నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
తొలకరిలో పశువుల అంటువ్యాధుల నివారణకు తేదీ.22.05.2024 నుండి 30.05.2024 వరకు జిల్లా వ్యాప్తంగా ఉచిత టీకాల కార్యక్రమం చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.వేసవి నుండి పచ్చి గడ్డి కనిపించక ఆబగా ఎదురు చూసే పశువులకు తొలకరి వర్షాలకి పెరిగే గడ్డి పిలకలు కనిపించగానే పెదాలకి అందీఅందని గడ్డిని మట్టితో సహా పశువులు తినటంతో మట్టిలో ఉన్న బాక్టీరియా, వైరస్ పశువుల శరీరంలోనికి వెళ్ళి విషపదార్దాలను విడుదలచేయడంతో గేదెలలో ప్రాణాంతక గురకావ్యాధి, గిత్తలు , పెయ్య లలో జబ్బవాపు , గొర్రెలలో చిటుకు రోగం ప్రబలుతాయని తెలిపారు. రైతులు ఏమాత్రం ఏమరు పాటుగా ఉన్నా చూస్తుండగానే పశువులు మరణించి కుటుంబాలకు తీరని ఆర్దిక నష్టం కలిగిస్తాయని తెలిపారు. ముఖ్యంగా గత అయిదు సంవత్సరాలలో ఎక్కడైనా ఈ వ్యాధులు సోకి ఉన్నట్లయితే ఆ ప్రాంతాల్లో ఈ వ్యాధులు త్వరగా సోకే అవకాశం ఉంటుంది . “చికిత్స కన్నా నివారణ మేలు అన్న నానుడిననుసరించి “ పశువైద్య , పశుసంవర్దక శాఖ రేపటినుండి వారం రోజుల పాటు ప్రత్యకంగా జిల్లాలో టీకాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమములో జిల్లా పశువైద్య అధికారులు,వైద్యులు సిబ్బంది అందరూ పశుపోషకుల్లో విస్తృత ప్రచారం కల్పించి తగు జాగ్రత్తలతో టీకా కార్యక్రమాన్ని విజయవంతం చేసి జిల్లాలో పశువుల సంరక్షణకు కృషిచేయాలని సూచించారు.