పుస్తకం కలిపింది

The book is included‘హలో… నమస్కారమండీ… అశోక్‌ గారేనా…?!’
‘అవును’
‘ రచయిత అశోక్‌ గారేనా’
‘అవునండీ… అవును’
అవతలి గొంతు మత్తుగా పలికింది. ఫ్రస్ట్రేషన్‌లో కూడా వున్నట్లుంది.
‘ప్రఖ్యాత రచయిత అశోక్‌ గారేనా’
‘ అయ్యా బాబు… ఇప్పటికే పలుసార్లు అడిగారు నామవాచకాలు సర్వనామాలు విశేషణాలు… ఇప్పుడు ఆ విశేషణాలు అందరికీ ఉన్నాయి. రచయిత, ప్రఖ్యాత రచయిత, ప్రముఖ రచయిత, ప్రజా రచయిత. మీరనుకుంటే అందులో నేను కూడా ఒకణ్ణి. ముసలి గొంతు ఖరాకండిని వొలకపోసింది.
‘అవునులేండి… చిన్న, సన్న, కొత్త, సీనియర్‌ రచయితలు కూడా ఉపమానాలున్నాయి. రచయితలు అందరూ ప్రముఖులే. వెటకారంగ అనట్లేదు. సృజించడం అంటేనే గొప్ప.’
‘ఇంతకూ… మీరు ఎవరు?!’
‘ నేను ఎవరినో తర్వాత చెబుతాను గాన, మీ మొదటి కల సంపుటి కలల సాగు మీ దగ్గర ఉన్నదా…
‘ నా మొదటి కథల సంపుటి ఇంకా మిగిలి ఉన్నదా…? అప్పుడెప్పుడో గాని అచ్చు వేసింది ఇప్పుడు దొరకటం కష్టం కదా. ఒక్కటి వుండే, అదికూడా దొరకటం లేదు.’
‘నా దగ్గర ఉంది మీకు పంపమంటారా? మూడవ ముద్రణ’
‘చాలా బాగుంటుందండి పంపితే’ ముసలి గొంతు ఆశ అత్యుత్సాహంతో పలికింది.
‘ఇంతకు మీరు ఎవరు?’
‘నేను సత్యాన్ని’
‘సత్యమా ఏ సత్యం…’
‘మీ మొదటి కథల సంపుటి అచ్చు వేయించడానికి సహకరించిన వాడిని’
‘అరె…రె… సత్యం నువ్వా. ఎంత కాలమైంది నిన్ను చూసి, నీతో మాట్లాడి. ఎనభై ఏండ్లు వచ్చినై, దానితో పాటు మతిమరుపూ. అయినా చాలా గ్యాప్‌, ఫోన్లో ఎలా గుర్తు పట్టేది’
ఒకప్పటి పరిచయం మళ్లీ నీవు… నీవు… పలకరింపులోకి వచ్చింది.
‘నేనేదో సెంట్రల్‌ డిపార్ట్‌మెంట్లో ఉండేటోన్ని. నువ్వేమో హైదరాబాద్‌లో. నీ గురించి ఇతరులతో విచారిస్తే ఊర్లోనే ఉన్నావని తెలిసింది’
‘ఫోన్‌ నెంబర్‌ ఎలా దొరికింది’
కలల సాగులోనే ఉంది. పబ్లిషర్‌ వాళ్ళు మూడో ముద్రణ వేశారు గదా అందులో మొబైల్‌ నెంబర్‌ ఉంది’
‘మొత్తానికి పుస్తకం మళ్ళీ కలిపింది. ఆ క్రెడిట్‌ కలలసాగుకే. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావ్‌?’
‘చివరగా ఢిల్లీలో పని చేశాను. అక్కడే రిటైర్‌ అయ్యాను. పిల్లలు విదేశాల్లో ఉంటున్నారు. ఒకరు అమెరికా, ఇంకొకరు కెనడా. నేనూ మా ఆవిడ అక్కడెక్కడో ఎందుకు అని విజయవాడలోనే పాత ఇంటినే కూల్చేసి కొత్తగా కట్టుకున్నాం. అక్కడే ఉంటున్నాను.
