డిండి ఎత్తిపోతల పథకం పూర్తి చేసి సాగునీరు అందించాలి: సీపీఐ(ఎం) ప్రతినిధి బృందం  

Dindi lifting scheme should be completed and irrigation should be provided– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క వినతి
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
డిండి ఎత్తిపోతల పథకం డిపిఆర్‌ను ఆమోదించాలని, ఎస్ఎల్‌బిసి సొరంగం పూర్తికి , మూసీ ఆధునీకరణకు తగిన నిధులు కేటాయించాలని, సాగర్‌ ఎడమ కాలువపై ఉన్న లిప్టులను ప్రభుత్వమే నిర్వహించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, ఎస్. వీరయ్య, జి. నాగయ్య, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) ప్రతినిధి బృందం ఆధ్వర్యంలో శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగంగా డిండి, ఎత్తిపోతల పథకం నిర్మాణం చేసి క్షామ ఫ్లోరిన్‌ ఫీడిత ప్రాంతాలైన మహాబూబ్‌నగర్‌, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల పరిధిలోని సుమారు 3.61 వేల ఎకరాలకు సాగునీరందించేందుకు జి.వో. 107 ను గత  2015న విడుదల చేశారని గుర్తు చేశారు. నల్లగొండ జిల్లాలోని దేవరకొండ, మునుగోడ్‌ నియోజకవర్గాల పరిధిలోని సుమారు 3.41 వేల ఎకరాల ఆయకట్టును స్థిరికరించారని, దాని కింద కొన్ని నిధులు మంజూరు చేసి సింగరాజుపల్లి, గొట్టిముక్కల, చింతపల్లి, కిష్టిరాంపల్లి, శివన్నగూడెం రిజర్వాయర్ల నిర్మాణం జరుగుతున్నాయని, కానీ గత ప్రభుత్వం డిపిఆర్‌ను ఆమోదించలేదని తెలిపారు. పర్యావరణ అనుమతుల కోసం లేఖ రాయలేదని, దీంతో ఈప్రాజెక్టు విషయమై ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొని ఉన్నదని ముఖ్యమంత్రి కి తెలిపారు. తమ ప్రభుత్వమైనా వెంటనే పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగమైన ఎదుళ్లా రిజర్వాయర్‌ నుండి రోజుకు 0.5 టిఎంసి చొప్పున 60 రోజుల పాటు 30 టిఎంసిలు నీటిని తీసుకునే విధంగా డిపిఆర్‌ను అమోదించాలని, పర్యావరణ అనుమతుల గురించి ప్రభుత్వం వెంటనే లేఖ రాసి త్వరగా పనులు ప్రారంభించి పూర్తి చేయుటకు తగిన నిధులు కేటాయించాలని కోరారు.
లిఫ్టుల నిర్వహణ ప్రభుత్వానిదే..
నాగార్జునసాగర్‌ ఎడమ కాలువపై ఉన్న 43 లిఫ్టుల పైపులు దెబ్బతినడం, మోటర్లు మరమ్మతులకు రావడం వల్ల ఆయకట్టుకు నీరందని పరిస్థితి ఉన్నదని, ఆపరేటర్ల జీతభత్యాలను రైతులు భరించలేక పోతున్నారని, లిఫ్టుల మరమ్మతులు, ఆపరేటర్ల జీతభత్యాలతో పాటు లిఫ్టుల పూర్తి నిర్వహణ బాధ్యత ప్రభుత్వమే చేపట్టాలని అన్నారు. నల్లగొండ జిల్లాలో సుమారు 3.20 వేల ఎకరాలకు సాగునీరు, వందల గ్రామాలకు సాగునీరు ఇచ్చే శ్రీశైలం సొరంగం పనులు 19 సంవత్సరాల క్రితం 1925 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైన పనులు నేటికి 4658 కోట్ల అంచనా వ్యయానికి చేరిందని అన్నారు. 9.5 కి.మీ. సొరంగం తవ్వాల్సి ఉన్నదని బడ్జెట్‌లో కేటాయించిన రూ. 800 కోట్లు సరిపోవని, ఎక్కువ నిధులు ఇచ్చి పూర్తికి కాలపరిమితి నిర్ణయించి, పర్యవేక్షణ కమిటీని వేయాలని కోరారు.  2.20 టిఎంసిల నీటి సామార్డ్యం కలిగిన పెండ్లిపాకల ప్రాజెక్టు పనులు కూడా పూర్తిగా నిలిచిపోయాయని, దీని కింద 950 ఎకరాలకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉందని తెలిపారు. పెండ్లిపాకల ప్రాజెక్టు పూర్తి చేయుటకు అవసరమైన నిధులను బడ్జెట్‌లో కేటాయించాలని కోరారు.
మూసి ప్రాజెక్టులు తగ్గుతున్న నీటి సామర్థ్యం 
1963లో 4.6 టిఎంసిల నీటి సామర్డ్యంతో మూసీ ప్రాజెక్టును నల్లగొండలో నిర్మించారని, కానీ దాంట్లో ఇసుక చేరడంతో క్రమంగా నీటి సామర్ద్యం తగ్గుతుందని చెప్పారు. మూసీ ఆయకట్టు పరిధిలోని కుడి, ఎడమ కాలువలు శిధిలము కావడం, షట్టర్లు లేకపోవడంతో లైనింగ్‌ చేయకపోవడంతో చివరి ఆయకట్టుకు నీరు చేరటం లేదని చెప్పారు. మూసీలోకి వచ్చే నీరు కాలుష్యంతో ఉండటం వలన అవి తాగిన ప్రజలు, పశువులు చివరికి పండించిన పంటలలో కూడా కాలుష్యం చేరడం వలన ఆనారోగ్యానికి గురౌతున్నామని, ప్రజల్లో ఆందోళన ఉన్నారని తెలిపారు. కాలుష్య నివారణ చర్యలు చేపట్టడం, మూసీని ఆధునీకరించి సుందరీకరణ చేసి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరిచి నిధులు కేటాయించాలని కోరారు.
Spread the love