నియంత భయపడుతున్నారు

The dictator is afraid– ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతల అరెస్టులు మరిన్ని జరగొచ్చు
– ఇలాంటి చర్యల ద్వారా ‘ఇండియా’ను బలహీనపరచలేరు: శివసేన నేత సంజయ్ రౌత్‌
ముంబయి : లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు మరికొందరు ప్రతిపక్ష నేతలను అరెస్ట్‌ చేస్తాయని శివసేన (ఠాక్రే) నేత, రాజ్యసభ సభ్యుడు సంజరు రౌత్‌ ఆరోపించారు. ‘ఆప్‌ ఎంపీ సంజయ్ సింగ్‌ తరహాలోనే రాబోయే రోజుల్లో మరికొందరు ప్రతిపక్ష నేతలను అరెస్ట్‌ చేస్తారు. రాజకీయవేత్త అయిన సంజయ్ సింగ్‌ ఎలాంటి మచ్చ లేని వ్యక్తి. అలాంటి వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. అత్యవసర పరిస్థితి సమయంలో ప్రతిపక్ష నేతల పట్ల ఎలా వ్యవహరించారో ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా అలాగే చేస్తోంది’ అని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వ నియంతృత్వాన్ని వ్యతిరేకించే ఇండియా కూటమి నాయకులను ఈడీ, సీబీఐ, ఐటీ శాఖ లక్ష్యంగా చేసుకుంటుందని, అయితే ఇలాంటి చర్యల ద్వారా ఇండియా కూటమిని మోడీ ప్రభుత్వం బలహీనపరచలేదని తెలిపారు.
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని, ఇండియా కూటమిలో ఐక్యత చూసి ఆ పార్టీ భయపడుతోందని సంజయ్ రౌత్‌ చెప్పారు. బీజేపీ నేతలు గర్విష్టులని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే జర్నలిస్టులను సైతం వేధిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ‘ఇప్పుడు నియంత భయపడుతున్నాడు. అందుకే ప్రతిపక్షాలపై అన్ని అస్త్రాలు ప్రయోగిస్తున్నారు. ఆప్‌ ఎంపీ సంజయ్ సింగ్‌ అరెస్ట్‌ ఇండియా కూటమిని బలహీనపరచలేదు’ అని స్పష్టం చేశారు. మహారాష్ట్రలోనూ, బీజేపీ పాలిత రాష్ట్రాలలోనూ అవినీతిపై కేంద్రం ఎందుకు చర్య తీసుకోవడం లేదని ప్రశ్నించారు. దీనినిబట్టి చూస్తే కేంద్రంలోని బీజేపీ నాయకత్వం భయపడుతోందని అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. నియంతృత్వ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు లోక్‌సభ ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారని సంజరు రౌత్‌ అన్నారు.

Spread the love