– 70 ఏళ్లనాటి స్థలం కబ్జా చేయడం హేయమైన చర్య
నవతెలంగాణ – పెద్దవంగర
స్మశాన వాటిక స్థలాన్ని కబ్జా చేయడం హేయమైన చర్యని పూసలి కులస్తులు తన్నీరు గురవయ్య, మున్నూరు రామ్ నారాయణ అన్నారు. ఆదివారం మండలంలోని చిట్యాల గ్రామంలో ఆక్రమణదారులు యథేచ్ఛగా కబ్జా చేసిన స్మశాన వాటిక స్థలాన్ని చూపించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు కబ్జా స్థలం వివరాలను వెల్లడించారు. గ్రామంలో పూసలి కుటుంబాలు 10 పైగా నివాసం ఉంటున్నాయని తెలిపారు. మా కులస్తులలో ఎవరూ మృతి చెందిన ఆ స్థలంలోనే గత 70 ఏళ్లు గా దహన సంస్కారాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మా పూర్వీకుల కాలం నుండి ఎవరు మృతి చెందిన ఆ స్థలంలోనే దహన సంస్కారాలు చేపడుతున్నామని చెప్పారు. ఈ స్థలాన్ని గ్రామానికి చెందిన రావుల తిరుమల రెడ్డి కబ్జా చేసి, ఆక్రమించుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల గ్రామానికి చెందిన పూసలి కులానికి చెందిన ఓ బాలుడు నీటి సంపులో పడి మృతిచెందాడు. దహన సంస్కారాల కోసం స్మశాన వాటికకు తీసుకెళ్లగా, లోపలికి వెళ్లకుండా చుట్టూ ముళ్లపొదలు వేసి, వరి నాటు పెట్టారని వాపోయారు. ఆ నీటిలోనే బాబు అంత్యక్రియలు చేశామని తెలిపారు. మా పూర్వీకుల సమాధులు సైతం ఆ స్థలంలోనే ఉన్నాయని, కబ్జాదారుడు సమాధుల చూట్టూ వరినాట్లు వేశారని పేర్కొన్నారు. దీనిపై అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కిషోర్, మధు, పూసలి కులస్తులు తదితరులు పాల్గొన్నారు.