‘మా ఆవిడ రెండవ కరోనాలో ఇక్కడే చనిపోయింది. ప్రస్తుతం ఒంటరి వాణ్ణి’
‘అయ్యో సారీ… మీ శ్రీమతి చాలా మంచి మనిషి. మనం కలుసుకునేదెట్లా..?!
‘నువ్వేమో విజయవాడలో… నేనేమో హైదరాబాదులో. ఇద్దరం కలిసేది ఎట్లా?’
‘ఒకరివద్దకి ఇంకొకరు రావాలి..’
‘నేనే నీ దగ్గరికి రావాలి.’
సత్యం, అశోక్‌ల మధ్య వున్నది గాఢమైన స్నేహ సంబంధం.
అక్షరం అశోక్‌ అయితే ఆలోచన సత్యం. అక్షర త్రోవ సత్యం అయితే అశోక్‌ అక్షర సాగు. సత్యం, అశోక్‌ లను పరిచయం చేసింది పుస్తకమే. తర్వాత ప్రతి సాయంత్రం కలుసుకునేవారు. కలిసి ఎన్నో సాహిత్య సభలకు వెళ్లేవారు. వీరు లేకుండా సాహిత్య సభ జరిగేది కాదు అనే స్థితికి వచ్చింది. ఒకరి అభిప్రాయం ఇంకొకరు పంచుకోకుండా సృజన జరగకపోయేది. ఒకరు సెంట్రల్‌ డిపార్ట్‌మెంట్‌, మరొకరు జర్నలిస్టు. వీరి స్నేహ బంధం సత్యం ప్రమోషన్‌ విడదీసింది. కాలం ఇంకా దూరం చేసింది. సత్యం బిజీగ ఉండటం వల్ల, అశోక్‌ దూరమయ్యాడు. అశోక్‌ తన వృత్తిలో నిమగమయ్యి ఉండటం వల్ల వృత్తిలో కొనసాగుతూ హైదరాబాద్‌లోనే ఉన్నాడు. వయసు మీద పడటం నిష్పక్షపాత ధోరణిలో రాయటం వల్ల అశోక్‌కి ఆరోగ్యం, ఉద్యోగం సరిగా లేవు. రెండు మూడు పత్రికలు మారాడు. విడువలేని నిష్పక్షపాత ధోరణి పలు పత్రికల నుండి మారేటట్టు చేసింది. చివరికి తనే వృత్తిని మానుకొని, జ్ఞాపకాలను, రచనలు మననం చేసుకుంటూ, గడుపుతూ డెబ్భై ఏళ్ల వయసును ప్రమోషన్‌గా పొందాడు. చేతకాని శరీరం మాత్రమే మిగిలింది. మనసు చైతన్యంగా ఉన్నప్పటికీ భౌతిక శరీరంతో జీవితం బందీ అయ్యింది. కాలానుగుణంగా రచనలకు దూరమైయిండు.
అలాగే సత్యం అశోక్‌ మధ్య కూడా దూరం పెరిగింది. కమ్యూనికేషన్‌ కట్‌ అయింది. కాలానిదే దోషం. ఇన్నేళ్ల తరువాత సత్యం ఫోన్‌ చేయడంతో మళ్లీ చిగురించింది.
చిగురించిన సంబంధం అశోక్‌ సత్యంల మధ్య కొత్త ఉత్తేజాన్ని నింపింది.
***
‘హలో సత్యం బాగున్నావా? ఏం చేస్తున్నావ్‌.?’
‘కొన్ని పాత పుస్తకాలు ఉంటేనూ సర్దుతున్న.’
‘రిటైర్‌ అయ్యాక ఏమైనా పని పెట్టుకున్నావా?’
‘ఏం చేస్తాను… విజయవాడలో ఎక్కడైనా సాహిత్య సభలు ఉంటే వెళ్లటం, వారానికోసారి దగ్గరి ప్రాంతాల్లో ఉన్న బంధువులను కలవటం, పాత, కొత్త పుస్తకాలు సేకరించడం, వాటిని తిరిగేయటం. ఏదో కాలక్షేపం చేయాలి కదా…!’
