కార్మికుల సొమ్మును దోచుకుంటున్న కేంద్రం

– కార్మిక వ్యతిరేక విధానాలను క్విట్‌ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో తిప్పికొడదాం.. : సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్‌
– హైదరాబాద్‌ సెంట్రల్‌ లేబర్‌ కార్యాలయం వద్ద మహాపడావ్‌
నవతెలంగాణ-అంబర్‌పేట
కార్మికుల సొమ్మును కేంద్ర ప్రభుత్వం రాబంధులా దోచుకుంటోందని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్‌ అన్నారు. క్విట్‌ ఇండియా దినోత్సవం సందర్భంగా దేశంలోని అన్ని కార్మిక, రైతు సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా మహాపడావ్‌ (మహాధర్నా) కార్యక్రమం రెండో రోజు హైదరాబాద్‌ శివం రోడ్డులోని సెంట్రల్‌ లేబర్‌ కార్యాలయం వద్ద గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్పొరేట్‌ అనుకూల బీజేపీ ప్రభుత్వం బరితెగించి ప్రజా, కార్మిక వ్యతిరేక పరిపాలన సాగిస్తోందన్నారు. జాతీయ సహజ వనరులు, ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు అమ్మేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. డీజిల్‌, పెట్రోల్‌, వంటగ్యాస్‌, నిత్యావసర సరుకుల ధరలు పెంచి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నదన్నారు. 2017లో ప్రధాని మోడీ పార్లమెంట్‌లో ఇచ్చిన కనీస మద్దతు ధర హామీ నేటికీ అమలు కాలేదన్నారు. 2023-24లో కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి, ఆహార ఉత్పత్తులకు, సబ్సిడీలకు భారీగా కోతలు విధించారని తెలిపారు. జీడీపీలో విద్యారంగానికి ఆరు శాతం, వైద్య రంగానికి రెండు శాతం కేటాయించకుండా నిర్లక్ష్యం చేశారని చెప్పారు. పౌరుల ప్రాథమిక హక్కులను హరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి, నిరుద్యోగం, అధిక ధరలు, ఆకలి, అసమానతలు, ఆరోగ్య రక్షణలాంటి ప్రాథమిక సమస్యలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పరిష్కరించకపోగా పెంచిందన్నారు. వ్యూహాత్మక అమ్మకాల పేరుతో ప్రభుత్వ రంగ సంస్థల్లో 100 శాతం వాటాలు తెగ నమ్ముతున్నదన్నారు. సీఐటీయూ నగర కార్యదర్శి ఎం.వెంకటేష్‌ మాట్లాడుతూ.. నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ పాలసీ ద్వారా మౌలిక వసతులను లీజు పేరుతో కార్పొరేట్లకు కేంద్రం ధారాదత్తం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక చట్టాలను నాలుగు లేబర్‌ కోడ్‌లుగా మారుస్తూ దుర్మార్గంగా చట్టం చేసిందన్నారు. ఇండియన్‌ లేబర్‌ కాంగ్రెస్‌ కార్మిక సంక్షేమం కోసం గతంలో చేసిన తీర్మానాలన్నీ నేడు చిత్తుకాగితాలుగా మారి పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు జె. కుమారస్వామి, వాణి, చంద్రశేఖర్‌, శ్రీనివాస్‌, ఏఐటీయూసీ నాయకులు యాదగిరి, ఐఎఫ్‌టీయూ నాయకులు ఎస్‌ఎల్‌ పద్మ, అనురాధ, అరుణ, టీఎస్‌టీయూసీ నాయకులు బోస్‌, రైతు సంఘాల నాయకులు సాగర్‌, రైతు కూలీ సంఘం నాయకులు రాయల చంద్రశేఖర్‌, భాస్కర్‌, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట సీఐటీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. హుజూర్‌నగర్‌ పట్టణంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. భువనగిరి జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. నల్లగొండ జిల్లా నల్లగొండ పట్టణంలో ఆర్డీఓ కార్యాలయం ముందు సీఐటీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మహాపడావు ధర్నా చేశారు.

Spread the love