నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ క్యాబినెట్ సమావేశం ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మూడు గంటలకు పైగా కొనసాగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకల్ని ఘనంగా నిర్వహించాలని, ఈ వేడుకలకు ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియా గాంధీని ఆహ్వానించాలని క్యాబినెట్ నిర్ణయించింది. ధాన్యం కొనుగోళ్లపై పూర్తి బాధ్యత కలెక్టర్లకే అప్పగించారు. రైతులకు నష్టం జరగకుండా చివరి గింజ వరకూ కొనాలని సీఎం ఆదేశించారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్‌బాబు మీడియాకు వెల్లడించారు.
- అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే సేకరించాలని నిర్ణయం
- ఎంఎస్పీ కంటే ఒక్క రూపాయి కూడా తక్కువ చెల్లించకూడదని నిర్ణయం
- రాష్ట్రానికి అవసరమైన సన్న బియ్యం అంతా రాష్ట్రంలోనే సేకరిస్తాం
- సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్
- నకిలీ విత్తనాల విక్రయదారులపై కఠిన చర్యలు
- ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణకు రూ.600 కోట్లు కేటాయింపు
- అమ్మ ఆదర్శ పాఠశాల పనులపై మంత్రి శ్రీధర్‌బాబు అధ్యక్షతన కేబినెట్ సబ్‌కమిటీ
- కాళేశ్వరం ప్రాజెక్టులో మరమ్మతులు చేయాలని నిర్ణయం
- మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులపై నిపుణుల కమిటీ ఏం చెప్తే అది చేయాలని నిర్ణయం