నవతెలంగాణ హైదరాబాద్: మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేటితో ముగిసింది. బుధవారం చివరి రోజు కావడంతో అధికార, విపక్షాలు ముమ్మరం ప్రచారం నిర్వహించాయి. 230 అసెంబ్లీ స్థానాలున్న మధ్యప్రదేశ్లో శుక్రవారం పోలింగ్ జరగనుంది. అదే రోజు ఛత్తీస్గఢ్లో రెండో విడతలో భాగంగా 70స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. మధ్యప్రదేశ్లో బీజేపీ, కాంగ్రెస్, సమాజ్వాదీ, బీఎస్పీ, కమ్యూనిస్టు పార్టీలు బరిలో ఉన్నాయి. అయితే కాంగ్రెస్, బీజేపీల మద్యే ప్రధాన పోటీ ఉండనుంది. ఛత్తీస్గఢ్లోనూ ఈ రెండు పార్టీల మధ్యే తీవ్ర పోటీ నెలకొంది. మధ్యప్రదేశ్లో శుక్రవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు గాను 5.6కోట్ల ఓటర్లు పాల్గొననున్నారు. ఇందులో 2.88 కోట్ల మంది పురుషులు కాగా 2.72 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వీరిలో 22.36లక్షల మంది యువతీ యువకులు తొలిసారిగా తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. చివరి రోజు ముమ్మర ప్రచారం చేసిన ప్రధాని మోడీ.. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అటు కాంగ్రెస్ తరఫున ప్రియాంక గాంధీ ప్రచారం చేశారు. మరోవైపు సీపీఐ(ఎం) అభ్యర్ధులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రచారం నిర్వహించారు.