దేశానికి కేరళ మోడల్‌ ప్రజా పరిపాలన కావాలి

– భద్రాచలంకు తీవ్ర అన్యాయం చేసింది బీజేపీ, బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లే
– ఆ నలుగురు తెలంగాణను పాలిస్తున్నారు
– ఐదు గ్రామపంచాయతీ తెస్తాం అనే దమ్ము బీఆర్‌ఎస్‌ కు లేదా..
– అసమర్థులు, అవకాశవాదులను ఓడించండి.. సీపీఐ(ఎం)ను గెలిపించండి
– సీపీఐ(ఎం) గెలిచే మొదటి సీటు భద్రాచలం
– విలేకరుల సమావేశంలో పార్టీ పోలిట్‌ బ్యూరోవిజయ రాఘవన్‌, కేంద్ర కమిటీ సభ్యులు బి.వెంకట్‌
నవతెలంగాణ-భద్రాచలం రూరల్‌
విద్య, వైద్యం, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజా పరిపాలన అందిస్తున్న కేరళ మోడల్‌ దేశానికి ఆదర్శమని, దేశానికి కేరళ మోడల్‌ పాలన కావాలని, నేడు సమాజంలో రాజకీయ విలువలు నశిస్తున్నాయని, విలువలతో కూడిన రాజకీయాలు కావాలని, అసమర్థులు అవకాశవాదులను ఓడించి భద్రాచలం నియోజకవర్గం సీపీఐ(ఎం) అభ్యర్థి కారం పుల్లయ్యను గెలిపించాలని పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యులు, రాజ్యసభ మాజీ సభ్యులు, కేరళ లెఫ్ట్‌ గవర్నమెంట్‌ చైర్మన్‌ విజరు రాఘవన్‌, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు బి.వెంకట్‌ లు ప్రజలను కోరారు. భద్రాచలం పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఆ నలుగురు (కేసీఆర్‌, కేటీఆర్‌, కవిత, హరీష్‌ రావు) తెలంగాణను పాలిస్తున్నారని విమర్శించారు. భద్రాచలంకు తీవ్ర అన్యాయం చేసిన బీఆర్‌ఎస్‌కి ఓట్లు అడిగే అర్హత లేదని అన్నారు. ఐదు గ్రామపంచాయతీలు తెచ్చే దమ్ము బిఆర్‌ఎస్‌కు లేదా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ భద్రాచలంకు ఎందుకు రావటం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. కేటీఆర్‌ భద్రాచలం పర్యటన అహంభావపూరితంగా ఉందని, భద్రాచలం ప్రాంతం ఎదుర్కొంటున్న సమస్యలు ప్రస్తావన కూడా చేయకపోవడం దారుణమని అన్నారు. పోలవరం ముంపు, 5 పంచాయతీలు సమస్య ప్రస్తావనే లేదని అన్నారు. భద్రాచలం నియోజకవర్గంలో బిఆర్‌ఎస్‌ను ప్రజలు తిరస్కరిస్తారని అన్నారు. భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య ఏం చేశాడని, ఏ కోలమానంతో ఓట్లు అడుగుతారు ప్రశ్నించారు. పోడు భూమి, ఉపాధి, తునికాకు బోనస్‌పై వీరయ్య ఏనాడైనా మాట్లాడాడా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఇద్దరు అభ్యర్థులు స్పాన్సర్‌ క్యాండిడేట్లేనని ఆరోపించారు. భద్రాచలంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు. అత్యంత సౌకర్యవంతమైన, ప్రశాంతమైన ప్రాంతం భద్రాచలం అని, అందుకు సీపీఐ(ఎం) అనేక త్యాగాలు చేసిందని అన్నారు. భద్రాచలం అభివృద్ధి కావాలంటే పోరాడేవారు కావాలని, సీపీఐ(ఎం) అభ్యర్థి కారం పుల్లయ్య గెలిస్తే భద్రాచలం ఔన్నత్యాన్ని కాపాడతామని, ఆదివాసీ హక్కుల కోసం పోరాడుతామని, గిరిజనేతర ప్రజల హక్కులను కాపాడతామని అన్నారు. సీపీఐ(ఎం) గిరిజన, గిరిజనేతర ప్రజల ఐక్యతను ముందుకు తీసుకుపోతుందని అన్నారు. రాష్ట్రంలో సీపీఐ(ఎం) గెలిచే మొదటి సీటు భద్రాచలంమని అన్నారు.
27న బృందాకారత్‌ ప్రచారం
సీపీఐ(ఎం) భద్రాచలం నియోజకవర్గం అభ్యర్థి కారం పుల్లయ్య విజయాన్ని కాంక్షిస్తూ 25న త్రిపుర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సీపీఐ(ఎం) పొలిట్‌ బ్యూరో సభ్యులు మాణిక్‌ సర్కార్‌ వాజేడు మండలం, భద్రాచలం పట్టణంలో పర్యటించనున్నారని, 27న రాజ్యసభ మాజీ సభ్యురాలు బృందా కారత్‌, కేంద్ర కమిటీ సభ్యులు బి.వెంకట్‌లు చర్ల, దుమ్ముగూడెం మండలాలలో జరిగే ప్రచార సభలో పాల్గొంటారని పార్టీ నియోజకవర్గం కన్వీనర్‌ మచ్చ వెంకటేశ్వర్లు చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్‌, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.బి నర్సారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు ఎం.రేణుక, సున్నం గంగా, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు బి.వెంకటరెడ్డి, బండారు శరత్‌ బాబు, పి.సంతోష్‌ కుమార్‌, నాదెళ్ల లీలావతి తదితరులు పాల్గొన్నారు.

Spread the love