ఊసరవెల్లి సిగ్గుపడేలా మాటమార్చిన సీఎం

The CM who changed his words to shame the chameleon– టికెట్‌రేట్లు, అదనపు షోలకు అనుమతి
– సభను అవమానించడమే : మాజీ మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సినిమాలకు స్పెషల్‌ ప్రివిలేజ్‌ ఇచ్చేది లేదంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన సీఎం రేవంత్‌ రెడ్డి రెండు వారాల్లో ఊసరవెల్లి సిగ్గుపడేలా మాట మార్చారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పుష్ప-2 బెనిఫిట్‌ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మరణించిన నేపథ్యంలో ఇక మీదట స్పెషల్‌ ప్రివిలేజ్‌ ఇచ్చేది లేదంటూ సీఎంతో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిన మాటలు స్వల్ప వ్యవధిలోనే నీటి మూటలయ్యాయని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో ప్రకటించిన దానికే విలువ లేకపోతే ఎట్లా ? అని ప్రశ్నించారు. అసెంబ్లీని కూడా తప్పుదోవ పట్టిస్తూ టికెట్‌ రేట్లు, అదనపు షోలకు అనుమతివ్వడం సభను అవమానించడమేనని తెలిపారు. అసెంబ్లీని తప్పుదోవ పట్టించినందుకు ముఖ్యమంత్రిపై, మంత్రిపై సభా హక్కుల ఉల్లంఘన కింద ప్రివిలేజ్‌ మోషన్‌ పెడతామని వెల్లడించారు. మాట తప్పం, మడమ తిప్పం అంటూ బీరాలు పలికి ఇప్పుడు టికెట్‌ రేట్ల పెంపునకు ఎలా అనుమతి ఇచ్చారు? ఎవరికి లబ్ది చేకూర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? అని ప్రశ్నించారు. గతంలో సీఎం బెనిఫిట్‌ షోలకు, టికెట్‌ రేట్ల పెంపునకు అనుమతిచ్చినందునే ఒక మహిళ మరణించి, మరో పసివాడు ఇంకా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని గుర్తుచేశారు. ఈ పాపం రేవంత్‌ సర్కారుదేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ దురదష్ట ఘటనను మరిచిపోకముందే ఎందుకు ఈ యూ టర్న్‌? దీని వెనుక ఉన్న మర్మం ఏమిటి? అని నిలదీశారు.

Spread the love