పల్లెలు కంపు కొడుతున్నారు

– ఆ పనికెవ్వరూ రావట్లేదు
– పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించండి
– సమ్మె విరమించేలా చూడండి
– తీర్మానాలు చేస్తున్న గ్రామ పంచాయతీలు
– అధికారులకు, కలెక్టర్లకు సర్పంచుల లేఖలు
– ప్రమాదాల బారిన తాత్కాలిక సిబ్బంది
        ‘గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మెలో ఉన్నారు. పల్లెలు కంపుకొడుతున్నాయి. అధికారులేమో ప్రత్యామ్నాయంగా తాత్కాలిక సిబ్బందిని పెట్టి పనిచేయించాలని ఆదేశిస్తున్నారు. ఊర్లల్లోనేమో ఆ పని చేసేందుకు ఏ ఒక్కరూ ముందుకు రావడం లేదు. ఒక్కరిద్దరు ముందుకొచ్చినా రోజుకు వెయ్యి రూపాయల దాకా అడుగుతున్నరు. అంత ఇచ్చే స్థితిలో పంచాయతీలు లేవు. దయచేసి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చూడండి. వారిని వెంటనే విధుల్లో చేరేలా చూడాలని మనవి చేసుకుంటాము’ అని నాగర్‌ కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం యన్మనబెట్ల సర్పంచి ఎంపీడీఓకు లేఖ రాశారు. అలాంటి అంశాలతోనే నల్లగొండ జిల్లాలోని మేజర్‌ గ్రామపంచాయతీ అయిన నేలకొండపల్లి సర్పంచి కుంభం శ్రీనివాస్‌గౌడ్‌ ఏకంగా ఆ జిల్లా కలెక్టర్‌కే లేఖ రాశారు. ఆ పంచాయతీలోని కార్మికులకు న్యాయం చేయాలని కోరుతూ తీర్మానం చేశారు. మరోవైపు అక్కడక్కడా నియమించిన తాత్కాలిక సిబ్బంది ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇంత జరుగుతున్నా పంచాయతీ కార్మికులను పిలిచి చర్చించాలి.. సమస్యలను పరిష్కరించాలి అనే సోయి మరిచి రాష్ట్ర సర్కారు వ్యవహరిస్తున్నది. గత సమ్మెల సందర్భంగా వ్యవహరించిన ఒంటెద్దు పోకడనే ప్రదర్శిస్తున్నది. సర్కారు ఇట్లాగే వ్యవహరిస్తే పోరాటాన్ని ఉధృతం చేస్తామనీ, చలో హైదరాబాద్‌కు పిలుపునిస్తామని జేఏసీ హెచ్చరిస్తున్నది.
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో 12,769 గ్రామపంచాయతీలున్నాయి. రాష్ట్ర సర్కారు జీతాలు చెల్లిస్తున్న లెక్కల ప్రకారం 36,500 మంది గ్రామపంచాయతీ కార్మికులున్నారు. కానీ, 50 వేలకుపైగా కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో 90 శాతానికిపైగా దళితులే ఉన్నారు. మోరీలు ఎత్తిపోయడం, చెత్త సేకరించడం, తడి, పొడి చెత్తలను వేరుచేయడం, కంపోస్టు ఎరువు తయారీ, రోడ్లు ఊడ్చటం, మొక్కలకు నీళ్లు పట్టడం, కుక్కలు, పిల్లులు చనిపోతే తీసుకెళ్లి ఊరుబయట పడేయటం లాంటి పనులెన్నింటినో చేస్తున్నారు. ఒక్కరి పేరుతో వస్తున్న రూ.9,500 వేతనాన్ని ఇద్దరు, ముగ్గురు పంచుకుంటున్నారు. దీంతో వారికి వేతనం నాలుగైదువేల రూపాయలకు మించడం లేదు. అంటే రోజుకు వారీ కూలి రూ.200 కూడా గిట్టడం లేదు. దీంతో పూటగడవటం కష్టమవుతున్నది.
జీవో నెంబర్‌ 60 ప్రకారం స్వీపర్లకు రూ.15,600, పంపు ఆపరేటర్లు, ఎలక్ట్రీషియన్లు, డ్రైవర్లు, కారోబార్లు, బిల్‌ కలెక్టర్లకు రూ.19,500 ఇవ్వాలని, మల్టీపర్పస్‌ విధానాన్ని రద్దు చేసి పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ జూన్‌ ఐదో తేదీన పంచాయతీరాజ్‌ కమిషనర్‌కు సమ్మె నోటీసు ఇచ్చారు. రాష్ట్ర సర్కారు అస్సలు పట్టించుకోలేదు. విధిలేని పరిస్థితుల్లో జులై ఆరో తేదీ నుంచి పంచాయతీ కార్మికులు సమ్మెలోకి వెళ్లారు. రాష్ట్రంలో మొత్తం 553 గ్రామీణ మండలాలుండగా అందులో 482 మండలాల్లో సమ్మె ఉధృతంగా కొనసాగుతున్నది. కార్మికులందరూ విధులను బహిష్కరించి సమ్మెలో ఉన్నారు. ప్రస్తుతం సమ్మెలో 35 వేల మంది కార్మికులు రెగ్యులర్‌గా పాల్గొంటున్నారు. కొందరు ఇండ్ల వద్దనే ఉంటున్నా విధులను మాత్రం నిర్వర్తించడం లేదు. వారి డిమాండ్లన్నీ న్యాయమైనవే. రాష్ట్ర సర్కారే మొండిగా వ్యవహిరిస్తూ వారిని పట్టించుకోవడంలేదు. దీంతో గ్రామాల్లో పారిశుధ్య పనులన్నీ నిలిచిపోయాయి. ఇంట్లో ఒక్కరోజు చెత్త పేరుకుపోతేనే కంపు వాసన కొడుతుంది. అలాంటిది గ్రామాల్లో వారం రోజులుగా పారిశుధ్య పనులు నిలిచిపోయవడంతో శానిటేషన్‌ అస్తవ్యస్తంగా తయారైంది. నీటిసరఫరా ఆగిపోయింది. వారం రోజులో, పది రోజులో సమ్మె చేస్తే ప్రజల నుంచి వారి పట్ల తీవ్ర వ్యతిరేకత మొదలవుతుందని భావించి రాష్ట్ర సర్కారు మొండిగా వ్యవహరిస్తున్నది. కానీ, సర్కారు ఆలోచనకు భిన్నంగా గ్రామపంచాయతీ పాలకమండళ్ల నుంచీ, ప్రజల నుంచీ వారి సమ్మెకు రోజురోజుకీ మద్దతు పెరుగుతున్నది. అతితక్కువ వేతనంలో వాళ్ల కుటుంబాలు ఎలా గడుస్తున్నాయనే సానుభూతి ప్రజల్లో వ్యక్తమవుతున్నది.
