నవతెలంగాణ – హైదరాబాద్: ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాలలో నిన్న, ఈరోజు ప్రధాని మోడీ పర్యటనలో అభివృద్ధి అంశాల ప్రస్తావన కంటే ఎన్నికల ప్రచారానికే ప్రాధాన్యత ఇచ్చారని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ విమర్శిస్తున్నది. ఇది ఎన్నికల సభ కాదంటూనే ”400 సీట్లు” ,”బీజేపీకే అందరి మద్దతు” అంటూ ప్రసంగం చేసారు. పైగా అయోధ్య రామమందిరానికి బంగారు తలుపులు, ధ్వజస్థంభం తెలంగాణ నుంచే వచ్చాయని, రాముడి ఆశీర్వాదం ఈ రాష్ట్ర ప్రజలపై ఉంటుందని తన హౌదాను మరిచి ఆలయ ధర్మకర్తలా మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధికి ఎంతో చేసామని మాట్లాడిన మోడీ, ఆదిలాబాద్ జిల్లా ప్రజలు సుదీర్ఘ కాలంగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పరిశ్రమను పున:ప్రారంభించాలని, ఆదిలాబాద్ నుండి ఆర్మూర్ వరకు రైల్వేలైన్ మంజూరు చేయాలని, జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని, ఆదివాసీలు అత్యధికంగా ఉండే ఈ జిల్లాకు ప్రత్యేకంగా గిరిజన యూనివర్సిటీని కేటాయించాలని, టెక్స్‌టైల్ పార్క్ కావాలని తదితరాలపై ఐక్య పోరాటాలు చేస్తున్న పట్టించుకోలేదు. సంగారెడ్డి జిల్లాలో అనేక పనులు పెండింగ్‌లో వున్నాయి. నిజాంపేట్-బీదర్ జాతీయ రహదారి, మెదక్ – సంగారెడ్డి రైల్వేలైను, జల్లాలో కేంద్రీయ విద్యాలయం, ట్రామాకేర్ ఏర్పాటు వంటి గురించి ప్రస్తావనే లేదు. ఈ అంశాలన్నీ తమ పరిధిలోనివే అయినప్పటికీ, వీటిపై పల్లెత్తు మాట కూడా ప్రధాని మాట్లాడలేదు. రాష్ట్ర విభజన హామీల అమలు నేటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. నదీజలాల వివాదాలు, రైల్వే కోచ్ ఏర్పాటు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, రహదారుల నిర్మాణం లాంటి అనేక అంశాలు పెండింగ్‌లోనే ఉన్నాయి. దేశాభివృద్ధి తమతోనే సాధ్యమని చేసిన మోడీ ఊకదంపుడు ఉపన్యాసం రాబోయే పార్లమెంటు ఎన్నికల ప్రచారం కోసం తప్ప ఇక్కడ ఉపాధి కల్పనకు, అభివృద్ధికి తోడ్పడేది కాదు.