కితాబులు సరే… సిబ్బంది ఏరి?

– సైన్యాన్ని వేధిస్తున్న అధికారుల కొరత
– ఖాళీగా ఉన్న 11 వేల పోస్టులు
– వైద్య సిబ్బందీ వేరేే
న్యూఢిల్లీ : కార్గిల్‌ అమర వీరులకు దేశ ప్రజలు ఘనంగా నివాళులు అర్పిస్తున్న తరుణంలో ఇప్పటికీ సిబ్బంది కొరతతో ఇబ్బందులు పడుతున్న త్రివిధ దళాల పరిస్థితిని గురించి వింటే ఎవరికైనా ఆందోళన కలగక మానదు. ఎముకలు కొరికే చలిలో, ప్రతికూల వాతావరణంలో సైనికులు కంటికి రెప్పలా దేశాన్ని కాపు కాస్తుంటేనే మనం ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నామని గొప్పలు చెప్పుకోవడం తప్ప వారి అవసరాలను పాలకులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. సైన్యం, నౌకాదళం, వైమానిక దళంలో ఖాళీగా ఉన్న 11 వేల పైచిలుకు మేజర్‌, కెప్టెన్‌ వంటి యువ అధికారుల పోస్టులే త్రివిధ దళాల పట్ల ప్రభుత్వ ఉదాశీనతకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అధికారిక సమాచారం ప్రకారం భారత సాయుధ దళాలలో మేజర్‌, కెప్టెన్‌ సహా 11,266 ఆఫీసర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2022లో ఖాళీగా ఉన్న 9,797 పోస్టులు ఆ తర్వాత మరింత పెరిగాయి. అధికారుల కొరత సాయుధ దళాలలోని మూడు విభాగాలనూ ఇబ్బంది పెడుతోందని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజరు భట్‌ అంగీకరించారు. అయినప్పటికీ ప్రస్తుత సిబ్బంది అవసరాలకు సరిపోతారని చెప్పుకొచ్చారు. సైనిక దళంలో 2,094 మేజర్‌ ర్యాంక్‌ పోస్టులు, 4,734 కెప్టెన్‌ ర్యాంక్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నౌకాదళంలో 2,617 లెఫ్టినెంట్‌ కమాండర్‌, ఆ కింది స్థాయి పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఇక వైమానిక దళంలో స్క్వాడ్రన్‌ లీడర్‌ ర్యాంక్‌ కలిగిన 881 పోస్టులు, ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌ ర్యాంక్‌ కలిగిన 940 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
వైద్య సిబ్బంది కూడా…
కేవలం మేజర్‌, కెప్టెన్‌ ర్యాంక్‌ అధికారుల పోస్టులే కాదు…వైద్య సిబ్బంది పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నాయని మంత్రివర్యులు అంగీకరించారు. త్రివిధ దళాలలో 630 మంది వైద్యులు, 73 మంది దంత వైద్యులు, 701 మంది నర్సులను నియమించాల్సి ఉందని ఆయన తెలిపారు. వీటిలో సైన్యంలోనే అధిక ఖాళీలు ఉన్నాయి. ఆ దళంలో 598 మంది వైద్యులు, 56 మంది దంత వైద్యులు, 528 మంది నర్సుల పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. నౌకాదళానికి 20 మంది వైద్యులు, 11 మంది దంత వైద్యులు, 86 మంది నర్సుల అవసరం ఉంది. ఇక వైమానిక దళంలో 12 మంది వైద్యులు, ఆరుగురు దంత వైద్యులు, 87 మంది నర్సులను నియమించాల్సి ఉంది.
కారణం ఏమిటి?