ఆ పనికి మేం రాం..రాం..
పంచాయతీ కార్మికుల సమ్మెతో గ్రామాల్లో ప్రత్యామ్నాయ సిబ్బందిని నియమించుకుని పనులు చేయించాలని రాష్ట్ర సర్కారు ఆదేశాలు జారీ చేసింది. వీరు కాకపోతే ఇంకొకరు దొరకరా? అన్న సర్కారు ఆలోచన తప్పు అని నేడు క్షేత్రస్థాయిలో రుజువు అవుతున్నది. మోరీల శుద్ధీ, ఇంటింటికెళ్లి చెత్త సేకర ణ పనికి రావాలని సర్పంచులు డప్పుచాటింపు వేసి నా ఫలితం ఉండటంలేదు. చివరకు సర్పంచులు గ్రా మంలో ఎవరిని అడిగినా ‘ఎంత కూలిచ్చినా ఆ పనికి మేం రాం’ అని బాహాటంగానే చెబుతున్నారు. ట్రాక్టర్లు నడిపేందుకు, కరెంటు పనులు చేసేందుకు, నీళ్లు పెట్టేందుకు కొందరు ముందుకొచ్చినా రోజుకు రూ.800 నుంచి రూ.1000 అడుగుతున్నారు. అంత ఇచ్చి అక్కడక్కడా సర్కారు పనిచేయిస్తున్నది. అంటే నెలకు లెక్కగడితే ఆ వేతనం రూ.24 వేల నుంచి 30వేల దాకా అవుతున్నది. పంచాయతీ కార్మికులు అంత ఏం అడగట్లేదు. జీవో నెంబర్‌ 60 ప్రకారం స్వీపర్లకు రూ.15,600, పంపు ఆపరేటర్లు, ఎలక్ట్రీషియన్లు, డ్రైవర్లు, కారోబార్లు, బిల్‌ కలెక్టర్లకు రూ.19,500 ఇవ్వాలని కోరుతున్నారు. దీన్ని బట్టే పంచాయతీ కార్మికుల డిమాండ్‌లో ఎంత న్యాయం ఉందో అర్థం చేసుకోవచ్చు. చెత్త సేకరించడం, మోరీ లు ఎత్తిపోయడం లాంటి పనులు చేసేందుకు ఎవ్వ రూ ముందుకు రాకపోవడంతో నల్లగొండ జిల్లా మునుగోడు సర్పంచి మిర్యాల వెంకన్న స్వయంగా తానే చెత్త సేకరణకు పూనుకున్నారు. నల్లగొండ మం డలం జి.చెన్నారం సర్పంచ్‌ ఉప్పునూతల వెంకన్న కూడా స్వయంగా చెత్త సేకరిస్తున్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ సర్పంచ్‌ ఆరెపల్లి మహదేవ్‌గౌడ్‌ కూడా గ్రామంలో చెత్త సేకరించారు. ఇవి మచ్చుకు కొన్ని ఉదహరణలు మాత్రమే.
తాత్కాలికం..ప్రమాదభరితం
పంచాయతీ కార్మికుల సమ్మె పట్ల రాష్ట్ర సర్కారు కఠినంగా వ్యవహరిస్తున్నది. కొన్ని గ్రామాల్లో ప్రత్యామ్నాయ సిబ్బందికి రోజువారీగా ఎక్కువ కూలీ ఇస్తామని చెప్పి పనుల్లోకి తీసుకుంటున్నారు. అయితే, ఆ పనుల పట్ల అవగాహన లేని వాళ్లు ప్రమాదాల బారిన పడుతున్నారు. వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం దేశాయిపేటలో తాత్కాలిక సిబ్బంది అయిన నల్లవెల్లి సురేశ్‌ ట్రాక్టర్‌ను సైడ్‌కాలువలో పడేశాడు. దీంతో అతని ఛాతీకి బలమైన గాయం అయింది. అతన్ని హుటాహుటిన హన్మకొండ ఆస్పత్రికి తరలించారు. ఆదిలాబాద్‌ జిల్లా వాంకిడి మండ లం చౌహాన్‌గూడలోనూ తాత్కాలిక సిబ్బందిలో ఒకరు కరెంట్‌షాక్‌కు గురయ్యాడు. అతని పరిస్థితి విషమంగా ఉంది. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కృష్టాపురం గ్రామంలో డ్రైవర్‌ ట్రాక్టర్‌ను చెరువులోకి తీసుకెళ్లాడు. ఇవి కొన్ని మాత్రమే. పనిపై అవగాహన లేని తాత్కాలిక సిబ్బందితో ప్రమాదాలు కోకొల్లలుగా జరుగుతున్నాయి.

Spread the love