మోహన్ మాస్టారు నిజంగా మోహనాకారుడే. తన స్ఫురద్రూపంతోనే కాదు, తన వాక్చాతుర్యంతో విద్యార్థులను ఇట్టే ఆకట్టుకోగలరు. విశాలమైన పాఠశాలలో పనిచేస్తున్న మోహన్ అంతే విశాల హృదయంతో తన దగ్గర విద్యను అభ్యసిస్తున్న పిల్లలను ప్రేమతో సాకుతారు. అందుకే మోహన్ మాస్టారంటే పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ వల్లమాలిన అభిమానం, ప్రేమ. గంభీరమైన గొంతుతో, విశేషమైన అర్థ వివరణతో తను పాఠ్యాంశాలు చెబుతుంటే, తరగతి గదిలోని పిల్లలు తమను తాము మైమరచిపోతూ వినడం కద్దు. అంతేనా అంటే కాదు, మాస్టారు గొంతెత్తి పాటలు పాడితే పిల్లల హృదయ మందిరాలు ఆ గాత్ర మాధుర్యంలో తడిసి ముద్దై పరవశించక మానవు.
మాస్టారు పనిచేసే బడిని అనాదిగా ‘ఆటలబడి’ అంటారు. సాయంత్రం వేళ అదొక క్రీడా పాఠశాలలా మారిపోతుంది. పిల్లలంతా ఆటల సంబరాల్లో మునిగితేలుతుంటారు. ఒకపక్క వాలీబాల్, మరోపక్క బ్యాడ్మింటన్, ఇంకో పక్క కబడ్డీ ఆడుతూ పిల్లలు సరదాగా తమ స్నేహితులతో గడుపుతుంటారు. ఉజ్జిఉజ్జీలుగా పిల్లలు రన్నింగ్ ట్రాక్ మీద జాగింగ్ చేస్తూ కనబడుతుంటారు. ఉపాధ్యాయులైతే ఈవినింగ్ వాక్ చేస్తుంటారు కూడా. మోహన్ మాస్టారు కూడా రకరకాల ఆటల్లో పిల్లలతో మమేకమవుతూ ఉంటుంటారు. బడి అంటే ఒక చదువే కాదు, సకల విద్యలకు నిలయమయ్యేది, నేర్పేది అని నమ్మే వారిలో మోహన్ మాస్టారు ఒకరు. అందుకే అనేక సహపాఠ్యేతర కార్యక్రమాలలో పిల్లలు పాలుపంచుకునేలా ప్రోత్సహిస్తుంటారు.
ఇదిలా ఉంటే ఒక రోజు మోహన్ సార్ పదవ తరగతిలో యథావిథిగా పాఠం చెబుతుండగా చివరలో విద్యార్థులను ఉద్దేశించి ఇలా అన్నారు… ”నేను రేపు ఆదివారం మీ ఊరిలో జరగబోయే మా బంధువుల కార్యక్రమానికి నా భార్యను తీసుకొని వస్తున్నాను. అయితే మీలో ఎవరి ఇంటికి రావాలి?” అని అడిగారు. దానికి విద్యార్థులంతా ”మా ఇంటికి రండి సార్… మా ఇంటికి రండి సార్” అని చేతులెత్తి ఆహ్వానించారు. కానీ జానకి అనే అమ్మాయి నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఆమె ముఖం దించుకొని అలానే ఉండిపోయింది. దాంతో మోహన్ మాస్టర్ అందరినీ గమనిస్తూ.. ”బాగానే ఉంది. అందరూ మమ్మల్ని ఆహ్వానించారు. సంతోషమే కానీ, ఒక్క జానకి మాత్రం ఎందుకో చేయి ఎత్తలేదు. కారణం ఏమై ఉంటుంది?” అని ప్రశ్నించారు.
దానికి జానకి సిగ్గుపడుతూ, ”సార్… మా ఇల్లు బాగోదు. మా ఇల్లు మీకు నచ్చదు. అందుకే సార్ మిమ్మల్ని నేను పిలవలేకపోయాను” అంది. దానికి వెంటనే మాస్టారు ”అలానా! సరే అయితే, నువ్వు పిలవలేదు కాబట్టి మేం మీ ఇంటికే వస్తాం. మరి ఎవరి ఇంటికీ వెళ్ళం” అంటూ క్లాస్ నుంచి నిష్క్రమించారు. కానీ జానకికి మాత్రం అనుమానమే. ఎందుకంటే మాస్టారు మాలాంటి వారి ఇంటికి వస్తారా! అతను ఎక్కడీ మేమెక్కడీ అనే సందిగ్ధంలో ఉంటూ, మాస్టారు ఏదో దివి నుండి భువికొచ్చిన మనిషని అనుకుంది.
