– రూ.220.5 లక్షల కోట్లు
– కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి
– అందులో కేంద్ర ప్రభుత్వం అప్పు రూ.155.6 లక్షల కోట్లు
– అన్ని రాష్ట్ర ప్రభుత్వాల అప్పు రూ.76.1 లక్షల కోట్లు
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
దేశం అప్పు రూ.220.5 లక్షల కోట్ల (జీడీపీలో 80.9 శాతం)ని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. మంగళవారం రాజ్యసభలో సీపీఐ(ఎం) ఎంపీ వి.శివదాసన్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అందులో కేంద్ర ప్రభుత్వ అప్పు రూ.155.6 లక్షల కోట్లు (జీడీపీలో 71 శాతం), అన్ని రాష్ట్ర ప్రభుత్వాల అప్పు రూ.76.1 లక్షల కోట్లు (జీడీపీలో 35 శాతం) అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేసే అప్పుల్లో రూ.51 లక్షల కోట్లు (624.65 బిలియన్ యుఎస్ డాలర్లు ) విదేశీ అప్పు ఉందని మరో ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దీనికి 19.66 బిలియన్ యూఎస్ డాలర్ల వడ్డీ చెల్లిస్తున్నామని పేర్కొన్నారు.
రైతు రుణమాఫీ పథకం అమలు చేయటం లేదు
కేంద్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ పథకం అమలు చేయటం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. గత మూడేండ్లు, ప్రస్తుత సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి రైతుల రుణమాఫీ పథకం అమలు చేయలేదని, ఈ కాలంలో దీనికి సంబంధించి ఎటువంటి నిధులు కేటాయించలేదని పేర్కొన్నారు.
36 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ
36 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణకు నిర్ణయం తీసుకున్నామని, అందులో పది సంస్థల ప్రయివేటీకరణ ప్రక్రియ పూర్తి అయిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రాజ్యసభలో సీపీఐ(ఎం) ఎంపీ ఎలమారం కరీం అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2016లో 36 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణకు నిర్ణయం తీసుకున్నామని, అందులో హెచ్‌పీసీఎల్, ఎయిర్ ఇండియా, డ్రెజ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వంటి పది సంస్థల ప్రయివేటీకరణ ప్రక్రియ పూర్తి అయిందని తెలిపారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్, బీపీసీఎల్, ఐడీబీఐ బ్యాంక్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సిఈఎల్ వంటి 26 ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ ప్రకియ వివిధ దశల్లో ఉందని తెలిపారు.
బ్యాంకులకు రూ.5.71 లక్షల కోట్లు మొండి బకాయిలు
దేశంలో రూ.5.71 లక్షల కోట్లు మొండి బకాయిలు ఉన్నాయని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి భగవత్ కరడ్ తెలిపారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. 2023 మార్చి 31 నాటికి దేశంలోని బ్యాంకులకు రూ.5,71,515 కోట్లు మొండి బకాయిలు ఉన్నాయని ఆర్‌బీఐ తెలిపినట్లు చెప్పారు.
ఎస్సీ, ఎస్టీలకు మినహా కుల గణన జరగలేదు
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి జన గణనలో షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ) మినహా కులాల వారీగా జనాభాను కేంద్ర ప్రభుత్వం లెక్కించలేదని కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రారు తెలి పారు. లోక్‌సభలో ఒకప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రాబోయే జనాభా గణనలో కుల వివరాలను సేకరించాలని కొన్ని రాజకీయ పార్టీలు, కొన్ని సంఘాలు అభ్యర్థించాయని తెలిపారు.
‘ఉపాధి’ నిధుల విడుదలలో రూ.20,309 కోట్ల కోత
గత మూడేండ్లలో ఉపాధి హామీ నిధులు విడుదలలో రూ.20,309.2 కోట్లు కోత జరిగింది. ఈ మేరకు లోక్‌సభలో ఒక ప్రశ్నకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్వోతి ఇచ్చిన సమాధానంలో ఈ విషయం స్పష్టం అయింది. ఉపాధి హామీకి 2020-21లో రూ.1,11,170.86 కోట్ల నిధులు విడుదల అయితే, 2021-22 నాటికి రూ.98,467.85 కోట్లకు తగ్గిందని, 2022-23 నాటికి రూ.90,861.96 కోట్లకు తగ్గిందని తెలిపారు.
గత ఐదేండ్లలో దేశం అప్పులు
ఏడాది కేంద్రం అప్పు రాష్ట్రాల అప్పు మొత్తం
(లక్షల కోట్లు) (లక్షల కోట్లు) (లక్షల కోట్లు)
2018-19 రూ.93.3 రూ.47.9 రూ.133
2019-20 రూ.105.1 రూ.53.5 రూ.150.9
2020-21 రూ.121.9 రూ.61.6 రూ.174.1
2021-22 రూ.138.7 రూ.67.9 రూ.195.5
2022-23 రూ.155.6 రూ.76.1 రూ.220.5