– ఏటా జాన్ లో టెండర్లు పూర్తి
– ఈ సంవత్సరం ఇంకా పూర్తికానీ వైనం
– ప్రభుత్వ స్పష్టత కరువు.. ఆందోళనలో మత్స్యకారులు
నవతెలంగాణ – మల్హర్ రావు
కులవృత్తిపై ఆధారపడి జీవించే మత్స్యకారులు జీవన ప్రమాణాలను పెంచాలనే ఉద్దేశ్యంతో గత బిఆర్ఎస్ ప్రభుత్వం చెరువుల్లో ఉచితంగా చేపపిల్లల పంపిణీ ప్రక్రియ చేపట్టింది.2016లో కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా ఏటా జూన్ మొదటి వారంలోగా చేపపిల్లల సీడ్ టెండర్ల ప్రక్రియ పూర్తి చేసింది. వర్షాలు సంవృద్ధిగా కురిసిన కొద్దీ మండలంలో రిజర్వాయర్,చెరువులు,కుంటలు వారిగా సీడ్ వేసేవారు.కానీ ఈ ఏడాది జూన్ కాదు జులై పూర్తి కావస్తున్నా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకపోవడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.
గతేడాది 2.50 లక్షల చేపపిల్లలు పంపిణీ..
మండలంలో మత్స పారిశ్రామిక సంఘాలు 116 ఉన్నాయి.ఇందులో 9,200 మంది సభ్యులు ఉన్నారు. మండల వ్యాప్తంగా 5 రిజర్వాయర్స్, 832 చెరువులు,కుక్తలు ఉన్నాయి.2021-22 ఆర్థిక సంవత్సరంలో 1.56 లక్షలు, 2022-2023 ఆర్థిక సంవత్సరంలో 2.50 లక్షల చేపపిల్లల సీడ్ ను వదిలారు.2024-25 ఆర్థిక సంవత్సరానికి ఇంకా ప్రపోజల్ చేయలేదని,ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని మత్స్యశాఖ అధికారులు అంటున్నారు.
ఈ ఏడాది ఇంకా మొదలుకానీ కసరత్తు..
ఈ ఏడాది ఉచిత చేపపిల్లల సీడ్ పంపిణీ ఉంటుందా లేదాని మత్స్యకారుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఎందుకంటే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తామని కానీ, చేయలేమంటూ కానీ ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయలేదు.అయితే జిల్లాస్థాయిలో ఎటా సీడ్ సరఫరాకు జూన్ రెండవ వారంలో టెండర్ల ప్రక్రియ ముగుస్తుంది.కానీ ఈసారి జూన్ కాదుకదా జులై ముగింపు వరకు చేరుకున్నా టెండర్లపై జిల్లా మత్స్యశాఖలో ఎలాంటి కదలిక లేదు.ఉచిత చేపపిల్లల సీడ్ కు సంబంధించిన ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు.
చేపపిల్లలకు బదులు నగదు ఇవ్వాలి..
మండలంలోని 15 గ్రామాల్లో 5 రిజర్వాయర్లు, చెరువులు,కుంటలు మొత్తం 832 అధికారిక లెక్కలు చెబుతున్నాయి.మత్స్య పారిశ్రామిక సంఘాల్లో 9,200 మంది లబ్దిపొందుతుంన్నారు.కాగా గత ప్రభుత్వ హయాంలో సంబంధించిన కాంట్రాక్టర్లు నాణ్యత లేని చేపపిల్లలను పంపిణీ చేశారని,చేపపిల్లల పంపిణీ కూడా తప్పుడు లెక్కలతో మత్స్యకారులను మోసం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి గతంలో జరిగిన అక్రమాల నేపథ్యంలో ప్రస్తుతం చేపపిల్లల పంపిణీకి బదులుగా సొసైటీలకు నేరుగా నగదు ఇవ్వాలని మత్స్యకారులు కోరుతున్నారు.