కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఇంట్లో 24 ఏండ్ల యువకుడి మృతదేహం..

నవతెలంగాణ -పాట్నా: బీహార్‌  అధికార కూటమిలో భాగస్వామి అయిన కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఇంట్లో ఓ యువకుని మృతదేహం లభించింది. అనుమానాస్పదంగా ఉండటంతో అతడిని చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. నవాడా జిల్లాలోని కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యే నీతూ సింగ్‌  ఇంట్లో 24 ఏండ్ల యువకుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడు పీయూశ్‌ సింగ్‌ అని, అతడు నీతూ సింగ్‌కు వరుసకు అల్లుడు అవుతాడని జిల్లా ఎస్పీ అంబ్రిశ్‌ రాహుల్‌ తెలిపారు. అయితే గత కొన్ని నెలలుగా ఎమ్మెల్యే ఆ ఇంట్లో ఉండటం లేదని చెప్పారు. ప్రస్తుతం ఆ ఇంటిని నీతూ సింగ్‌ బావమరిది కుమారుడైన గోలూ సింగ్‌  వాడుకుంటున్నాడని వెల్లడించారు. అతని గదిలోనే పీయూశ్‌ మృతదేహం శనివారం రాత్రి 7 గంటల సమయంలో పీయూశ్‌ అక్కడికి వెళ్లాడని, తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారని వెల్లడించారు. గోలూ సింగ్‌ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతనికోసం గాలిస్తున్నామని చెప్పారు. ఘటనా స్థలాన్ని ఫోరెన్సిక్‌ బృందం పరిశీలించిందని, పోస్టుమార్టం అనంతరం అసలు విషయాలు తెలుస్తాయని పేర్కొన్నారు.

Spread the love