రాష్ట్రం వచ్చాకే మత్స్యరంగం అభివృద్ధి

– జూన్‌ 8న అన్ని జిల్లా కేంద్రాల్లో ఫిష్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ : మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌
నవతెలంగాణ-అంబర్‌పేట
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మత్స్యరంగం ఎంతో అభివృద్ధి చెందిందని, మత్స్యకారులు సంతోషంగా ఉన్నారని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. హైదరాబాద్‌ మాసాబ్‌ ట్యాంక్‌లోని మత్స్య భవన్‌లో సోమవారం జరిగిన మత్స్య సహకార సొసైటీల చైర్మెన్‌ పిట్టల రవీందర్‌ పదవీ బాధ్యతల స్వీకార కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్బంగా రవీందర్‌కు మంత్రి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సభలో మంత్రి మాట్లాడుతూ.. మత్స్యరంగంపై ఎంతో అనుభవం ఉన్న పిట్టల రవీందర్‌ చైర్మెన్‌గా బాధ్యతలు చేపట్టడం వల్ల ఈ రంగం మరింత అభివృద్ధిలో ముందుకు వెళుతుందని అన్నారు.వివిధ కులవృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారి కుటుంబాల్లో వెలుగులు నింపడం, గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయాలనేదే సీఎం కేసీఆర్‌ లక్ష్యం అన్నారు. అందులో భాగంగానే దేశంలో ఎక్కడా లేని విధంగా కోట్లాది రూపాయలతో అన్ని నీటి వనరులలో ఉచితంగా చేప పిల్లలను విడుదల చేస్తున్నట్టు చెప్పారు.చేపలను తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోవద్దని సూచించారు. వివిధ రకాల చేపల వంటకాలను అమ్ముకోనేందుకు వీలుగా సంచార విక్రయ వాహనాలను ప్రభుత్వం అందజేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఇంకా మిగిలిన అర్హులైన మత్స్య కారులకు కూడా సబ్సిడీపై వాహనాలు అందజేసే విధంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. వచ్చే నెల 8వ తేదీన మృగశిర కార్తె సందర్బంగా మొదటి సారిగా రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో ఫిష్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ ఫెస్టివల్‌లో వివిధ రకాల చేపల వంటకాలకు స్టాల్స్‌ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి వైస్‌ చైర్మెన్‌ బండ ప్రకాష్‌, ఎమ్మెల్సీలు పాడి కౌశిక్‌ రెడ్డి, నారదాసు లక్ష్మణరావు, కార్పోరేషన్‌ చైర్మెన్‌లు దూదిమెట్ల బాలరాజ్‌ యాదవ్‌, కోలేటి దామోదర్‌ గుప్తా, గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌, అల్లం నారాయణ, పశుసంవర్ధక శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ అధర్‌ సిన్హా, మత్స్య శాఖ కమిషనర్‌ లచ్చిరాం భూక్యా, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌ రాంచందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love