వివాదమే ఊపిరిగా..

Controversy is a breath..– ముస్లింల ప్రార్థనా స్థలాలపై బీజేపీ తీరు
– హిందూత్వ శక్తులకు సహకారం
– కోర్టులను ఆశ్రయిస్తూ అలజడిని సృష్టిస్తున్న వైనం
– బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇది తీవ్రం
– అయోధ్యలో రామాలయ ప్రతిష్టాపన జరిగిన ఏడాదిలోపే పలు ఘటనలు
– మోడీ, యోగిల వివాదాస్పద వ్యాఖ్యలు ఆందోళనకరం : మేధావుల, విశ్లేషకులు
న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిర నిర్మాణం పేరుతో బీజేపీ రాజకీయంగా చాలా ప్రయోజనాన్ని పొందింది. ముఖ్యంగా, 1980ల నుంచి ఈ అంశాన్ని వాడుకుంటూ వచ్చింది. ఎట్టకేలకు 2019లో సుప్రీంకోర్టు ఆదేశాలతో వివాదం ముగిసింది. అయోధ్యలోని వివాదాస్పద స్థలంలోనే ఆలయ నిర్మాణానికి దారులు సుగమమయ్యాయి. దీంతో ఏడాది క్రితం ప్రధాని మోడీ సమక్షంలో ఇక్కడ పాక్షికంగా నిర్మించిన రామాలయ ప్రతిష్టాపన జరిగింది. ఇక అయోధ్య వంటి వివాదాస్పద అంశం ఉండదని అంతా భావించారు. అయినప్పటికీ, ‘రామ మందిరం’ లాంటి వివాదాలు దేశంలోని పలు రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయనీ, హిందూత్వ శక్తుల ప్రయత్నాలకు బీజేపీ ప్రభుత్వాలు తోడ్పాటును అందిస్తున్నాయని కొందరు మేధావులు, విశ్లేషకులు చెప్తున్నారు.
రామాలయ ప్రతిష్టాపన.. విజయానికి అవకాశం మాత్రమే కాదనీ, వినయం కూడా అని మోడీ అన్నారు. ఆ సమయంలో మోడీ చెప్పిన మాటలు.. ఆయన వ్యవహరిస్తున్న తీరుకు విరుద్ధంగా ఉన్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. లోక్‌సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో మోడీ చేసిన ప్రసంగాలే దీనికి ఉదాహరణగా వివరిస్తున్నారు. ఈ జాబితాలో యూపీ సీఎం యోగి కూడా ఉన్నారని గుర్తు చేస్తున్నారు. మోడీ, యోగిల నుంచి ఇతర బీజేపీ నాయకుల వరకు ఈ వినయం అనేది ఏ కోశానా కనబడటం లేదని అంటున్నారు. బాధ్యతాయుతమైన స్థాయిలో ఉండి అగ్నికి ఆజ్యం పోసేలా వ్యవహరిస్తున్నారని చెప్తున్నారు.
ప్రార్థనా స్థలాల చట్టానికి వ్యతిరేకంగా పరిస్థితులు
ప్రస్తుతం దేశంలో పి.వి నరసింహరావు ప్రధానిగా ఉన్న సమయంలో తీసుకొచ్చిన ప్రార్థనా స్థలాల (ప్రత్యేక నిబంధనలు) చట్టం 1991 చర్చకు వస్తున్నది. మరే ఇతర ప్రార్థనా స్థలం లక్షణాన్ని మార్చకూడదని సుప్రీంకోర్టు హామీ ఇచ్చిన అదే చట్టం రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ విచారణ ప్రస్తుతం కొనసాగుతున్నది. దేశంలోని పరిస్థితులు మాత్రం ఈ చట్టానికి విరుద్ధంగా ఉన్నాయని మేధావులు, విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా, బీజేపీ పాలిత రాష్ట్రాలైన యూపీ, రాజస్థాన్‌ వంటి రాష్ట్రాల్లో ముస్లిం మత ప్రార్థనా స్థలాల విషయంలో ఈ తీరు కనిపిస్తున్నదని చెప్తున్నారు.
సంభాల్‌.. వారణాసి..మధుర..అజ్మీర్‌
యూపీలోని సంభాల్‌లో హిందూత్వ శక్తులు అక్కడ ఉన్న ముస్లిం ప్రార్థనా స్థలాన్ని స్వాధీనం చేసుకునే చర్యలకు పాల్పడుతుంటే, అధికారంలో ఉన్న యోగి సర్కారు వారికి అండదండగా నిలుస్తున్న విషయాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు. ”వారసత్వాన్ని తిరిగి పొందటం చెడు విషయం కాదు. వివాదాస్పద నిర్మాణాలను మసీదులు అని పిలవకూడదు. ముస్లిం లీగ్‌ మనస్తత్వంపై భారత్‌ నడపబడదు” అని యూపీ సీఎం యోగి నొక్కి చెప్పిన విషయాన్ని తెలియజేస్తున్నారు. రామాలయ ప్రతిష్టాపన కార్యక్రమంలో రాముడి శక్తి, పరిష్కారం అంటూ వ్యాఖ్యలు చేసిన మోడీ.. యోగి వ్యాఖ్యలపై ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఒక్క సంభాల్‌ మాత్రమే కాదు.. వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు, మధురలోని షాహి ఈద్గా, అజ్మీర్‌లో దర్గా.. ఇలా అనేక ఇస్లామిక్‌ ప్రార్థనా స్థలాలే టార్గెట్‌గా హిందూత్వ శక్తుల నుంచి దాడుల నిరంతరం కొనసాగుతున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు.
సుదూర కలగా అయోధ్య మసీదు
మసీదు నిర్మాణం కోసం అయోధ్యలోనే సున్నీ సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డుకు 5 ఎకరాల తగిన భూమిని ఇవ్వాలని తీర్పు సమయంలోనే సుప్రీంకోర్టు తెలిపింది. అయితే మసీదు అనేది సుదూర కలగానే మిగిలిపోయిందని విశ్లేషకులు చెప్తున్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం వివాదానికి శాశ్వత పరిష్కారమని అంతా భావించారనీ, అయితే, ముస్లిం మైనారిటీల స్థలాలను ఆక్రమించుకోవటానికి ఇది ఒక ఉదాహరణగా నిలిచిందని అంటున్నారు. ఈ వివాదాలకు శాశ్వతంగా చరమగీతం పాడాలని సూచిస్తున్నారు.
బీజేపీకి ఊపిరే ‘వివాదం’
వివాదాస్పద బాబ్రీ మసీదు-అయోధ్య అంశం తర్వాత.. ఇకపై ఇలాంటి వివాదాలేవీ ఉండవని అంతా భావించారు. కానీ, యోగి లాంటి నేతల వ్యాఖ్యలు చూస్తే ‘వివాదం’ ఇంకా సమసిపోలేదన్న విషయం అర్థమవుతున్నదని విశ్లేషకులు అంటున్నారు. దానిని ఉనికిలో ఉంచటం ద్వారానే బీజేపీకి రాజకీయంగా ఊపిరి అందుతుందన్న ఆలోచనతోనే బీజేపీ అగ్ర నాయకులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని చెప్తున్నారు.

Spread the love