నవతెలంగాణ – అమెరికా : కారును రివర్స్‌మోడ్‌లో పెట్టడంతో ప్రముఖ కంపెనీ సీఈఒ మృతి చెందిన ఘటన గత శుక్రవారం అమెరికాలో జరిగింది. అమెరికాలోని సంపన్నుల్లో ఒకరైన చావో కుటుంబానికి చెందిన ఏంజెలా (50) ప్రముఖ షిప్పింగ్ కంపెనీ ఫార్‌మోస్ట్ గ్రూప్‌నకు సీఈఒ గా పనిచేస్తున్నారు. ఆమెకు మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. అమెరికాకు చెందిన ప్రముఖ బిలియనీరు వెంచర్ క్యాపిటలిస్టు జిమ్ బ్రెయార్‌కు ఏంజెలా భార్య. అమెరికా మాజీ రవాణాశాఖా మంత్రి ఎలాయినే చావోకు ఆమె సోదరి. సెనెటర్ మిట్చ్ మెక్‌కొన్నెల్లేకు మరదలు వరుస అవుతుంది. గత శుక్రవారం రాత్రి ఆమె హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లోని తన స్నేహితురాళ్లతో కలిసి టెక్సాస్‌లోని ఆస్టిన్ సమీపంలోని తన ప్రైవేటు అతిథి గృహానికి వెళ్లారు. దాదాపు 900 ఎకరాల్లో ఇది విస్తరించి ఉంది. మిల్లర్ సెలయేరు ఇక్కడి నుంచి ప్రవహిస్తుంటుంది. ఓ రెస్టారెంట్‌లో రాత్రి వరకు గడిపి తిరిగి ప్రధాన భవనానికి బయలుదేరారు. మార్గమధ్యలో ఒక త్రీపాయింట్ టర్న్ వచ్చింది. దానిని దాటే క్రమంలో.. ఏంజెలా పొరబాటున తన టెస్లా ఎక్స్ ఎస్‌యూవీ కారును రివర్స్ మోడ్‌లోకి మార్చారు. అంతే ఆ కారు వేగంగా వెనక్కి వెళ్లి ఓ కొలనులో బోల్తాపడింది. వెంటనే తన స్నేహితురాలికి ఆమె భయంతో ఫోన్ చేశారు. కానీ, వాహనం తిరగబడటంతో వేగంగా నీటిలో మునిగిపోయింది. దీంతో ఆమె స్నేహితురాలు, అతిథి గృహం మేనేజర్, పోలీసులు అక్కడికి చేరుకొని ఏంజెలాను రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ, ఆమె వాడుతున్న టెస్లా కారులో అత్యంత బలమైన గ్లాస్‌ను వినియోగించడంతో కిటికి బద్దలు కొట్టడం అసాధ్యమైంది. అంతేగాక షాక్ కొడుతుందనే భయాలు సహాయకుల్లో నెలకొన్నాయి. ఎట్టకేలకు మరో వాహనం సాయంతో కారును నీటి బయటకు తీసి చూడగా.. అప్పటికే ఏంజెలా మృతి చెందినట్లు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.