నవతెలంగాణ – ఉత్తర్‌ప్రదేశ్
ఓ వధువు చివరి నిమిషంలో పెండ్లి రద్దు చేసుకుంది. దండలు మార్చుకునే సమయంలో అకస్మాత్తుగా వరుడిని పెళ్లాడేది లేదని తెగేసి చెప్పింది. పెండ్లికొడుకు తాగి వచ్చాడని తెలిసిన వెంటనే ఈ నిర్ణయం తీసుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా సంచలనానికి దారి తీసింది. పూర్తి వివరాల్లోకి వెళితే, చౌబేపూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడికి జన్సా స్టేషన్ ప్రాంతానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. ఆదివారం రాత్రి ముహూర్తం ఖరారైంది. పెండ్లికొడుకు తన బంధువులు స్నేహితులతో కలిసి ఫంక్షన్ హాల్‌కు ఊరేగింపుగా వచ్చాడు. ఆ తరువాత వేదికపై నిలబడి దండలు మార్చుకునేందుకు రెడీ అయ్యాడు. వధువు కూడా తన స్నేహితులతో వైదికపైకి వచ్చింది. ఇంతలో మద్యంమత్తులో వరుడి స్నేహితులు వధువు వెంట వచ్చిన యువతులను చూసి పెద్ద పెట్టున కేకలు వేశారు. దీంతో, వరుడు కూడా మద్యం తాగినట్టు గుర్తించిన యువతి అప్పటికప్పుడు పెండ్లి రద్దు చేసుకుంటున్నట్టు చెప్పి వేదిక దిగి వెళ్లిపోయింది. ఇరు కుటుంబాల వారు వధువుకు సర్దిచెప్పేందుకు విశ్వప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది. చివరకు ఎవరిదారిన వారు వెళ్లిపోయారు.