– పెండింగ్ వేతనాలు చెల్లించాలి
– కూలీలకు సౌకర్యాలు కల్పించాలి : వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.నర్సిములు
– ర్యాలీ, కలెక్టరేట్ ఎదుట ధర్నా భారీగా తరలివచ్చిన కూలీలు
– ఉపాధి కూలీల ఆందోళనకు సీపీఐ(ఎం), వివిధ ప్రజా సంఘాల నేతల మద్దతు
నవతెలంగాణ-సంగారెడ్డి
ఉపాధి పనుల నుంచి కూలీలు, పేదలను దూరం చేసేలా ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.నర్సిములు అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ బకాయిలు వెంటనే ఇవ్వాలని, పని ప్రదేశంలో కనీస సౌకర్యాలు కల్పించాలనే నినాదాలతో వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సిములు మాట్లాడుతూ.. రెండు నెలలుగా ఉపాధిహామీ పనులు నిర్వహించిన కూలీలకు డబ్బులు ఇవ్వకపోవడం దారుణమన్నారు. కార్పొరేట్ శక్తులకు లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేస్తున్న ప్రభుత్వాలు ఉపాధి హామీకి రెండు లక్షల కోట్లు కూడా బడ్జెట్‌లో కేటాయించకపోవడం సిగ్గుచేటన్నారు. చేసిన పనులకు ప్రతివారం పే స్లిప్పులు ఇవ్వాలని, దాంతో రోజు కూలి ఎంత వస్తుందనేది కూలీలకు తెలుస్తుందనీ, ఎన్ని వారాల బకాయిలు తీసుకున్నారనే వివరాలు కూడా తెలుస్తాయని అన్నారు. ఝరాసంఘం మండలం బిడకన్య గ్రామంలో పనులు నిర్వహించి ఇంటికి వస్తున్న కూలీ మార్గమధ్యలో మరణించిందని, ఆ కూలీ కుటుంబానికి ప్రభుత్వం రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షులు బి.రామచందర్ మాట్లాడుతూ.. ఏడాదిలో కూలీలు అడిగినన్ని రోజులు పని దినాలు కల్పించాలన్నారు. పని ప్రదేశంలో ప్రమాదాలు జరిగితే ప్రయివేట్ హాస్పిటల్‌లో చూపించి, పూర్తిగా కోలుకునే వరకు సగం పేమెంట్ ఇవ్వాలని చట్టం చెబుతున్నా ఎక్కడా అమలు కావడం లేదని అన్నారు. బకాయి వేతనాలను వెంటనే ఇవ్వాలని, ప్రతివారం కూలీలకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జి. జయరాజు మాట్లాడుతూ.. 2005లో యూపీఏ ప్రభుత్వ హయాంలో వామపక్షాల ఒత్తిడి మేరకే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వచ్చిందన్నారు. నాటి నుంచి నేటి వరకు సీపీఐ(ఎం) ఉపాధి హామీ సమస్యలు వచ్చినప్పుడల్లా పోరాడుతుందన్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి. సాయిలు, కేెవీపీఎస్ జిల్లా అధ్యక్షులు ఏ. మాణిక్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కె. రాజయ్య ధర్నాకు మద్దతు తెలిపి మాట్లాడారు. రెక్కాడితేగాని డొక్కాడని పేదలు, దళితులు కూలీలుగా పని చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం పేదల నోటికాడి ముద్దను లాక్కునే ప్రయత్నం చేయడం సరైంది కాదన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం చేస్తున్న పోరాటంలో సంఘీభావంగా నిలబడతామన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు యాదగిరి, వ్య.కా.స జిల్లా ఉపాధ్యక్షులు ఏసోబు, నాయకులు జి.నర్సింలు, జి.రాజు, ఎం.రాజు, సుజాత, నర్సింలు, కుమార్, కృష్ణ, రాజేష్, నాగన్న, శ్రీనివాస్, లక్ష్మీ, జ్యోతి వివిధ గ్రామాల కూలీలు పాల్గొన్నారు.