ప్రభుత్వ డాక్టర్ల డిమాండ్లను పరిష్కరించాలి

– తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రభుత్వ వైద్యుల డిమాండ్లను పరిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సంఘం ప్రతినిధుల బృందం రాష్ట్ర వైద్యవిద్య సంచాలకులు డాక్టర్‌ కె.రమేశ్‌ రెడ్డిని మంగళవారం కలిసి వినతిపత్రం సమర్పించింది. తమ డిమాండ్లను ప్రభుత్వానికి నివేదించాలని కోరింది. టైంబాండ్‌ ప్రమోషన్లకు సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు. వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ అజరు కుమార్‌ను కలిసి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినట్టుగానే వైద్య విధాన పరిషత్‌ ఉద్యోగులను కూడా ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్‌ చేశారు. వైద్యారోగ్యశాఖలో ఆర్డీవోల పెత్తనాన్ని సహించేది లేదనీ, వారిని పర్యవేక్షణ అధికారులుగా నియమించే యోచనను విరమించుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో టైం బౌండ్‌ ప్రమోషన్లను వెంటనే కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సీనియార్టీ ప్రాతిపదికన జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను 33 జిల్లాలకు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అడిషనల్‌ డీఎంహెచ్‌ఓ పోస్టులను డీఎంహెచ్‌ఓలుగా మార్చి సీనియారిటీ ప్రాతిపదికన నింపాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రతినిధి బృందంలో డాక్టర్లు పల్లం ప్రవీణ్‌, బొంగు రమేష్‌, లాలూ ప్రసాద్‌ రాథోడ్‌, నరహరి, అజ్మీరా రంగ, ఉమా కాంత్‌ , రాజు, కళ్యాణ్‌ , వినోద్‌, శ్రీనివాస్‌, భూపేందర్‌, రవి, రమేష్‌, దీన్‌ దయాళ్‌, మురళి, బాలాజీ, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్‌, రాగిణి, రాజ వర్థన్‌ తదితరులున్నారు.

Spread the love