ప్రేమికుడు దారుణ హత్య..ప్రియురాలి ఆత్మహత్య

నవతెలంగాణ-హైదరాబాద్ : కోయంబత్తూరులో తన కళ్లెదుటే మేనమామ చేతిలో ప్రేమికుడు దారుణ హత్యకు గురికావడంతో జీవితంపై విరక్తి చెందిన ప్రేమికురాలు ఉరివేసుకుంది. కోయంబత్తూరు సుందరాపురం గాంధీనగర్‌కు చెందిన ప్రసాద్‌(21), మైలాడుంపారైకి చెందిన ధన్య(18) అనే యువతిని ప్రేమించాడు. వీరి ప్రేమకు ఇరువైపు కుటుంబీకులు పచ్చజెండా ఊపారు. ఆ నేపథ్యంలో ఈ నెల నాలుగో తేదీ అర్ధరాత్రి ప్రసాద్‌ స్నేహితులతో కలిసి మద్యం తాగి, ధన్య పుట్టినరోజు సందర్భంగా ఆమె ఇంటి వద్దకు బర్త్‌డే కేక్‌ తీసుకెళ్లాడు. ఆ సందర్భంగా ధన్య తండి, మేనమామ విఘ్నేష్‌ కత్తితో అతడిని దారుణంగా హత్య చేశాడు. ఆ సమయంలో అక్కడే వున్న ధన్య ఆ దృశ్యాన్ని చూసి తీవ్ర దిగ్ర్భాంతి చెందింది. ప్రేమికుడి హత్యను తట్టుకోలేక దిగులుగా గడిపింది. మూడు రోజులకు ముందు విషం తాగి ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడింది. ఆ తర్వాత తల్లిదండ్రులు ధన్య గదిలో ఆమె అవ్వను కాపలాగా ఉంచారు. శుక్రవారం సాయంత్రం ధన్య ఉన్నట్టుండి తనకు కడుపునొప్పిగా ఉందని మందు ల షాపుకెళ్ళి మందులు తీసుకురమ్మని చెప్పింది. దీంతో ఆమె అవ్వ మందులషాపుకు వెళ్ళింది. అదే సమయంలో ధన్య తన గదిలో ఉరివేసుకుంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Spread the love