కరీంనగర్‌ ఆర్వోబీ నిర్మాణ వ్యయం కేంద్రానికే

తమ ఘనత అని బీఆర్‌ఎస్‌ చెప్పుకోవడం దారుణం : బండి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలోని తీగలగుట్ట సమీపంలో రైల్వే ఓవర్‌ బ్రిడ్జి (ఆర్వోబీ) టెండర్ల ఖరారు తమ ఘనతగా చెప్పుకుంటూ బీఆర్‌ఎస్‌ నేతలు సీఎంకు పాలాభిషేకం చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజరు కుమార్‌ తప్పుపట్టారు. మంగళవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆర్వోబీ నిర్మాణానికయ్యే మొత్తం వ్యయం రూ.126.74 కోట్లను కేంద్రమే చెల్లించేందుకు అంగీకరించిన విషయం నిజం కాదా? అని ప్రశ్నించారు. ఆర్వోబీ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని అనేకసార్లు తాను ప్రభుత్వానికి లేఖలు రాసిన విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం పనులను తాత్సారం చేస్తుండటంతో బీజేపీ నాయకులు ధర్నాలు, ఆందోళనలు చేసింది నిజం కాదా? అని ప్రశ్నించారు. ఆర్వోబీ నిర్మాణ ఖర్చులో 80 శాతం రాష్ట్రం భరిస్తుందని చెప్పి తర్వాత మాట మార్చింది వాస్తవం కాదా? అని అడిగారు. సొమ్ము కేంద్రానిదైతే… సోకు బీఆర్‌ఎస్‌ నేతలది అన్నట్టుగా పరిస్థితి ఉందని తెలిపారు. ఆర్వోబీ నిర్మాణం విషయంలో జరుగుతున్న జాప్యానికి తామే కారణమంటూ బీఆర్‌ఎస్‌ నేతలు కరీంనగర్‌ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Spread the love