నిఘా నీడలో దేశ రాజధాని

National capital under surveillance– రిపబ్లిక్‌ డే వేడుకలకు 15 వేల మంది పోలీసులతో భద్రత
– 70 కంపెనీలకు పైగా పారామిలటరీ బలగాలు
– డ్రోన్లు, సీసీటీవీలు, సైబర్‌ స్పెషలిస్టులతో పర్యవేక్షణ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశ రాజధాని నిఘా నీడలో ఉన్నది. దేశ రాజధాని రిపబ్లిక్‌డే వేడుకలకు ముస్తాబవుతున్న తరుణంలో ఎలాంటి భద్రతా లోపాలూ తలెత్తకుండా ఉండేందుకు 70 కంపెనీలకు పైగా పారామిలటరీ బలగాలు, 15,000 మందికి పైగా పోలీసులను మోహరించడంతో పాటు విస్తృత భద్రతా చర్యలు చేపట్టారు. సెక్యూరిటీ సిబ్బంది ఎక్కువగా ఉండటంతో పాటు డ్రోన్లు, సీసీటీవీ నిఘా, సైబర్‌ స్పెషలిస్టులతో నగర పర్యవేక్షణ ఉంటుంది. వేడుకలను సజావుగా నిర్వహించేందుకు ఆరు లేయర్ల తనిఖీలు, ఫ్రిస్కింగ్‌లతో బహుళస్థాయి భద్రతా ఏర్పాట్లు ఉంటాయి.ఫేషియల్‌ రికగ్నైషన్‌ సిస్టమ్స్‌ (ఎఫ్‌ఆర్‌ఎస్‌)తో సహా వేలాది సీసీటీవీ కెమెరాలు, ప్రాంతాలను పర్యవేక్షించడానికి మొబైల్‌ ఎఫ్‌ఆర్‌ఎస్‌-అనుకూల వాహనాలను న్యూఢిల్లీలో ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలు అనుమానాస్పద వ్యక్తులను వెంటనే గుర్తించడం కోసం క్రిమినల్‌ డేటాబేస్‌కు లింక్‌ చేయబడతాయి. పోలీసు బృందాలు పలు ఏజెన్సీలతో మాక్‌ డ్రిల్‌లు నిర్వహిస్తున్నాయి. అన్ని జిల్లాల డీసీపీలకు సమాచారమందించామనీ, ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు జరిగినా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ”మేము ఇప్పటికే బహుళ లేయర్డ్‌ భద్రతా ఏర్పాట్లను చేశాం. మా వద్ద ఆరు పొరల తనిఖీ, ఫ్రిస్కింగ్‌ ఏర్పాట్లు ఉన్నాయి. ఇది కాకుండా, మేము బహుళ లేయర్డ్‌ బారికేడింగ్‌ ఏర్పాటు చేశాం. న్యూఢిల్లీ జిల్లాలో ఫేషియల్‌ రికగ్నైషన్‌ సిస్టమ్స్‌తో సహా వేల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశాం” అని సీనియర్‌ పోలీసు అధికారి తెలిపారు. న్యూఢిల్లీ, ఉత్తర, మధ్య జిల్లాల్లో దాదాపు 4,000 రూఫ్‌టాప్‌ సెక్యూరిటీ పాయింట్లను గుర్తించారు. పరేడ్‌కు హాజరైనవారికి భద్రతా స్టిక్కర్‌లను అందిస్తారు. పరేడ్‌ మార్గం, పరిసర ప్రాంతాలలో ఎఫ్‌ఆర్‌ఎస్‌తో దాదాపు 500 అధిక రిజల్యూషన్‌ తో కూడిన ఏఐ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఢిల్లీ పోలీసులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మూడు జిల్లాల డీసీపీలు రూట్‌ సర్వేలు, తనిఖీలు, రద్దీ ప్రాంతాల్లో నిఘా పెంచారు. శాంతిభద్రతల పరి రక్షణకు ప్రత్యేక మార్గాలు, డ్రోన్‌ పర్యవేక్షణ, సీసీటీవీ నిఘా ఉంటుం దన్నారు. సంసిద్ధతను నిర్ధారించడానికి హౌటల్స్‌, మాల్స్‌ భద్రతా సిబ్బందితో ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించామని చెప్పారు.

Spread the love