‘ఓ రోజు హైదరాబాద్‌ రారాదు’
‘హైదరాబాద్‌ కా… ఎందుకు రాను ఖచ్చితంగా రావాలి. కాస్త తీరిక తీసుకొని రావాలి. నీతో మాట్లాడటానికి రావాలి. ముచ్చట్లాడటానికి రావాలి. నీతో గడపటానికి రావాలి. బోలెడన్ని ముచ్చట్లు ఉన్నాయి. పంచుకునేటందుకు’
‘వచ్చేవారం రా. నేను నీ కొరకు వేచి చూస్తుంటాను. రెండు రోజులు గడిపి వెళ్ళాలి.
మొన్నటి ఫోన్‌ కంటే నేటి ఫోన్లో ముసలి గొంతు ుషారయ్యింది. హృదయ కలయికలు మనుషుల్ని ఇంకొంత కాలం జీవించడానికి తోడ్పడతాయి. వాస్తవమే. అశోక్‌, సత్యం కంటే వయసులో పెద్దోడు.
సత్యం, అశోక్‌ దగ్గరికి వచ్చినప్పుడల్లా అశోక్‌ అనే పిలుపు. సత్యం అనే ప్రతి పిలుపు ఉండేది.
***
‘హలో అశోక్‌ ఎలా ఉన్నావ్‌?’
‘ఎలా ఉండటం ఏంటి? ఈ ముసలి ప్రాణానికి నాలుగు రోగాలు, నలభై టాబ్లేట్లు. ఏమని చెప్పను.’
‘మొదట చెప్పు నువు ఎప్పుడు వస్తున్నావ్‌’
‘రేపు ఆదివారం వస్తున్నా రెండు రోజులు ఉంటాను’
‘ఇదిగో ముందే చెబుతున్నా, హడావుడి చేయకు. నీతో కబుర్లు చెప్పుకోవటానికి, వినడానికే వస్తున్న. అన్నట్టు నీ పుస్తకం కూడా పట్టుకొస్తా హైదరాబాద్‌లో అడ్రస్‌ చెప్పు’
‘వాట్సాప్‌ లోకేషన్‌ చూడటం వచ్చా’
‘వచ్చు. నేర్చుకున్న’
‘నేర్చుకునేదేముంది, టెక్నాలజీలో ముందునుండే హుషారువి కదా. సాయంత్రం పక్కింటి అబ్బాయి రాగానే లొకేషన్‌ షేర్‌ చేయిస్తాను. తప్పక రావాలి’
‘ఓకే… ఓకే…’
‘మర్చిపోకు నా కలల సాగును తీసుకురా’
దాన్ని ఎలా మరచి పోతాను. మళ్ళీ మనల్ని కలిపింది అదే కదా’
***
లొకేషన్‌ ప్రకారం ల్యాండ్‌మార్క్‌లు చెప్పగా అశోక్‌ డ్రైవర్‌ సత్యం ఇంటి ముందు ఆపాడు. కారు దిగకుండానే ఉత్సాహంతో ఉన్నాడు.
‘రా… సత్యం… లోపలికి రా…’ అశోక్‌ మాత్రం అమిత ఉత్సాహంతో అన్నాడు. కుర్చీ మీదనుంచి లేవలేకున్నా, సత్యం వద్దని వారిస్తున్నా సత్తానంతా కూడదీసుకొని సేఫ్టీ స్టాండ్‌ సహాయంతో లేచాడు. చేతులు కలుపుకున్నారు, ఆలింగనం చేసుకొన్నారు. ఉద్వేగాలు అదుపు తప్పాయి. కళ్ళు చెమ్మగిల్లాయి. ఎదురు సోఫా చూపించి కూర్చోమని సైగ చేశాడు. సత్యం కూర్చోగానే నీటి గ్లాసులో ప్రత్యక్షం అయ్యింది అశోక్‌ భార్య. కళ్ళు తుడుచుకుంటూ హాల్లోకి వచ్చింది.
‘ఎన్నేండ్లు అయ్యింది అన్న మనం కలవక. వదిన కూడ ఈ రోజు ఉండివుంటే ఎంత బాగుండేదో’
ఆడమనిషి లేని ఇంటి గురించి కష్టాలు మాట్లాడుకోలేం.
