దళిత యువకుడిని చిత్రహింసలకు గురిచేసిన హేయం..

– పలువురి పై అట్రాసిటీ కేసు నమోదు..
నవతెలంగాణ – డిచ్ పల్లి
దళిత యువకుడు చేసిన చిన్న తప్పుకు అగ్రకులస్తులు గుండు గీసి, కొట్టి బూతు మాటలతో చిత్ర హింసలు పెట్టిన సంఘటన ఇందల్ వాయి మండలంలోని అన్సాన్ పల్లి గ్రామం లో చోటు చేసుకుంది. అన్సాన్ పల్లి గ్రామానికి చెందిన కద్దురం నందు అదే గ్రామానికి వేరే కులం అమ్మాయిని ప్రేమ పెళ్లి చేసుకున్నాడు .పెళ్లి చేసుకున్న యువతి తనను వదిలి వెళ్ళిపోయింది దీంతో నందు మానసిక ఒత్తిడి కి గురై సిగరెట్ తాగి పడేసిన క్రమం లో పొరపాటున అదే గ్రామానికి చెందిన దానం శ్రీనివాస్ గడ్డి వాము దగ్ధమైంది. దీంతో యజమాని శ్రీనివాస్ కోపం తో నందు కావాలనే తన గడ్డి వాము ను తగల బెట్టాడని గ్రామ కమిటీ కి నందును అప్పగించాడు. దీంతో గ్రామ కమిటీ సభ్యులు, మరి కొందరు గ్రామస్తులు కలిసి నందు ను బూతు మాటలు తిడుతూ గుండు గీసి, తీవ్రంగా కొట్టారని బాధితుడు వాపోయారు. ఇంత దారుణంగా గుండు గీసి కొట్టడానికి కారణం ఇతర కులానికి చెందిన అమ్మాయిని ప్రేమ పెళ్లి చేసుకున్నందుకే నాని, తన పై కావాలనే కక్ష్య గట్టి దళిత వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టే అగ్ర కులస్తులు చిత్ర హింసలకు గురి చేసి దారుణంగా కొట్టారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. తన ఒంటి గాయాలతో పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు విచారణ జరిపి గ్రామానికి చెందిన కొంత మంది పై అట్రాసిటీ కేసు నమోదు చేశారు.ప్రస్తుతం నందు జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నాడు.మంగళవారం ఇందల్ వాయి మండల అంబెడ్కర్ సంఘం ప్రతినిధులు పాశం కుమర్, సంగెం కిష్టయ్య అధ్వర్యంలో ఇందల్ వాయి పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.ఈ సందర్బంగా కిష్టయ్య , గౌరవాధ్యక్షులు పాశంకుమార్ లు మాట్లాడుతూ అగ్రవర్ణ కులాల వారు దళితులపై దాడులు చేసినట్లయితే కఠినంగా వ్యవహరించడం ఖాయమని ఘాటు హెచ్చరికలు చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ కులాలవారు ఆందోళన చేయనున్నట్లు వారు మండిపడ్డారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.

 

Spread the love