ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్షుడితో సీఎం బృందం భేటీ

With the President of the World Bank CM team meeting– తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యంపై సంప్రదింపులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర అభివద్ధి ప్రణాళికల్లో భాగస్వామ్యం పంచుకునేందుకు ప్రపంచ బ్యాంక్‌ సంసిద్ధతను వ్యక్తం చేసింది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్షులు అజరు బంగాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో చేపట్టే వివిధ ప్రాజెక్టులకు కలిసికట్టుగా రోడ్‌ మ్యాప్‌ రూపొందించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. స్కిల్‌ డెవెలప్‌మెంట్‌, రివర్‌ ఫ్రంట్‌, పర్యావరణం, జీవనోపాధి, ఉద్యోగాలు, ఆర్థిక సుస్థిరతతో పాటు వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తమ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమాలన్ని ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయని చెప్పారు. ప్రజలకిచ్చిన మాట ప్రకారం తాము చేపట్టబోయే ప్రాజెక్టులన్నీ యుద్ధప్రాతిపదికన అమలు చేసి తీరుతామని ప్రకటించారు. అన్నింటిలోనూ పారదర్శకతను పాటిస్తామని స్పష్టం చేశారు. ప్రాంతాల వారీగా చేపట్టే ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాలు, వాటి అమలును వేగవంతం చేసేందుకు వివిధ విభాగాలకు చెందిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలనే ఆలోచనలను ప్రపంచబ్యాంక్‌ బృందంతో పంచుకున్నారు. రాష్ట్రంతో పాటు హైదరాబాద్‌ అభివృద్ధికి సీఎం అనుసరిస్తున్న సమతుల్య దృక్పథం మంచి ఫలితాలను అందిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వ పాలనా తీరును చర్చల్లో పాలుపంచుకున్న ప్రపంచ బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పరమేశ్వరన్‌ అయ్యర్‌ ఈ సందర్భంగా ప్రశంసించారు. ఈ సమావేశంలో సీఎంతో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్‌ బాబు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకష్ణారావు, సీఎంవో ఉన్నతాధికారులు శేషాద్రి, విష్ణువర్ధన్‌ రెడ్డి, అజిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love