కాసేపు ఆమె జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. పిల్లల గురించి మాట్లాడుకున్నాక, అశోక్‌ తన లైబ్రరీని సత్యానికి చూయించటానికి తీసుకెళ్లాడు. పక్క గదిలో లైబ్రరీ. ఇద్దరు కాసేపు అక్కడే గడిపారు. సత్యం ఎదురుర్యాక్‌లో నచ్చిన పుస్తకాన్ని తీసి ిరిగేస్తున్నాడు. అశోక్‌ లైబ్రరీలో చాలా పుస్తకాలు ఉన్నాయి. విలువైన ుస్తకాలు. ఇప్పుడు ఎక్కడా దొరకని పుస్కాలు కూడా ఇక్కడ దొరుకుతాయి చాలానే. చాలారోజుల నుండి ఎక్కువగా వాడనట్లు ఉన్నారు, దుమ్ము దుమ్ముగా ఉంది. అశోక్‌ లైబ్రరీలో కూర్చుని కొన్ని పుస్తకాల గురించి చెబుతున్నాడు. తన పుస్తకాల గురించీ చెబుతున్నాడు.
‘అవునూ… నేను ఆ మధ్య ఫోన్‌ చేసినప్పుడు పాత పుస్తకాలు సర్దుతున్నా అన్నావు. పుస్తకాల సేకరణ అభిరుచి ఇంకా తగ్గలేదా…?’
‘తగ్గలేదు’
‘ఈ కలలసాగు ఎలా, ఎక్కడ దొరికింది?’
‘గతంలో ఓ సాహిత్య సదస్సుకు హైదరాబాద్‌ వచ్చినప్పుడు తెలంగాణ సాహిత్య పరిషత్‌ చుట్టుపక్కల ఉండే పాత పుస్తకాల స్టాల్‌కి వెళ్లా. నీ పుస్తకం దొరికింది. పాత పుస్తకాలు సేకరిస్తున్నాను. భద్రపరుస్తున్నాను. రచయితలు వదులుకున్నవి, రచయితలను వదులుకున్న వారు వదిలేసిన పుస్తకాలు చాలా మటుకు అక్కడ కనిపించాయి. మన సమయాన్ని ఇలా పుస్తకాలను సేకరించడానికి ఉపయోగించకూడదా.. అన్న ఆలోచనతో లైబ్రరీ స్థాపించాను. దానికి ఒక రీడింగ్‌ రూమ్‌ ఉంది. కాలక్షేపం కాని వాళ్ళు, అభిరుచి ఉన్నవాళ్లు లైబ్రరీకి వచ్చి చదువుకుంటున్నారు. వాళ్లే ఆ లైబ్రరీని నడిపిస్తుంటారు’
‘చాలా సంతోషం. మంచి పని చేస్తున్నావ్‌. సమాజానికి మేలు చేసే పని అప్పుడూ ఇప్పుడూ.. ఎప్పుడూ.. ‘
వంట రెడీ అయ్యుంటది, భోజనానికి వెళ్దాం పద’
భోజనం అయ్యాక కలల సాగును తీసి అశోక్‌కి ఇచ్చాడు. అశోక్‌ పుస్తకం కవర్‌ పేజీని తడిమి చూశాడు. పేజీలను బొటనవేలుతో వేగంగా తిప్పి చూశాడు. కొన్ని ఏళ్ల క్రితం తప్పిపోయిన పిల్లవాడు దొరికినంత ఆనందం అశోక్‌ కళ్ళల్లో కనబడుతుంది. అశోక్‌ పుస్తకాన్ని టీపారు మీద పెట్టాడు
‘అవును ఓ సంగతి మర్చిపోయాను. నిన్ను కలవడానికి ఇద్దరు మిత్రులను ఈ టయానికి రమ్మన్నాను. వస్తూ ఉంటారు’
‘ఎవరూ..?!
ఇక్కడి ఎమ్మెల్యే మనుషులు.’
‘వాళ్ళెవరో నాకేం పరిచయం లేదే’
‘కలవటానికి పరిచయమే కావాలా?’
***
‘రండి రండి లోపలికి రండి… సత్యం నువ్వుకూడా రా, కూర్చో.
