అవినీతి వీసీ రాజీనామా చేసి వెళ్లిపోవాలి

అవినీతి నుంచి దృష్టి మరల్చేందుకు వివాదాలు :టీయూలో వీసీ చాంబర్‌ను విద్యార్థి సంఘాల ముట్టడి
నవతెలంగాణ-డిచ్‌పల్లి
తెలంగాణ యూనివర్సిటీ అవినీతి వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ రవీందర్‌ తన పదవికి రాజీనామా చేసి వెళ్లిపోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లిలోని టీయూలో వీసీ చాంబర్‌ను పీడీఎస్‌యూ, ఎన్‌ఎస్‌యూఐ, బీవీఎం విద్యార్థి సంఘాల నాయకులు మంగళవారం ముట్టడించారు. వీసీని ఘెరావ్‌ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు జన్నారపు రాజేశ్వర్‌, వేణు రాజ్‌, విట్టల్‌ మాట్లాడారు. యూనివర్సిటీలో విద్యార్థులు ఫీజులు కట్టిన డబ్బులను వీసీ విచ్చలవిడిగా ఖర్చు చేసి, యూనివర్సిటీ ఖజానా ఖాళీ చేశారన్నారు. ఉద్యోగాల పేరుతో లక్షలాది రూపాయలు తీసుకొని అక్రమ నియామకాలు చేశారని, ఉద్యోగుల వేతనాలు చెల్లించడానికి కూడా కమీషన్లు తీసుకున్నారని ఆరోపించారు. ఇలాంటి ఎన్నో అవినీతి ఆరోపణలు పక్క దోవ పట్టించడానికే వీసీ పలు అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. యూనివర్సిటీకి రిజిస్ట్రార్‌ ఎవరో తెలియక విద్యార్థులు, సిబ్బంది, అధ్యాపకులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ యూనివర్సిటీకి ఎవరు రిజిస్ట్రార్‌ అనేది తేల్చి, వీసీ అవినీతిపై విచారణ చేసి వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేశారు. వైస్‌ ఛాన్సలర్‌ ఛాంబర్‌లో వీసీ కుర్చీ పైనే ఉండగా విద్యార్థులు టేబుల్స్‌ పైకి ఎక్కి వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు.. వీసీ ఛాంబర్‌లోకి వచ్చి విద్యార్థులను బయటికి పంపారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ నాయకులు సంతోష్‌, స్నేహిత, లక్మి నారాయణ, మోహన్‌, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు నిఖిల్‌ రెడ్డి, సయ్యద్‌ అహ్మద్‌, సందీప్‌ రెడ్డి, శివ, రమణ, ఇంజిమ్ము, లక్కీ, ఉదరు, లక్ష్మీకాంత్‌, బీవీఎం, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love