కోవిడ్‌ సమయంలో నియామకాలు తగ్గడమే సిబ్బంది కొరతకు కారణమని మంత్రి అజరు భట్‌ చెబుతున్నారు. మరోవైపు షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) ద్వారా సహాయ సిబ్బంది నియామకాలు తగ్గిపోయాయని రక్షణ శాఖ అంటోంది. వాస్తవానికి సైన్యంలో అధికారుల నియామకాలను వేర్వేరు మార్గాల ద్వారా చేపడతారు. వీటిలో ఎస్‌ఎస్‌సీ ఒకటి. అక్కడ 11 నెలల పాటు శిక్షణ తీసుకున్న సిబ్బంది ఆఫీసర్‌ కేడర్‌లో చేరతారు. అనంతరం 10-14 సంవత్సరాలు సేవలు అందిస్తారు. సిబ్బంది కొరతపై లెఫ్టినెంట్‌ జనరల్‌ రామేశ్వర్‌ యాదవ్‌ వివరణ ఇస్తూ ‘సర్వీసు నిబంధనలు కఠినంగా ఉంటాయి. ప్రతిరోజూ ప్రాణాలకు ప్రమాదమే. సైన్యంలో వేతనాలు, ప్రోత్సాహకాలు, పదోన్నతులకు అవకాశాలు వంటివి సివిల్‌ సర్వీసులలో మాదిరిగా ఆకర్షణీయంగా ఉండవు. ఇంకో విషయమేమంటే కార్పొరేట్‌ రంగంలో ఆకర్షణీయమైన జీతాలు, ప్యాకేజీలు లభిస్తాయి. సిబ్బంది కొరతకు ఇవే ప్రధాన కారణాలు’ అని తెలిపారు. కాగా కొరతను అధిగమించేందుకు ప్రత్యేకమైన వ్యూహాలు ఏమైనా ఉన్నాయా అని మంత్రి భట్‌ను ప్రశ్నించగా అలాంటివేమీ లేవని బదులిచ్చారు. యూనిట్లలో కొరతను అధిగమించేందుకు కేంద్ర కార్యాలయాలలో పని చేసే స్టాఫ్‌ ఆఫీసర్ల నియామకాలను తగ్గించాలని సైన్యం యోచిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని రక్షణ శాఖ వివరణ ఇచ్చింది.
అధికారిక సమాచారం ప్రకారం 2022 నుండి ఇప్పటి వరకూ కేవలం 57 మంది మహిళా కేడెట్లను మాత్రమే నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ (ఎన్డీఏ) పరీక్ష ద్వారా నియమించారు. ఈ పరీక్షను యూపీఎస్‌సీ నిర్వహిస్తుంది. మహిళా కేడెట్ల నియామకం విషయంలో హర్యానా (19 మంది) మొదటి స్థానంలో ఉంది. తర్వాతి స్థానం ఉత్తరప్రదేశ్‌ది (12 మంది). ఎన్డీఏలో ఖాళీగా ఉన్న మొత్తం 57 మహిళా కేడెట్ల పోస్టులూ భర్తీ అయ్యాయని రక్షణ శాఖ తెలిపింది.
కార్గిల్‌ వీరులకు జాతి ఘన నివాళి
– నియంత్రణ రేఖ దాటేందుకు సిద్ధం : రాజ్‌నాథ్‌
కార్గిల్‌ వీరులకు జాతి ఘన నివాళి
న్యూఢిల్లీ : కార్గిల్‌ విజరు దివస్‌ సందర్భంగా జాతి యావత్తూ అమర జవానుల త్యాగాలను స్మరించుకొని వారికి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులలో శత్రు సైనికులతో వీరోచితంగా పోరాడి ద్రాస్‌, కార్గిల్‌, బటాలిక్‌ సెక్టార్లలో వారిని మట్టి కరిపించి, రణభూమిలో అశువులు బాసిన సాయుధ దళాల సైనికులకు నివాళి అర్పించింది. కార్గిల్‌ విజరు దివస్‌ 24వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సైనిక దళాలు లామోచన్‌ (ద్రాస్‌)లో కార్యక్రమాన్ని నిర్వహించాయి. దీనికి హాజరైన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అమరవీరుల స్మారక స్థూపం వద్ద పుష్పగుచ్ఛాన్ని ఉంచి నివాళి అర్పించారు. కార్గిల్‌ యుద్ధంలో వీర మరణం పొందిన సైనికుల కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. దేశ గౌరవాన్ని కాపాడేందుకు నియంత్రణ రేఖను దాటడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన వ్యాఖ్యానించారు. ఇందుకు ప్రజల మద్దతు కూడా అవసరమని కోరారు.

Spread the love