– మరో 206 మంది అచూకీ గల్లంతు
– వాయనాడ్‌లో ఏడు రోజూ కొనసాగిన గాలింపు, సహాయక కార్యక్రమాలు
తిరువనంతపురం : వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రమాదంలో మృతుల సంఖ్య 222గా ఉన్నట్లు కేరళ ప్రభుత్వం సోమవారం అంచనా వేసింది. అలాగే ఏడో రోజైన సోమవారం కూడా శిథిలాల కింద ప్రాణాలతో ఉన్న వారి కోసం, మృతదేహాల కోసం అన్వేషణ కొనసాగింది. మృతుల్లో 37 మంది చిన్నారులు, 88 మంది మహిళలు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం మృతదేహాల్లో 172 మృతదేహాలను గుర్తించారు. చూరల్‌మల, ముండక్కై, అట్టమల ప్రాంతాల్లో బురదతో నిండిన శిథిలాల నుంచి 180 శరీర భాగాలను రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు. మృతదేహాలకు, శరీర భాగాలకు ఫోరెన్సిక్ వైద్యులు పోస్టు మార్టం నిర్వహించారు, డిఎన్‌ఎ నమూనాలను సేకరించారు. కాగా, ఇంకా 206 మంది అచూకీని గుర్తించలేకపోయారు. గాలింపు, సహాయక కార్యక్రమాలు ఇంకా కొనసాగుతున్నందున మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అటవీ శాఖ మంత్రి ఎకె శశీంద్రన్ విలేకరులతో మాట్లాడుతూ నిపుణులు గుర్తించిన నాలుగు ప్రాంతాల్లో భూమిలోకి చొచ్చుకునిపోయే రాడర్లు కలిగిన డ్రోన్లతో గాలింపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చూరల్‌మల, ముండక్కైను కలిపే ఇరువన్హిపుజా నదిపై ఉన్న బెయిలీ వంతెనకు ఇరువైపులా దృష్టి కేంద్రీకరించినట్లు మంత్రి చెప్పారు.
మరోవైపు కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలోకి సాధారణ పౌరులు ప్రవేశించడాన్ని కేరళ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ఈ ప్రాంతంలో సుమారు 1,500 మంది ప్రభుత్వ సిబ్బంది, దాదాపు ఇదే సంఖ్యలో ఉన్న వాలంటీర్ల సహాయంతో సహాయక, గాలింపు చర్యలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ ప్రాంతానికి వెలుపల ‘రక్షిత జోన్’లో సంబంధిత అధికారుల ముందస్తు అనుమతితో బాధితులకు ఆహారాన్ని పంపిణీ చేయడానికి స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కాగా, గుర్తు తెలియని 31 మృతదేహాలకు, 158 శరీర భాగాలకు పిథుమల శ్మశాన వాటికలో వయనాడ్ జిల్లా యంత్రాంగం సామూహిక అంత్యక్రియలు కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముందు అన్ని ప్రధాన విశ్వాసాలకు ప్రాతినిధ్యం వహించే విధంగా అయా మత పెద్దలు చేత ప్రార్థనలు నిర్వహించారు.
అలాగే ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షతన సోమవారం వయనాడ్‌లో గాలింపు, రెస్క్యూ, సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్న క్యాబినెట్ సబ్‌కమిటీ ఆన్‌లైన్ సమావేశం జరిగింది.
బాధితులకు డాక్యుమెంట్ల కోసం త్వరలో ప్రక్రియ : మంత్రి రాజేష్
కొండచరియలు విరిగిపడిన ప్రమాదంలో బాధితుల రక్షణ, పునరావాసం కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని స్థానిక స్వపరిపాలన శాఖ మంత్రి ఎంబి రాజేష్ సోమవారం తెలిపారు. బాధితులకు సంబంధించిన గల్లంతైన అన్ని డాక్యుమెంట్లను పొందేందుకు త్వరలో ఒక ప్రక్రియ ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు. ఈ ప్రక్రియలో ముందుగా విపత్తు నిర్వహణ అథారిటీ మార్గదర్శకాల ప్రకారం స్థానిక స్వపరిపాలన శాఖ నేతృత్వంలో, పునరావాస శిబిరాల్లో ఉన్న వ్యక్తుల వద్ద నుంచి వారు పోగొట్టుకున్న డాక్యుమెంట్ల గురించి ప్రాథమిక సమాచారాన్ని సేకరిస్తామని తెలిపారు. తరువాత వివిధ శాఖల సహకారంతో తదుపరి రెండు రోజుల్లో ఈ సేకరణ ప్రక్రియ పూర్తి చేస్తామని మంత్రి చెప్పారు. తరువాత డాక్యుమెంట్ల పంపిణీ ఉంటుందని తెలిపారు. అలాగే, ఈ ప్రమాదంలో 352 ఇళ్లు పూర్తిగా, 122 ఇళ్లు పాక్షికంగా ధ్వంసమైనట్లు ప్రాధమికంగా గుర్తించినట్లు తెలిపారు. వైతిరి తాలూకాలోని కొత్తపాడి, వెల్లరిమల, త్రికేపేట గ్రామాలను రాష్ట్ర ప్రభుత్వం విపత్తు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించి ఉపాధి హామీ పథకం ద్వారా 150 రోజుల ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా రోడ్డు నిర్మాణ పరిమితిని 10 శాతం పెంచనున్నారు. మెటీరియల్ వర్క్ పరిమితిని కూడా 40 శాతం పెంచనున్నారు. ఈ ప్రమాదంలో గల్లంతైన వ్యక్తుల వివరాల సేకరణ వేగంగా జరుగుతోందని మంత్రి చెప్పారు.