కొండ దిగిన కోడి

– పడిపోయిన చికెన్ ధరలు
– స్కిన్ తో కీల రూ.130
– స్కిన్ లెస్ తో రూ.150 
– తాడిచెర్లలో తగ్గని ధరలు
నవతెలంగాణ మల్హర్ రావు
కోడి మాంసం ధరలు తగ్గాయి.వేసవిలో కిలో రూ.300 వరకు పలకగా ప్రస్తుతం సగానికి తగ్గింది.సాధారణంగా రూ.200 నుంచి రూ.250 వరకు ఉండే చికెన్ ధర ప్రస్తుతం గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం స్కిన్ లెస్ చికెన్ ప్రాంతాన్ని, కంపెనీ బట్టి కిలో రూ.150 నుంచి రూ.160 వరకు విక్రయిస్తున్నారు.స్కిన్ తో అయితే రూ.130 కె అమ్ముతున్నారు. కోడి (లైవ్ బర్డ్) కిలో రూ.70 నుంచి రూ.80 వరకు విక్రయిస్తున్నారు. ఇక హొల్ సెల్ ధరలు మరొకొంత తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం శుభకార్యాలు, పెళ్లిళ్లు జోరుగా సాగుతున్నప్పటికి చికెన్ అంతగా డిమాండ్ లేదు. ధర తగ్గడానికి అనెక కారణాలు ఉన్నాయని వ్యాపారులు, ఉత్పత్తి దారులు విశ్లేషిస్తున్నారు. మండలంలో ప్రతి ఆదివారం 5 క్వింటాళ్ల చికెన్ విక్రయం జరుగుతుండగా మండల కేంద్రమైనా తాడిచెర్ల ప్రతి రోజు రెండు క్వింటాళ్ల చికెన్ విక్రయం జరుగుతుందని వ్యాపారులు చెబుతున్నారు. చికెన్ ధరలు దిగిన నేపథ్యంలో మండలంలో అన్ని గ్రామాల్లో కిలో చికెన్ రూ.150 నుంచి రూ.170 వరకు తీసుకుంటే తాడిచెర్లలో మాత్రం కిలో రూ.220 తీసుకొంటున్నారని ప్రజలు వాపోతున్నారు.
పెరిగిన ఉత్పత్తి…
ప్రస్తుతం సీజన్ లో రైతులు కోళ్ల ఉత్పత్తిని గణనీయంగా పెంచారు. తెలుగు రాస్తాల్లో ప్రస్తుతం కోళ్ల ఉత్పత్తి బాగుందని రైతులు చెబుతున్నారు. ఓవైపు శుభకార్యాలు, మరో వైపు ఎన్నికల నేపథ్యంలో చికెన్ వినియోగం అధికంగా ఉంటుందని భావించిన రైతులు కోళ్ల ఉత్పత్తికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. అయితే ఉత్పత్తికి తగ్గ వినియోగం లేకపోవడంతో చికెన్ ధరలకు డిమాండ్ తగ్గింది.
అంచనాలు తలకిందులై రైతులు ఇక్కట్లు…
చికెన్ వినియోగంపై అంచనాలు తలకిందులు కావడంతో రైతులు ఇక్కట్లు పడుతున్నారు. ఒక పిల్ల ధర రూ.50 వరకు ఉంటుంది.ఇక కిలో బరువు వచ్చే వరకు కోడిని పెంచేందుకు రూ.100 ఖర్చువుతుంది. సాధారణంగా పరిశ్రమలలో రెండు కిలోల బరువు వరకు కోళ్లను పెంచుతారు.ఆ బరువుతో ఉన్న కోళ్లను నిల్వ ఉంచుకుంటే దాన ఖర్చు పెరుగుతుంది. దీంతో రైతులు ధరలను తగ్గించి విక్రయాలకు ప్రాధాన్యత ఇస్తుంటారు.ప్రస్తుతం ఇదే జరుగుతుంది. ఉత్పత్తికి తగిన విక్రయాలు లేకపోవడంతో ధర క్షిణించింది.
Spread the love