మరుసటి రోజు ఉదయం మాస్టారు తన భార్యను తీసుకొని తాను పనిచేస్తున్న గ్రామానికి వచ్చారు. అక్కడ తన బంధువుల ఇంట జరిగిన శుభ కార్యక్రమానికి హాజరై, తన పాఠశాలను కూడా భార్యకు చూపించారు. ఆమె కూడా పాఠశాలను చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే, ఆమె ఎప్పుడూ అంత పెద్ద పాఠశాల ప్రాంగణాన్ని చూడలేదు కాబట్టి. అదే విషయాన్ని ఆమె మోహన్ సారుతో పంచుకున్నారు. తదనంతరం తిరిగి వెళుతున్న క్రమంలో మోహన్ మాస్టారు తన భార్యతో సహా జానకి వాళ్ళ ఇంటికి వెళ్లారు. వెళ్లేసరికి ఆమె లేదు. వాళ్ల నాన్నమ్మ ఉంది. నేను మీ మనవరాలకి విద్యాబుద్ధులు చెబుతున్న టీచర్ని అని మోహన్ సార్ ఆమెతో చెప్పేసరికి, ఆమె అక్కడెక్కడో దగ్గరలో ఉన్న జానకిని పిలవడానికి వెళ్లి వెంటబెట్టుకొచ్చింది. అంతే! జానకి ఆశ్చర్యపోయింది. పురాణాల్లో శ్రీకృష్ణుడి ఇంటికి కుచేలుడు వచ్చేటప్పుడు కన్నయ్య ఎంత సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడని చెప్తారే… అలాంటి సంబ్రమాశ్చర్యాలకు లోనయ్యింది జానకి. ఆ విషయం అక్కడున్న వారంతా పసిగట్టారు. ఆ సమయంలో జానకికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. తన మాస్టారుని, గురువమ్మని ఎలా గౌరవించాలో! తెలియక తడబాటుకులోనైంది.
అంతలోనే తేరుకొని తన ఇంట్లో అందుబాటులో ఉన్న ఆసనం మీద వారిరువురిని కూర్చుండబెట్టింది. వెంటనే తన నాన్నమ్మకు చెప్పి వీధిలో ఉన్న అంగడికి పంపి ఓ చల్లని కూల్ డ్రింక్ తెప్పించ్చింది. అది చూసి మాస్టర్ ”జానూ… నాకు ఇష్టమైన డ్రింక్ ఇదే! అని నీకు ఎలా తెలుసు?” అన్నారు.
”సార్ ఇదివరలో నేను మీరు ఈ డ్రింక్‌ని ఇష్టంగా తీసుకోవడం చూశాను. అందుకే అదే డ్రింకు తెప్పించాను” అంది జానకి.
”ఓహో అదా! ఒక్కోసారి మన పాఠశాలలో ఏదైనా లంచ్ పార్టీ జరిగితే, అప్పుడు ఈ డ్రింక్ తాగుతుంటాను. దాన్ని నువ్వు గమనించి ఉంటావు. ఉపాధ్యాయుల అలవాట్లను విద్యార్థులు దగ్గరగా గమనిస్తుంటారంటారు. ఉపాధ్యాయులు అందుకే చాలా జాగ్రత్తగా విద్యార్థుల ముందు మెలగాలి” అంటూ, ”ఓకే జానూ థాంక్యూ” అన్నారు మాస్టారు.
మాస్టారు జానూ అని జానకిని ప్రేమతో దగ్గరకు పిలుస్తూ… ”నీవేమీ ఆత్రుత పడకు జానకీ.. మేమేమీ ఆకాశం నుంచి ఊడిపడలేదు. మాకు ఏమీ రెండు కొమ్ములు లేవు. మేము కూడా మామూలు మనుషులమే. మీలాంటి వాళ్లమే. అష్టకష్టాలు పడి మా తల్లిదండ్రులు మమ్మల్ని చదివించి ఇంతటి ప్రయోజకులను చేశారు. వారి త్యాగమే మమ్మల్ని ఈ రోజు మీ ముందు గొప్పవారిగా నిలబెట్టింది. అంతే తప్ప మేమేమీ గొప్ప కాదు. వేరు అసలే కాదు. అది నువ్వు గుర్తుంచుకో. మనలాంటి పేద, మధ్యతరగతి వర్గాల వారికి చదువే ఆసరాగా ఉంటుంది. విద్యయే మన జీవన నేపథ్యాలను మెరుగుపరుస్తుంది. అదే మనల్ని అందరిలో గొప్పగా నిలబెడుతుంది. అందువల్ల నువ్వు కూడా చక్కగా చదువుకొని, ఉన్నతమైన స్థితిని సంపాదించు. అప్పుడు నువ్వు కూడా పెద్ద ఇల్లు కట్టుకోగలవు. మీ అమ్మానాన్నలను అందులో ఉంచి చక్కగా చూసుకోగలవు. నీ తల్లిదండ్రులకే కాదు, నీ ఊరికి కూడా పేరుప్రఖ్యాతులు తీసుకురాగలవు” అంటూ మోహన్ సార్ జానకిని ఆశీర్వదించారు.
అలాగే జానకి వాళ్ళ నాన్నమ్మతో మాస్టారు ఇంకా ఇలా అన్నారు… ”అమ్మా! మీ మనవరాలు చాలా తెలివైనది, చురుకైనది. టీచర్లు అంటే ఆమెకు చాలా గౌరవం. చాలా చక్కగా పాఠాలు వింటుంది. బాగా చదువుకుంటుంది. మా టీచర్లు అందరికీ జానకి అంటే చాలా ఇష్టం. జానకిని బాగా చదివించండి. ఆమె మీ కుటుంబానికి పేరు తీసుకొస్తుంది. ఈ చిన్న వయస్సులో పెళ్లి అంటూ ఆమె చదువుకు ఆటంకం కలిగించవద్దు. చక్కగా చదువుకోనివ్వండి. తన కాళ్ళ మీద తాను నిలబడి మీ అందరినీ బాగా చూసుకుంటుంది. మీకు సమాజంలో గౌరవాన్ని తీసుకొస్తుంది” అని మోహన్ సార్ చెబుతూ, జానకికి బై..బై చెబుతూ అక్కడి నుంచి భార్యతో కలిసి తన ఊరికి బయలుదేరారు.
– పిల్లా తిరుపతిరావు, 7095184846