– సంఘటితంగా పోరాడితేనే హక్కులు కాపాడుకుంటాం : సంగారెడ్డి క్లస్టర్ స్థాయి దీక్షలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి.మల్లేష్
– లేబర్ కోడ్‌ల వల్లే అదనపు పనిభారం
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, నాన్ పర్మినెంట్ కార్మికులు, ఉద్యోగులను శ్రమ దోపిడీకి గురి చేసే కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి.మల్లేష్ డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, నాన్ పర్మినెంట్ ఉద్యోగ, కార్మికుల సమస్యలపై చేపట్టిన క్యాంపెయిన్‌లో భాగంగా మంగళవారం సంగారెడ్డి క్లస్టర్ పరిధిలో దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లాలో 1.80 లక్షల మంది కార్మికులున్నారని, అందులో 1.60 లక్షల మంది వరకు కాంట్రాక్టు కార్మికులేనని తెలిపారు. పర్మినెంట్ కార్మికులు, ఉద్యోగుల్లోనూ ఆఫీస్ సిబ్బందే ఎక్కువ మొత్తంలో ఉన్నారన్నారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, నాన్‌పర్మినెంట్ కార్మికుల్లోనూ అత్యధికులు ఉత్తర భారతదేశం నుంచి వలస వచ్చిన కార్మికులే ఉన్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పర్మినెంట్ కార్మికుల్ని పెట్టుకుంటే నెలకు రూ.60 వేల జీతం ఇవ్వాల్సి వస్తుందని, వారి స్థానంలో కాంట్రాక్టు కార్మికులకు రూ.12 వేల జీతమిచ్చి పని చేయిం చుకుంటూ పరిశ్రమల యజమానులు శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 1971 కార్మిక చట్టం ప్రకారం కాంట్రాక్టు కార్మికులు నేరుగా ఉత్పిత్తిలో పాల్గొన కూడదని, కానీ.. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లలో మాత్రం కాంట్రాక్టు కార్మికులు నేరుగా ఉత్పిత్తిలో పాల్గొనే అవకాశం కల్పించబడిందన్నారు. లేబర్ కోడ్‌లు అమల్లోకి వస్తే ఇక నుంచి పర్మినెంట్ అనేది ఉండకుండా పోతుందని వాపోయారు. కాంట్రాక్టు కార్మికుల సంఖ్య పెరిగి పర్మినెంట్ కార్మికుల సంఖ్య తగ్గిపోవడం వల్ల వేతన, ఇతర సదుపాయాల కోసం ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేని ప్రమాదకర పరిస్థితులు రాబోతున్నాయన్నారు. 8 గంటల కంటే ఎక్కువ పని గంటలు డ్యూటీ చేస్తే అదనపు వేతనం కట్టిస్తున్న పరిస్థితులు ఉన్నాయని, కానీ నార్త్ ఇండియా నుంచి పెద్ద ఎత్తున వలస కార్మికుల్ని తీసుకొచ్చి 12 గంటల పాటు పనిచేయించుకుంటున్నారని తెలిపారు. లేబర్ కోడ్‌ల్లోనూ 12 గంటల పని విధానం అమలు గురించి పేర్కొనబడిం దన్నారు. మరో పక్క ధరలు విపరీతంగా పెరుగుతున్నా కార్మికుల వేతనాలు మాత్రం పెరగట్లేదన్నారు. రాష్ట్రంలో 2014 నుంచి 2024 వరకు కనీస వేతనాల పెంపు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి జీవోల్ని ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల జీవో ఇచ్చినా కార్మికులకు పైసా వేతనం పెరగకుండా జీవో ఇచ్చి కార్మిక లోకాన్ని మోసం చేసిందన్నారు. లేబర్ కోడ్‌లను అమలు చేయాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వం, కనీస వేతనాలు పెంచని రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల్ని తిప్పికొట్టేందుకు దేశ వ్యాప్తంగా చేపట్టిన పోరాటంలో కార్మికులు పెద్ద ఎత్తున కదలాలని పిలుపునిచ్చారు. ఈ నెల 28న కలెక్టరేట్ల ముట్టడి, 30న లేబర్ కమిషనర్ కార్యా లయం ఎదుట నిర్వ హించే ధర్నాను జయ ప్రదం చేయాలని కోరారు.
ఈ దీక్షా కార్య క్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.సాయిలు, జిల్లా ఉపాధ్యక్షులు బాగారెడ్డి, జిల్లా నాయ కులు మల్లేశం, ప్రవీణ్, వెంకట్‌రెడ్డి, దయానంద్, సురేష్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.