– గుండ్రాంపల్లి దురంతాలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నైజాం పోలీసుల, రజాకారు మూకల అరాచకాలను ప్రతిఘటించి చరిత్రలో తన స్థానాన్ని పదిలిపర్చుకుంది చిట్యాల మండలంలోని గుండ్రాంపల్లి గ్రామం. ఖాసీం రజ్వీ నాయకత్వంలోని రజాకారు మూకలు ఇక్కడ క్యాంపు పెట్టి ఈ ప్రాంత ప్రజలను తీవ్రమైన ఇబ్బందులకు గురి చేశాయి. ఆ క్యాంపుపై కమ్యూనిస్టు పార్టీ ప్రజా దళాలు దాడి చేసిన సంఘటనలను ఈ ప్రాంత ప్రజలు నేటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు. రజాకార్ క్యాంపుకు సయ్యద్ మక్బూల్ అనే వాడు నాయకత్వం వహించేవాడు. గుండ్రాంపల్లిని కేంద్రంగా చేసుకుని చుట్టుపక్కల అనేక గ్రామాల్లో రజాకారు మూకలు అనేక దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతుండేవి. సూర్యాపేట తాలుకాలోని వర్థమాను కోట గ్రామానికి చెందిన మక్బూల్ నిజాం సైన్యంలో పని చేస్తున్న సమయంలో భార్య చనిపోగా ముగ్గురు కుమారులతో గుండ్రాంపల్లిలో ఉన్న తన అక్క ఇంటికి 1938లో వచ్చాడు. ఆతర్వాత ఖాసీం రజ్వీ స్థాపించిన మజ్లిస్ ఇత్తెహదుల్ ముసల్మాన్ సంస్థలో మక్బూల్ చేరాడు. కొంత మందిని కూడగట్టి రజాకారు గుంపు ఏర్పాటు చేసి గ్రామాలపై పడి దోపిడీలకు దౌర్జన్యాలకు దిగుతుండేవాడు. గుండ్రాంపల్లి చుట్టు పక్కల అనేక గ్రామాల్లో ఈ రజాకారు మూకల దాడికి ప్రజలు ఊరొదిలి వెళ్లారు. గ్రామంలో గృహ నిర్మాణానికై ఇద్దరు నిండు గర్భిణీలను సజీవంగా పునాదిలోనే పాతిపెట్టించిన క్రూరుడు మక్బూల్. పరిసర గ్రామాల్లో మక్బూల్ మూక చేయని అరాచకాలు లేవని చెప్పవచ్చు.
తృటిలో తప్పించుకున్న కిరాతకుడు
అలాంటి మక్బూల్‌కు బుద్ధి చెప్పాలని కమ్యూనిస్టు పార్టీ గెరిల్లా దళాలు నిర్ణయించాయి. 1948 జూన్ 19వ తేదీన కోదండరామిరెడ్డి నాయకత్వాన పాటివానిగూడెం నుంచి పాలి లక్షయ్య, పాలి ఎల్లయ్య, గుండ్రాంపల్లికి చెందిన కంకలి బక్కయ్య, పలివెల గుర్నాలు, పానగంటి ఎలమంద దళం మక్బూల్‌పై దాడి చేసింది. కానీ, చిన్న పొరపాటు మూలంగా మక్బూల్ తప్పించుకున్నాడు.
ఈ సంఘటన అనంతరం మక్బూల్ అరాచకాలకు అంతులేకుండా పోయింది. కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలను తమ ఇష్టానుసారం రజాకారు మూకలు హత్యగావించి గుండ్రాంపల్లి మసీదు సమీపాన గల బావిలో వేసేవారు. తన అరాచకాలను వ్యతిరేకించినందుకు అమీర్ అలీ, మహబూబ్ అలీ, అబ్బాస్ అలీ, మదీన, బనిగి సాబ్‌లను హతమార్చడానికి మక్బూల్ ప్రయత్నించాడు. ఆ అరాచకాలు భరించలేక ముస్లీంలయినప్పటికీ వారు మక్బూల్‌ను మట్టుబెట్టడానికి ప్రయత్నించారు.
గెరిళ్లా దళాలకు భయపడి పరార్
గుండ్రాంపల్లి సమీపాన గల చిన్నకాపర్తి గ్రామానికి చెందిన పాశం పుల్లారెడ్డి రజాకార్లకు పూర్తి సహాయ సహకారాలందిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేసేవాడు. ఇది సహించలేని కోదండరామిరెడ్డి నాయకత్వంలోని గెరిల్లా దళం దాడి చేసి, పుల్లారెడ్డి తలనరికి గ్రామాల్లో ఊరేగింపుగా తీసుకొచ్చి గుండ్రాంపల్లి రహదారి బంగ్లాకు వేలాడదీసి వెళ్లారు. దీనికి భయపడిన మక్బూల్ రాత్రికి రాత్రే గుండ్రాంపల్లి నుంచి సొమ్మును తీసుకుని పరారయ్యాడు. మక్బూల్ పారిపోయిన విషయం తెలిసిన గ్రామస్థులంతా మక్బూల్‌పై కోపంతో వాడున్న ఇంటిని నేలమట్టం చేశారు. వెలిమినేడు గ్రామానికి చెందిన గడ్డం రామయ్య, సప్పిడి రామయ్య మక్బూల్‌కు తోడ్పడే వారు. ఆ కిరాతకులను గ్రామస్థులే చంపేశారు. మక్బూల్ వివిధ గ్రామాల నుంచి సుమారు 200 మంది వరకు తనను ఎదురించిన వారిని తెచ్చి హతమార్చి బావిలో వేశాడు. ఇలా హత్య చేయబడిన వారిలో కేవలం 26 మందిని మాత్రమే గుర్తించగలిగారు. మిగతా వారిని గుర్తించలేక పోయారు. ఈ అమరవీరుల పేరు మీద 1993 జూన్ 4వ తేదీన అక్కడ స్మారక స్థూపాన్ని ఆవిష్కరించారు.