– యుఎన్ చీఫ్ గుటెరస్ స్పష్టీకరణ
– వచ్చే వారం ప్రారంభం కానున్న జనరల్ అసెంబ్లీ సమావేశాలు
ఐక్యరాజ్య సమితి : ప్రతి ఒక్కరి ప్రయోజనాల దృష్ట్యా అంతర్జాతీయంగా రాజీ, సద్దుబాటు ధోరణి అవసరమని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుటెరస్ వ్యాఖ్యానించారు. వచ్చే వారం ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో బుధవారం నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబరు 18 నుండి, న్యూయార్క్‌లో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో ప్రపంచ నేతలు, ప్రతినిధులు సమావేశం కానున్నారు.
వరుసగా జరిగే ఉన్నత స్థాయి సమావేశాలు, కార్యక్రమాల్లో వారు పాల్గొంటారు. ”ఈ సమయంలో ప్రపంచ నేతలకు నా విజ్ఞప్తి ఒక్కటే, ఉదాసీనంగా లేదా నిష్క్రియాపరంగా వుండాల్సిన సమయం కాదు, ఎవరికి వారు తమ తమ వైఖరులు కోసం పట్టుబట్టే సమయమూ కాదు, వాస్తవికమైన, ఆచరణాత్మకమైన పరిష్కార మార్గాల కోసం అందరూ కలిసి ఒక చోటకు రావాల్సిన సమయమిది. మరింత మెరుగైన రేపటి కోసం రాజీపడాల్సిన సమయమిది.” అని ఆయన స్పష్టం చేశారు. ”రాజకీయాలు అంటేనే రాజీ, దౌత్యం అంటేనే రాజీ, సమర్ధవంతమైన నాయకత్వం అంటేనే రాజీ” అని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ స్థితిగతులను సమీక్షించేందుకు మాత్రమే కాదు, మానవాళి ఉమ్మడి ప్రయోజనాల కోసం కూడా వ్యవహరించేందుకు ప్రతి ఏటా నేతలందరూ సమావేశమయ్యే సమయమిదని అన్నారు. ప్రస్తుతం ప్రపంచానికి ఏం కావాలో అది చేపట్టాల్సి వుందని అన్నారు. మానవాళి అతిపెద్ద సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో ప్రపంచ నేతలు సమావేశం కాబోతున్నారు. తమని ఈ సంక్షుభిత పరిస్థితుల నుండి బయటపడవేయాలని ప్రజలు నేతల వంక చూస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో భౌగోళిక, రాజకీయ విభేదాలు తలెత్తితే అవి ప్రతిస్పందించే మన సామర్ధ్యాన్ని దెబ్బతీస్తాయని అన్నారు. బహుళ ధృవ ప్రపంచం ఆవిర్భవిస్తోంది. బహుళ ధృవమనేది సమానతకు కారణం కావచ్చు, అలాగే ఉద్రికత్తలకు, విభజనలకు, అధ్వాన్న స్థితులకు కూడా హేతువు కావచ్చునని గుటెరస్ అన్నారు. ఎన్ని విభేదాలు వున్నా, ఎన్ని భిన్నమైన ప్రయోజనాలు వున్నా, ఎన్ని వేర్వేరు దార్శనికతలు వున్నా, భిన్నమైన సంస్కృతీ సాంప్రదాయాలు వున్నా ప్రపంచానికి సద్దుబాటు ధోరణి చాలా అవసరమని అన్నారు.