ఇదిగో వీరు ఎమ్మెల్యే అసిస్టెంట్‌. వారు ఎమ్మెల్యే గారి బావమరిది. ఈయన ఈ మధ్యనే కవితలు బాగా రాస్తున్నారు. నావి వినడానికి, అతనివి వినిపించటానికి ఇక్కడికి వస్తూ ఉంటాడు.
‘నిన్న వచ్చినప్పుడు సత్యం వస్తాడు, వచ్చిన తర్వాత లుద్దాం అన్నాను, వచ్చారు’
‘ఏంటి విషయం..?!’
‘ఏమీ లేదండి లైబ్రరీ సంగతి ఏదో ఒక మాట అనుకుంటే’
‘అశోక్‌ కలగ చేసుకున్నాడు. ఇందాక చెప్పడం మర్చిపోయాను. మన లైబ్రరీని అంటే ఇందాక చూసిన లైబ్రరీని కొనడానికి వచ్చారు. గుడ్‌విల్‌ ఎంతో చెప్పమన్నారు. నేనెందుకు చెప్పటం నువ్వే చెప్పాలి’
‘లైబ్రరీ అమ్మడం ఏమిటీ, అందుకు నేను అనుమతి ఇవ్వడం ఏంటీ?’ అర్థం కాక సత్యం అన్నాడు
‘సరే సరే ఈరోజే వచ్చాను కదా. రేపు ఒకసారి కూర్చుందాం లేండి’ అన్నాడు కలవడానికి వచ్చిన మనుషులతో.
‘మీ నిర్ణయానికి ఎదురు చూస్తూ ఉంటాం. నమస్కారం’ అంటూ వెళ్లారు.
ఏమి అర్థం కాని సత్యం అశోక్‌ నన్ను ఇలా ఇరికించాడు ఏంట్రా అనుకున్నాడు.
‘ఏమీ లేదు సత్యం… వాళ్లు నా లైబ్రరీని కొనడానికి తరచూ ఫోన్లు చేస్తున్నారు. వస్తున్నారు. ఎమ్మెల్యేకి కాస్త పుస్తకాల అభిలాష ఎక్కువ. అందుకే రెండు మూడు సార్లు అడిగారు. నీకు ఫోన్‌ చేసిన తర్వాత, నీవు చేస్తున్న పని అర్థం అయ్యాక పుస్తకాలని నీకే ఇవ్వాలనుకున్న. ఇచ్చేశానని వాళ్లతో చెప్పా. అబద్ధం చెప్పిన. ఓ తియ్యటి అబద్దం. పుస్తకం ఎక్కడ క్షేమంగా ఉంటుందో నాకు అర్థం అయ్యింది. వాళ్లు ఫ్యాన్సీగా పుస్తకాన్ని చూస్తున్నారు. నువ్వేమో బాధ్యతగా చూస్తున్నావ్‌. అందుకే నీకే ఇస్తున్నాను. ఈ లైబ్రరీ పై సర్వహక్కులు నీకే ఉన్నాయి. వాళ్ళు వచ్చినప్పుడు అదే… ఈ లైబ్రరీని అమ్మడం లేదని నువ్వూ ఓ తియ్యటి అబద్దం చెప్పు. విజయవాడకి లైబ్రరీని షిఫ్ట్‌ చేసుకో. కావాలంటే ఖర్చులు నేనే భరిస్తాను. నన్ను కాదనకు.’
తనకు నచ్చిన రచయిత, ప్రఖ్యాత రచయిత పుస్తకాలు చేరుతున్నందుకు సంతోషపడ్డాడు. కానీ అశోక్‌ని పుస్తకాలనుండి దూరం చేయడం ఇష్టంలేదు. మరుసటిరోజు ఎమ్మెల్యే మనుషులకు రావద్దని సమాచారం అందింది. వాళ్ళు రాలేదు. ప్రఖ్యాత రచయిత గారి పుస్తకాలు సంరక్షణాలయానికి బయలుదేరాయి. కొంత కాలానికి అశోక్‌ కూడా. సాహిత్య వర్క్‌ షాప్‌ లు నిర్వహిస్తూ… సత్యం దగ్గరికి చేరుకున్నాడు అశోక్‌.

– వహీద్‌ ఖాన్‌, 9441946909

Spread the love