నవతెలంగాణ – న్యూఢిల్లీ: ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియాకు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్, పని ఒత్తిడి కారణంగా చనిపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోన్న నేపథ్యంలో గురువారం కేంద్రప్రభుత్వం స్పందించింది. కేరళకు చెందిన అన్నా సెబాస్టియన్ పెరయిల్(26) కంపెనీలో పని ఒత్తిడిని తట్టుకోలేకే చనిపోయిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కార్మిక మంత్రిత్వ శాఖ అధికారికంగా ఫిర్యాదును స్వీకరించిందని, మరణానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు జరుగుతోందని కేంద్ర వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే ఎక్స్‌లో తెలిపారు. ఆ సందర్బంగా తల్లి అగస్టీన్‌కు జరిగిన నష్టంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రక్షణలేని దోపిడీ పని పరిస్థితుల ఆరోపణలపై సమగ్ర దర్యాప్తుతో న్యాయం జరిగేందుకు కృషి చేస్తామని ట్వీట్ చేశారు. కాగా ఎన్నో ఆశలతో ఉద్యోగంలో చేరిన తన కుమార్తె, కంపెనీలో పని భారాన్ని భరించలేక, ఎవరితోనూ చెప్పుకోలేక మానసిక క్షోభంతో చనిపోయిందంటూ కంపెనీ ఛైర్మన్ రాజీవ్ మెమానికి బాధితురాలి తల్లి అన్నాఅగస్టీన్ ఈమెయిల్ సమాచారం అందించింది. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరారు. కనీసం ఆమె అంత్యక్రియలకు కూడా ఎవరూ రాలేదంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలు కార్పొరేట్ కంపెనీల్లో పనిపరిస్థితులపై చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే.