– విద్యుత్ సంస్కరణలు అమలు చేయకుంటే ఆర్థిక ప్రయోజనాలు నిలిపేస్తున్న వైనం : కేరళలో జరిగిన ‘ఈఫీ’ వర్కింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయంనవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ సంస్కరణల్ని అమలు చేయకుంటే రాష్ట్రాలకు ఇవ్వాల్సిన ఆర్థిక ప్రయోజనాలను నిలిపివేస్తామని బాహటంగానే మోడీ సర్కార్ బ్లాక్‌మెయిల్ చేస్తున్నదని ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఈఫీ) ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యల్ని సహించేది లేదనీ, విద్యుత్ చట్ట సవరణ బిల్లు-2022ను అడ్డుకొని తీరతామని స్పష్టం చేసింది. కేరళలోని తిరువనంతపురంలో ఈనెల 21, 22 తేదీల్లో రెండ్రోజులపాటు జరిగిన ‘ఈఫీ’ వర్కింగ్ కమిటీ సమావేశాలు ముగిసాయి. ఈ సందర్భంగా శనివారంనాడక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఈఫీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎలమారం కరీం, ప్రశాంత ఎన్ చౌదరి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తేవాలని ప్రయత్నిస్తున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లు కార్పొరేట్లకు దోచిపెట్టేందుకు ఉద్దేశించిందేననీ, దీనివల్ల ప్రజలపై తీవ్రమైన ఆర్థికభారాలు పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కరెంటు చార్జీల పెంపుతో పాటు ప్రభుత్వ ఆస్తుల్ని వారికి ధారాదత్తం చేయడమే ఈ బిల్లు లక్ష్యమని వివరించారు. ప్రజలకు తీవ్ర నష్టాల్ని మిగిల్చే అ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విద్యార్థీ, యువజన, మహిళా, శ్రామిక సంఘాలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చి, మహౌద్యమాన్ని నిర్మిస్తామని చెప్పారు. దీనికోసం నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజినీర్స్ (ఎన్‌సీసీఓఈఈఈ)తో కలిసి పనిచేస్తామన్నారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థల్ని అదానీ గ్రూప్‌కు కట్టబెట్టేందుకు సమాంతర లైసెన్సులు ఇచ్చి, స్మార్ట్ మీటర్లను తెరపైకి తెచ్చారని వివరించారు. ఈ సంస్కరణలు అమలైతే ప్రజలపై తీవ్రమైన ఆర్థికభారాలు పడతాయని హెచ్చరించారు.
తెలంగాణ నుంచి…
కేరళ తిరువనంతపురంలో జరిగిన ‘ఈఫీ’ వర్కింగ్ కమిటీ సమావేశాల్లో తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్‌యూఈఈయూ) నుంచి వీ గోవర్థన్, ఈఫీ కార్యదర్శి కే ఈశ్వరరావు, వర్కింగ్ కమిటీ సభ్యులు వీ కుమారస్వామి, ఎన్ చారి పాల్గొన్నారు.