ఊదుకాలది పీరిలేవది

ఊదుకాలది పీరిలేవదివ్యవహారంలో కొందరు ఉషారుగ ఉంటరు. మరికొందరు ‘మంజరగున్న లెక్క ఉంటరు’. మంజరగున్న అంటే కదలని మొదలని పాము లెక్క అన్నట్టు. ఉషారు మనుషులు ఏదన్న పని మొదలు పెడితే పర్ర పర్ర చేసికపోతరు. ఉపాయంతోని ఉంటరు. కదలని మెదలని స్లో మనుషులు ఏదన్న పని మొదలుపెడితే వీరితోని ‘ఊదుకాలది పీరి లేవది’ అంటరు. అంటే పీరిలపండుగ (మొహర్రం) రోజు పీరలకు దేవుడు తెప్పిచ్చి ఊరేగిస్తరు. పీరులు ఊగాలంటే ఊదుపొగ కాల్వాలె. అయితే ఊదుపొగ కాలది, ఆ పీరి ఎగురది అనే అర్ధంలో ఈ సామెత వాడుతరు. అంటే వానితోని ఏ పని కాదననట్టు. అలాంటోల్లనే వాడు ‘ఊరు మీద ఉరు పడ్డా పంటె లేవడు’ అంటరు. కొందరు నిద్ర మొకం వాల్లుంటరు. ఎప్పుడు పండుకునుడే కాని చురుకుదనం ఉండదు. అలాంటివాల్లను ఇలా వ్యవహరిస్తరు. కొందరు ఆడవాల్లకు మొగడు ఏం పనిచేయడు. అంతా ఇంటి వ్యవహారం భార్యనే చూస్తది. పేరుకే మొగడు. తింటడు తిరుగుతడు పంటడు. ఇలాంటోల్లకు నడుస్తది. అయి వాల్ల పట్ల అనుకునేది ఏంది అంటే ‘ఉబ్బసం మొగడు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే’ అనే సామెత వాడుకుంటరు. ఉబ్బసం వ్యాధి తీవ్రంగా ఉన్నప్పుడు శ్వాస తీసుకోవడమే కష్టం. ఇగ బతికి బట్టకట్టడం.. ఉన్నా లేకున్నా ఒక్కటే అన్న రీతిలో మాట్లాడుతరు. ఒక్క సామెత చెప్పుతే ఇగ ఆ మనిషి గూర్చి పూర్తి వివరంగా వివరించాల్సిన అవసరం లేకుండా అతికినట్టు ఉంటది. ఊరుకు ఆనుకునే మక్కచేను ఉంటే మక్క కంకులన్నీ తరచూ మాయం అవుతాయి. అందుకే వ్యవసాయం ఊరుకు దూరం ఉండాలంటారు. పూర్వకాలంలో చేను చెరకల్లో పెరిగే కొత్తిమీర, కరివేపాకు, బంతిపూలను ఉత్తగనే తెంపుగపోయేవాల్లు. అందుకే ‘ఊరిపక్కన చేనుంటే అందరు దొంగలే’ అనే సామెతను వాడుతుంటరు. ఇటువంటి చిన్న దొంగతనాలు చేసేవాల్లను పెద్దగ తిట్లు తిట్టరు. పైగా తెల్సినవాల్లే అయితరు. ఏమన పెద్దగ కొట్టుడో కోప్పడుడో చేస్తమంటే ‘ఊరిపిష్కమీద తిటికాయ పడ్డట్టు’ అయితది అని ఊరుకుంటరు.
– అన్నవరం దేవేందర్‌, 9440763479

Spread the love