కేంద్రం విద్వేషపూరిత వైఖరిని ప్రతిబింబిస్తుంది

– రుణ పరిమితి కోత నిర్ణయం సరికాదు
– ఈ సమస్య దేశం మొత్తాన్నీ ప్రభావితం చేస్తుంది : కేరళ సీఎం విజయన్‌
తిరువనంతపురం : కేరళ రుణ పరిమితిని భారీగా తగ్గించాలని మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయం రాష్ట్రం పట్ల కేంద్రం విద్వేషపూరిత వైఖరిని ప్రతిబింబిస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అన్నారు. కేంద్రం చేస్తున్న ఇలాంటి చర్యలు దేశంలోని సమాఖ్య పాలనా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నాయని తెలిపారు. కేరళలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న విజయన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్రం జీఎస్టీ వంటి తమ(కేరళ) ఆదాయ వనరులను తగ్గించిందనీ, కేరళ అభివృద్ధి అవకాశాల పట్ల వారి(కేంద్రం) వైఖరి ప్రతికూలంగా ఉన్నదని ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ” గత కొన్నేండ్లుగా మనం ఎన్నో విపత్తులను ఎదుర్కొన్నాం. కష్టకాలంలోనూ కేంద్రం మా హక్కు అయిన సహాయాన్ని నిరాకరించింది. ఒక రాష్ట్ర ప్రభుత్వం పట్ల కేంద్రం ఇలాంటి విద్వేష వైఖరిని అనుసరించటం సరికాదు” అని కేరళ సీఎం అన్నారు. ఈ సమస్య తమ రాష్ట్ర ప్రభుత్వ పరిధిని దాటి దేశం మొత్తాన్నీ ప్రభావితం చేస్తుందని ఉద్ఘాటించారు. మౌనం వహించటం వల్ల కలిగే పరిణామాలపై ఆలోచించాలనీ, బాధ్యుల అసలు రంగును గుర్తించాలని ఆయన ప్రజలను కోరారు. ఇటీవల సంవత్సరాలలో ఇప్పటికే అనేక ప్రకృతి వైపరీత్యాలను చవిచూసిన కేరళ ప్రజలకు కేంద్రం విధానం మరో విపత్తుగా మారిందని విజయన్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

Spread the love