శాంతిభద్రతలపై కేంద్రం పెత్తనమేంది?

On law and order What is the center height?– వీక్షణం ఎడిటర్‌ వేణుగోపాల్‌పై కేసులెత్తేయాలి
– ఎన్‌ఐఎ జోక్యాన్ని తెలంగాణ సర్కార్‌ అడ్డుకోవాలి
– అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం చేయాలి : రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పలువురు వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సీనియర్‌ జర్నలిస్టు, వీక్షణం ఎడిటర్‌ ఎన్‌.వేణుగోపాల్‌పై ఎన్‌ఐఏ పెట్టిన తప్పుడు కేసులను వెంటనే ఎత్తేయాలని పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు. శాంతిభద్రతల అంశం రాష్ట్రాల పరిధిలోనిదనీ, దానిపై కేంద్ర ప్రభుత్వ పెత్తనమేంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎన్‌ఐఏ జోక్యాన్ని అడ్డుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఎన్‌ఐఏ సోదాలు చేయకూడదు, కేసులు పెట్టకూడదు అని అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్‌ చేశారు. వేణుగోపాల్‌ ఇంటిపై ఫిబ్రవరి ఎనిమిదో తేదీన ఎన్‌ఐఏ దాడి చేసి, అతని సెల్‌ ఫోన్‌ ఎత్తుకుపోయిన నేపథ్యంలో ‘జర్నలిస్టులపై ఎన్‌ఐఎ దాడులను ఖండించండి’ అనే పేరుతో వీక్షణం కలెక్టివ్‌ ఆధ్వర్యంలో బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబర్‌లో జర్నలిస్టుల రౌండ్‌టేబుల్‌ సమావేశాన్ని నిర్వహిం చారు. తెలంగాణ ప్రెస్‌ అకాడమీ చైర్మెన్‌ కె.శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ..పాలకుల లోపాలను ఎత్తిచూపుతూ మెరుగైన సమాజ నిర్మాణానికి సూచనలు చేసే జర్నలిస్టులపై ఎన్‌ఐఏ దాడులు చేయడం సరిగాదన్నారు. పాలకపక్షాలను ప్రశ్నిస్తే దేశద్రోహులని ముద్ర వేస్తారా? అని ప్రశ్నించారు. ప్రొఫెసర్‌ హరగోపాల్‌, వేణుగోపాల్‌పై కేసులను ఎత్తివేయించాలనే అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తాలని నిర్ణయించారు.. పౌరహక్కుల నేత, ప్రొఫెసర్‌ జి.హరగోపాల్‌ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలనూ నిర్వీర్యం చేస్తున్నదనీ, వాటిని రాజకీయ ప్రయోజ నాల కోసం వాడుకుంటున్నదని విమర్శించారు. చివరకు జర్నలిస్టుల భావప్రకటనా స్వేచ్ఛ మీదా దాడి చేస్తున్నారనీ, వీటిని సమాజంపై దాడిగా చూడాలని చెప్పారు. ప్రత్యామ్నాయ భావజాల విస్తరణకు ఫాసిజం అంగీకరించదనీ, అందులో భాగంగానే ఈ దాడులు జరుగుతున్నాయని అన్నారు. వీక్షణం సంపాదకుడితో పాటు అనేక మంది మీద గత ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసులను ఎత్తివేయాలనీ, ఉపా వంటి అక్రమ చట్టాలను ఉపయోగించవద్దని సూచించారు. రాజ్యాంగ, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఎన్‌ఐఏను రాష్ట్రాల్లోకి చొరబడకుండా అడ్డుకోవాలని పౌరసమాజానికి పిలుపునిచ్చారు. ఆంధ్రజ్యోతి పత్రిక సంపాదకులు కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ఒకప్పుడు స్వేచ్ఛగా అభిప్రాయాలు ప్రకటించే వెసులుబాటు ఉన్న ఏకైక వృత్తిగా ఉండిన జర్నలిజం పదేండ్లల్లో ఆ స్థానాన్ని పోగొట్టుకున్నదన్నారు. విధినిర్వహణలో ఉన్న జర్నలిస్టు సిద్ధిఖీ కప్పన్‌ను తప్పుడు కేసులో ఏండ్ల తరబడి జైలులో నిర్బంధించిన పరిణామాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. పాలకులు జర్నలిస్టుల విశ్వసనీయతను పోగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారనీ, అందులో భాగంగానే దాడులు, తప్పుడు కేసుల బనాయింపులు జరుగుతున్నాయని చెప్పారు. సీనియర్‌ జర్నలిస్టు కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ..రాష్ట్ర జాబితాలోని శాంతిభద్రత విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవడాన్ని తప్పుబట్టారు. ఇది సమాఖ్య స్ఫూర్తిని అవమానించడమేనన్నారు. టెర్రిరిస్టులపై పెట్టాల్సిన కేసులను జరల్నిస్టులపై ఎందుకు మోపుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రెస్‌ అకాడమీ మాజీ చైర్మెన్‌ అల్లం నారాయణ మాట్లాడుతూ.. వీక్షణం సంపాదకుడిపై కేసు, దాడులనేవి పాల కులందరిలోనూ పెరిగిపోతున్న అసహనానికి నిదర్శనమన్నారు.
వారు భిన్నాభిప్రాయాలను సహించలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పారు. భీమాకోరేగావ్‌ లాంటి హాస్యాస్పద కేసు ప్రపంచ చరిత్రలో ఎక్కడా నమోదు కాలేదని విమర్శించారు. సీనియర్‌ జర్నలిస్టు కల్లూరి భాస్కరం మాట్లాడుతూ.. వేణుగోపాల్‌ను సొంతిటిలో నాలుగుగంటల పాటు ఎన్‌ఐఏ వేధించడాన్ని ఖండించారు. నేడు దేశంలో పౌరుల హక్కులపై దాడి జరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ అధ్యక్షులు విరాహత్‌ అలీ మాట్లాడుతూ గత ప్రభుత్వం కొన్ని వందల మంది మీద ఇటువంటి తప్పుడు కేసులు బనాయించిందనీ, కొత్త ప్రభుత్వం ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటున్నది గనుక ఆ కేసులన్నింటినీ సమీక్షించి, ఉపసంహరించుకోవాలని కోరారు. ఎ.నర్సింహారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జనం సాక్షి ఎడిటర్‌ ఎం.రహమాన్‌, జర్నలిస్టు సంఘం నాయకులు మారుతీసాగర్‌, వీక్షణం ఎడిటర్‌ వేణుగోపాల్‌, బాల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Spread the love