అప్పుడే మోగుతున్న డేంజ‌ర్ బెల్స్..

The danger bells are ringing– కరీంనగర్‌లో ఇక మున్ముందు కష్ట’మే’
– డెడ్‌ స్టోరేజీకి ఎల్‌ఎమ్‌డీ
– 24టీఎంసీల సామర్థ్యం ఉన్న డ్యామ్‌లో ప్రస్తుతం 6 టీఎంసీలే!
– మూడేండ్లలో ఇదే సమయానికి 15 టీఎంసీలకు తగ్గని డ్యామ్‌ నిల్వ
– రాష్ట్రంలో పలు ప్రాజెక్టుల్లో తగ్గిన నిల్వలు
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
కరీం’నగరానికి’ తాగునీరందించే ఎల్‌ఎమ్‌డీ (దిగువ మానేరు) డ్యామ్‌ డెడ్‌స్టోరేజీకి చేరింది. 24.034 టీఎంసీల సామర్థ్యం ఉన్న జలాశయంలో ప్రస్తుతం 6.835టీఎంసీల నీళ్లే ఉన్నాయి. 4.5లక్షల జనాభా ఉన్న కరీం’నగర’ దాహార్తికి కనీసం 8టీఎంసీలు ఉంటే తప్ప వేసవి ముప్పు నుంచి బయటపడటం కష్టమే. అలాంటిది మధ్యమానేరు నుంచి 3500 క్యూసెక్కుల నీళ్లు వదులుతున్నామని సంబంధిత అధికారులు చెబుతున్నా.. ఎల్‌ఎమ్‌డీ నుంచి 4500 క్యూసెక్కులు కాకతీయ కెనాల్‌కు వదులుతుండటం గమనార్హం. మూడేండ్లలో ఏనాడూ 15 టీఎంసీలకు తగ్గకుండా నీటి నిల్వ ఉన్న ఎల్‌ఎమ్‌డీ ఇప్పుడు అడుగంటుతుండటంతో నగర ప్రజల్లో ఆందోళన మొదలైంది. పక్షం రోజుల కిందటే నగరంలో నీటి ఎద్దడి మొదలవగా.. ఇప్పుడు డెడ్‌ స్టోరేజీకి చేరిన డ్యామ్‌తో మున్ముందు కష్ట’మే’నన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
తాగు నీటికి ఎక్కడ కూడా ఇబ్బందులు లేవని, ఇప్పటికే శ్రీరాం సాగర్‌ నుంచి 3టీఎంసీల నీరు మిడ్‌ మానేరుకు చేరుకున్నాయని సంబంధిత శాఖ అధికారులు.. ఈనెల 9న రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ నిర్వహించిన సమీక్షలో వెల్లడించారు. మధ్యమానేరు (ఎమ్‌ఎమ్‌డీ)లో 12టీఎంసీల నీళ్లు ఉన్నాయని, దిగువమానేరు (ఎల్‌ఎమ్‌డీ)లో 7.5టీఎంసీల నిల్వలున్నాయన్నారు. మధ్యమానేరు నుంచి కొన్ని రోజులుగా 3500 క్యూసెక్కుల నీటిని వదులుతున్న అధికారులు తాగునీటి అవసరాల కోసం ఈనెల 11 నుంచి 2 టీఎంసీల నీటిని ఎల్‌ఎమ్‌డీలో చేర్చుతామని చెప్పారు. వారం కిందటి వరకూ 12టీఎంసీల నీళ్లు ఉన్న మధ్యమానేరులో ప్రస్తుతం 10.88టీఎంసీలే ఉన్నాయి. ఎల్‌ఎమ్‌డీకి 2 టీఎంసీల నీళ్లు వదిలినట్టు కనిపిస్తున్నా.. దిగువమానేరు నుంచి కాకతీయ కెనాల్‌కు కొద్దిరోజులుగా 4500 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతోంది. దాంతో తాగునీటి కోసం నీళ్లు వదిలినా.. వారం కిందటి వరకూ 7.5టీఎంసీలు ఉన్న డ్యామ్‌ ప్రస్తుతం 6 టీఎంసీలకు చేరి డెడ్‌స్టోరేజీలో ఉంది.
నగరానికి మొదలైన తాగునీటి ఎద్దడి 
స్మార్ట్‌సిటీగా ఎదిగిన కరీం’నగరం’లో ప్రస్తుతం సుమారు 4.5లక్షల మంది జనాభా నివసిస్తున్నారు. శివారు గ్రామాలైన అల్గునూర్‌, వల్లంపహాడ్‌, సదాశివపల్లి, పద్మనగర్‌, రేకూర్తి, సీతారాంపూర్‌, తీగలగుట్టపల్లిని 2019లో విలీనం చేసుకుని 60 డివిజన్ల మున్సిపల్‌ కార్పొరేషన్‌గా ఎదిగింది. నగరం మొత్తంగా 16 వాటర్‌ ట్యాంకులు, సుమారు 60వేల నల్లా కనెక్షన్లు ఉండగా.. రోజువారీగా 66 మిలియన్స్‌ లీటర్స్‌ ఫర్‌ డే (ఎమ్‌ఎల్‌డీలు) తాగునీటిని సరఫరా చేస్తున్నారు. అయితే రోజువారీ డిమాండ్‌కు తగ్గట్టుగా ఈ సరఫరా కూడా సరిపోవడం లేదు. పైగా విలీన గ్రామాల్లో నల్లా సరఫరాలో తీవ్ర ఇబ్బందులు ఉండగా.. హైలెవల్‌ ప్రాంతాల్లో రోజు విడిచి రోజు.. అదీ కొద్దిసేపు మాత్రమే నల్లా నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రధానంగా సరస్వతినగర్‌, తీగలగుట్టపల్లి డివిజన్లలో ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తుండగా.. హైలెవల్‌ ప్రాంతాలైన విద్యానగర్‌, సుభాష్‌నగర్‌, మంకమ్మతోట, సప్తగిరికాలనీ, మార్కండేయనగర్‌, చైనత్యపురి, భాగ్యనగర్‌, బుట్టి రాజారాం కాలనీల్లో రోజు విడిచి రోజు కొద్ది సేపే నీరు సరఫరా చేస్తున్నారు. కోర్టు, విద్యానగర్‌, రాంనగర్‌, ఎస్‌ఆర్‌ఆర్‌, అంబేద్కర్‌నగర్‌ వాటర్‌ట్యాంక్‌ రిజర్వాయర్ల పరిధిలో నీటి సరఫరాకు ఇబ్బదులు వచ్చేలా ఉన్నాయని సంబంధిత మున్సిపల్‌ అధికారులు చెబుతుండగా.. మార్చి 6న జరిగిన మున్సిపల్‌ కార్పొరేషన్‌ బడ్జెట్‌ సమావేశాల్లోనూ తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఎస్సారెస్పీ నీటిని ప్రభుత్వం విడుదల చేయాలని తీర్మానమూ చేయడం గమనార్హం.
పలు ప్రాజెక్టులోనూ తగ్గిన నీటిమట్టం 
ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్‌ (ఎస్సారెస్పీ) పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (90.3 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1066.8 అడుగుల (23.26 టీఎంసీల) నీరు నిల్వ ఉన్నట్టు అధికారులు తెలిపారు. గతేడాది ఇదే సమయానికి ఎస్సారెస్పీలో 1074.10 అడుగుల(37.612 టీఎంసీల) నీరు నిల్వ ఉన్నట్టు తెలిపారు. వివిధ కాలువలకు, ఎత్తిపోతల పథకాలకు 9874 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగుల (17.802 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1394.46 అడుగుల(6.476 టీఎంసీల) నీరు నిల్వ ఉంది. ప్రధాన కాలువలకు 1156 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 74.00 మీటర్లకు గాను 71.12 మీటర్ల నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం అన్ని గేట్లను మూసివేశారు. అవుట్‌ ఫ్లో ఎడమ కాలువకు 60 క్యూసెక్కులు, కుడి కాలువకు 3 క్కూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.
513.90 అడుగులకు ‘సాగర్‌’ నీటిమట్టం 
నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నీటిమట్టం డెడ్‌ స్టోరేజ్‌కు చేరుకుంటుంది. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు (312 టీఎంసీలు) కాగా ప్రాజెక్టు కనీస నీటిమట్టం 510 అడుగులు. ప్రస్తుతం 513.90 అడుగుల (138.3868 టీఎంసీలు) వద్ద నీరు నిల్వ ఉంది. మరో 3 టీఎంసీల నీరు తగ్గితే రిజర్వాయర్‌ డెడ్‌ స్టోరేజీకి చేరుకోనున్నది. ఎస్‌ఎల్‌బీసీి ద్వారా 1350క్యూసెక్కుల నీటిని మాత్రమే దిగువకు విడుదల చేస్తున్నారు.

నీటి ఎద్దడి ఉందనే అపోహ వద్దు..
నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని ప్రతిపక్షాలు అపోహ సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. అలా చేయవద్దన్నారు. ఈ నెల 9న ఇరిగేషన్‌, మిషన్‌ భగీరథ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన.. తాగునీటి విషయమై ప్రకటన విడుదల చేశారు. ఈ సంవత్సరం తీవ్ర వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా మాత్రమే కేవలం నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచిస్తున్నామని పేర్కొన్నారు. కరీంనగర్‌లో తాగునీటికి ఇబ్బందులు ఉండకుండా చూడాలని పంచాయతీ రాజ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సందీప్‌ సుల్తానియా సహా కలెక్టర్‌ పమేలా సత్పతికి సైతం ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు.

– రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌

Spread the love