అంతరిక్ష రంగంలో దేశం ఎంతో అభివృద్ధి

The country is very advanced in the field of space– సీసీఎంబీ మాజీ డైరెక్టర్‌ ప్రొ.మోహన్‌రావు
– ఓయూ ఆర్ట్స్‌ కాలేజీ ఎదుట జేవీవీ ఆధ్వర్యంలో చంద్రయాన్‌-3 ప్రత్యక్ష ప్రసారం
నవతెలంగాణ-ఓయూ
అంతరిక్ష రంగంలో దేశం మరింత అభివృద్ధి సాధిస్తున్నదని సీసీఎంబీ మాజీ డైరెక్టర్‌, తెలంగాణ సైన్స్‌ అకాడమీ అధ్యక్షులు డా.మోహన్‌రావు అన్నారు. బుధవారం చంద్రయాన్‌ 3 విక్రమ్‌ ల్యాండర్‌ ప్రయోగాన్ని హైదరాబాద్‌ ఓయూ ఆర్ట్స్‌ కళాశాల వద్ద జనవిజ్ఞాన వేదిక హైదరాబాద్‌ నగర కమిటీ ఆధ్వర్యంలో పెద్ద డిజిటల్‌ తెరపై ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. చంద్రునికి దక్షిణ భాగం వైపున మొదటిసారిగా శాటిలైట్‌ను సురక్షితంగా దింపడం భారతదేశానికి గొప్ప గర్వకారణం అన్నారు. సైన్స్‌, రీసెర్చ్‌, స్పేస్‌ రంగంలో భారతదేశం అద్భుతంగా ముందుకెళ్తుందని, మరో మైలురాయిని అధిగమించామని తెలిపారు. అనేక విధాలుగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. హైదరాబాద్‌ కూడా స్పెస్‌ రంగంలో ముందుకు పోతుందన్నారు. అయితే, దేశంలో మరికొన్ని సెంటర్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు.
జేవీవీ ఉపాధ్యక్షులు ప్రొఫెసర్‌ బిఎన్‌ రెడ్డి మాట్లాడుతూ.. మన సైంటిస్టులు, ఇస్రో ఒక ఆధునిక దేవాలయం అన్నారు. ఒకప్పుడు ”జాబిల్లి రావే చందమామ రావే” అని పాట పాడేవారు కానీ ఇప్పుడు ”జాబిల్లి వస్తున్నాం.. చందమామ వస్తున్నాం” అని గర్వంగా పాడుకోవచ్చని అన్నారు. రాష్ట్ర కార్యదర్శి రాజా మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి నిధులు కేటాయించాలని.. అప్పుడు దేశం ఇంకా ఎంతో అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. అతి చిన్న దేశం జపాన్‌ టెక్నాలజీని జోడించి ప్రపంచాన్ని శాసిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో జేవీవీ రాష్ట్ర కోశాధికారి ఆర్‌.వరప్రసాద్‌, హైదరాబాద్‌ నగర ప్రధాన కార్యదర్శి లింగస్వామి, ఆమెచ్యుర్‌ అస్ట్రానమర్‌ వెంకటసాయిలు, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎల్‌.మూర్తి, నాయకులు రవి, శ్రీను, విద్యార్థులు పాల్గొన్నారు. జై విజ్ఞాన్‌, జై ఇస్రో, జై కిసాన్‌.. అనే నినాదాలతో ఆర్ట్స్‌ కాలేజీ ముందు సంబురాలు, సంతోషాలు వెల్లివిరిసాయి.

Spread the love