
నవతెలంగాణ- కంఠేశ్వర్
నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నుంచి అపహరణకు గురైన మూడేళ్ల బాలుడు అరుణ్ కథ సుఖాంతం అయ్యింది. ఉదయం నుంచి రంగంలోకి దిగిన పోలీసులు పెట్టకే లకు బాలుడిని గుర్తించారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో బాలుడిని పోలీసులు గుర్తించారు. ఆ వెంటనే అతన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. జిల్లా ఆస్పత్రిలో తన తండ్రి పక్కన నిద్రిస్తున్న బాలుడిని ఇద్దరు నిందితులు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఒకటో టౌన్ పోలీసులతో పాటు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి గాలింపు చేపట్టాయి. ఆర్మూర్ వైపు వెళ్లినట్లు గుర్తించి ఆ మార్గంలోని సీసీ కెమెరాలు పరిశీలించారు. ఆఖరుకు మెట్ పల్లిలో బాబు ఆచూకీని గుర్తించారు. త్వరలోనే తల్లిదండ్రుల చెంతకు చేర్చనున్నారు. గంటల వ్యవధిలోనే పోలీసులు కేసు ఛేదించిన తీరును పలువురు ప్రశంసిస్తున్నారు.