– ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకష్ణ మాదిగ
నవతెలంగాణ-హిమాయత్ నగర్
తెలంగాణ సాంస్కృతిక సారథి ఈ నెల 8న జారీ చేసిన సర్క్యులర్ ఉద్యోగులకు నష్టం కలిగించే విధంగా ఉందని, దీన్ని వెంటనే ఉపసంహ రించుకోవాలని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కృషి చేసిన ప్రజా గాయకుడు గద్దర్ కుమార్తె వెన్నెల గద్దర్ సారథికి చైర్మెన్‌గా ఉండి సర్క్యులర్ తీసుకురావడం బాధాకరమన్నారు. సారథిలో ఉన్న కళాకారులు ప్రయివేటు బహిరంగ సభలు, సమావేశాల్లో పాల్గొనకూడదని ఈ సర్క్యులర్ సారాంశమన్నారు. సీఎం ఎ.రేవంత్ రెడ్డి, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావులకు తెలియకుండానే ఈ సర్క్యులర్ జారీ చేశారని తాము భావిస్తున్నామన్నారు. రిజర్వేషన్ వర్గీకరణ అమలు కోసం ఫిబ్రవరి 7వ తేదీన వేల గొంతులు, లక్ష డప్పులు కార్యక్రమాన్ని అడ్డుకోవడం కోసం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకే ఈ సర్క్యులర్ తీసుకువచ్చారని ఆయన ఆరోపించారు. వెన్నెల గద్దర్ తన వైఖరిని మార్చుకోవాలని, లేని పక్షంలో ప్రభుత్వం ఆమెను సాంస్కృతిక సారథి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.