లనే ఒకదాన్ని పట్టుక రమ్మంటే ఇంకో అక్కెరకు రాని వస్తువును తెస్తే, ఓటి చెయ్యిమంటే ఇంక ఆధ్వన్నం పనిచేసేటోల్లను చూసి ‘నల్లమొకం పిల్లి సచ్చిన ఎలుకను పట్టిందట’ అంటరు. సచ్చిన ఎల్కను అది పట్టుడేంది ఇచ్చంత్రం అంటరు. అయితె ఇంట్ల పిల్లి తిరుగుతేనే ఎల్కలు హడల్‌. అట్ల పిల్లి భయం ఉంటది. అప్పుడొక సామెత వాడుతరు. ‘పిల్లి లేనప్పుడే ఎల్కలు పొక్కల కెల్లి బయట తిరిగేది’ అంటరు. అంటే పెయ్యల భయం ఉన్నప్పుడే ఎవల భయంల వాల్లు ఉంటరు.
రొయ్యలు ఎక్కుడున్న పిల్లికి వాసన వస్తది. అందుకే వాటిని అర్రల ఎక్కన్నో దాచిపెడుతరు. అయితె ఎవల నుంచి దాచిపెట్టాలనుకున్న వస్తువు వాల్లకే ఇస్తే అంతే సంగతులు. మాయం చేసుడు ఖాయం. ఇలాంటి సందర్భంలో ‘పిల్లికి రొయ్యల మొలతాడు కట్టినట్లు’ అంటరు. ఎండు రొయ్యలు అంటే పిల్లికి ఇష్టం. మరి దానికే కడితే తన చుట్టు తాను తిరిగి తెంపుకొని తింటది.
కొందరు పిసినాశి వాల్లు ఉంటరు. వాల్లు ఎవలకు ఏం పెట్టరు కాని అందరి దగ్గర తింటరు. అయితే ఎంతటి కఠినాత్ముడైనా పెరుగన్నంతో తింటుంటే మ్యావ్‌ మ్యావ్‌ మని వచ్చే పిల్లికి అన్నం వేస్తరు. కానీ పిసినాసివాల్లు అసలు వేయరు. పైగా దాన్ని ఎల్లగొట్టి గొల్లెం బెడుతరు. అసొంటోల్లను ‘పిల్లికి బిచ్చం పెట్టడు’ అని ఈసడించుకుంటరు. అయితె అసొంటివాల్లకు ఏదైనా అయితె ఎవలు దగ్గరకి పోరు. అప్పుడు వాల్లు ‘పిల్లికి పట్టిన కోడి పిల్ల’ లెక్క వుంటరు. అంటే పిల్లి అందుకొని సగం కొరికిన కోడిపిల్ల భయం భయంగా ఉన్నట్లు అని అర్ధం.
– అన్నవరం దేవేందర్‌, 9440763479

Spread the love