గుడిసెల కూల్చివేత.. ఉద్రిక్తత

– అడ్డుకున్న మహిళలు
– అటు అరెస్టులు.. ఇటు కూల్చివేతలు
– వందలాది మంది అరెస్ట్‌
– ప్రజా ప్రతిఘటనతో
వెనుతిరిగిన అధికార యంత్రాంగం
నవతెలంగాణ-మహబూబాబాద్‌
రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలు నిలువ నీడ కోసం వేసుకున్న గుడిసెలపై అధికార యంత్రాంగం మూకుమ్మడిగా దాడి చేసింది. గింత జాగ కోసం పోరాడుతున్న పేదలపై కనికరం చూపకుండా గుడిసెలు వేసుకుంటా వుంటే.. తొలగిస్తూ వస్తున్నారు. రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు పోలీసులను తోడు తీసుకొచ్చుకుని తెల్లవారు జామునే గుడిసెల ప్రాంతానికొచ్చారు. అడ్డుకున్న పేదలను ఓ వైపు అరెస్టు చేస్తూనే.. మరోవైపు కూల్చివేతలు కానిచ్చారు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌ సమీపంలోని కురవి రహదారి వెంట బుధవారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. సర్వే నెంబర్‌ 255లో సుమారు 50 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అక్కడ దాదాపు రెండు వేల మంది మూడు నెలల కిందట సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో గుడిసెలు వేసుకున్నారు. అప్పటి నుంచి అధికార యంత్రాంగం ఐదుసార్లు వాటిని తొలగించినప్పటికీ మళ్లీ పేదలు గుడిసెలు వేసుకున్నారు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామునే ఆర్డీఓ కొమురయ్య, డీఎస్పీ రమణబాబు, సీఐ రమేష్‌బాబు, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రసన్న రాణి ఆధ్వర్యంలో భారీగా పోలీసు బలగాన్ని తీసుకొని గుడిసెల ప్రాంతానికి వచ్చారు. విషయం తెలుసుకున్న పేదలు కూడా పెద్దఎత్తున తరలివచ్చి అధికారులను అడ్డుకున్నారు. ప్రొక్‌లైనర్‌ను, డోజర్‌ కదలకుండా మహిళలు అడ్డంగా కూర్చు న్నారు. అయినా పోలీసుల సహకారంతో అధికారులు గుడిసెలను కూల్చివేస్తుండగా అడ్డుపోయిన అయ్యగారిపెళ్లి గ్రామానికి చెందిన జున్ను నరసమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. కంచర్లగూడెం శ్రీను సొమ్మసిల్లి పడిపోయాడు.
సీపీఐ(ఎం) మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ సుర్ణపు సోమయ్య, పట్టణ కార్యదర్శి బానోత్‌ సీతారాం, ఎమగాని వెంకన్న, తోట శ్రీను, బూరుగుల లక్ష్మణ్‌, బానోతు శ్రీరామ్‌, గుడిసె వాసులు అధికార యంత్రాంగంతో వాగ్వాదానికి దిగారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వందలాదిగా వచ్చిన పోలీసులు గుడిసెవాసులను లాక్కెళ్లి డీసీఎంలో ఎక్కించి పోలీస్టేషన్‌కు తరలించారు. నాయకులు ఆకుల రాజు, అలువాల వీరయ్య, సమ్మెట రాజమౌళి, దెడ్డెల రాంమూర్తితో పాటు పేదలను అరెస్టు చేశారు. అనంతరం నాయకులు సోమయ్య ఆధ్వర్యంలో డీఎస్పీ, ఆర్డీవోలతో చర్చలు నిర్వహించారు. గుడిసెలను తొలగించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఆర్డీవో కొమురయ్య మాట్లాడుతూ.. పూర్తి ఆధారాలతో దరఖాస్తు చేసుకుంటే.. ఇండ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు. కానీ, ప్రభుత్వ భూములను ఆక్రమించడం సరికాదన్నారు. మూడు నెలలుగా గుడిసెలు వేసుకుని నివసిస్తున్నామని, ఎమ్మార్వో కార్యాలయంలో ఎన్నోసార్లు దరఖాస్తు ఇచ్చినా కనీసం పరిశీలించ లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో పోలీసు, అధికార యంత్రాంగం వెనుదిరిగారు.

Spread the love